Advertisement

కరోనా ఉధృతి వృద్ధికి ముప్పే!

Apr 8 2021 @ 00:47AM

కీలక వడ్డీ రేట్లు యథాతథం

వృద్ధి అంచనాల్లోనూ మార్పులేదు 

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

రెపో 4% ; రివర్స్‌ రెపో 3.35%

సీఆర్‌ఆర్‌ 3.50% ; ఎస్‌ఎల్‌ఆర్‌ 18%

వృద్ధి అంచనా 10.5%

రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనా 4.4-5.2%


ముంబై: దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తుండడం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ముప్పేనని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది. 2021-22 ఆర్థిక సంవత్సకారికి ప్రకటించిన తొలి ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీ (రెపో) రేట్లను యథాతథంగా కొనసాగిస్తూనే వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్ల విషయంలో సర్దుబాటు వైఖరిని అవసరమైనంత కాలం కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది. ధరాఘాతాన్ని అదుపులో ఉంచుతూనే ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభ ప్రభావాన్ని తగ్గించే చర్యలను చేపట్టనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. కొవిడ్‌ విజృంభణతో  భవిష్యత్‌పై అనిశ్చితి పెరిగిందని, పరిస్థితులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయినప్పటికీ 2021-22 వృద్ధిరేటు అంచనాలను యథాతథంగానే కొనసాగించినట్టు తెలిపారు. 


మళ్లీ మారటోరియం అవసరం లేదు: రుణాల  చెల్లింపులపై మళ్లీ మారటోరియం ప్రస్తుతానికైతే అవసరం లేదని దాస్‌ అన్నారు. ప్రతికూలతలను ఎదుర్కొనే విషయంలో ఈసారి వ్యాపారాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఆర్‌బీఐ రుణాల తిరిగి చెల్లింపులకు 6 నెలల మారటోరియం కల్పించిన విషయం తెలిసిందే. 


బాండ్ల కొనుగోలుకు జీ-శాప్‌ 1.0: బాండ్‌ మార్కె ట్లో వడ్డీ రేట్లు అనూహ్యంగా పెరగకుండా ఉండేందుకు ఆర్‌బీఐ చర్యలు చేపట్టింన్నారు. ఈ ఏడాది సెకండరీ మార్కెట్‌ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం ‘జీ-శాప్‌ 1.0’ను ప్రకటించింది. తొలి త్రైమాసికంలో రూ.లక్ష కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. 2020 ఏప్రిల్‌-2021 జనవరి మధ్యకాలానికి పదేళ్ల కాలపరిమితి బాండ్ల సరాసరి వడ్డీ రేటు 5.93 శాతంగా నమోదుకాగా, ఈ మార్చి 10 నాటికి 6.25 శాతానికి తగ్గి ప్రస్తుతం 5.85 శాతంగా ఉంది. 


ఏఐఎ్‌ఫఐలకు రూ.50,000 కోట్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరిన్ని రుణాలిచ్చేందుకు అఖిల భారత ఆర్థికసేవల సంస్థలకు (ఏఐఎ్‌ఫఐ) రూ.50,000 కోట్ల ఆర్థిక మద్దతునుప్రకటించింది. ఇందులో భాగంగా నాబార్డ్‌కు రూ.25,000 కోట్లు, సిడ్బీకి రూ.15,000 కోట్లు, ఎన్‌హెచ్‌బీకి రూ.10,000 కోట్లు కేటాయించనుంది. 


ఏఆర్‌సీలపై సమీక్షకు కమిటీ: ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీల (ఏఆర్‌సీ) కార్యకలాపాల సమగ్ర సమీక్ష కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దేశంలో ఏఆర్‌సీల నిర్వహణ సాఫీగా జరిగేందుకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ తగిన ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుంది. 


రైతులకు పంట తాకట్టుపై రూ.75 లక్షల వరకు రుణం : రైతులకు పంట హామీ లేదా తాకట్టుపై రుణాల పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ సంస్థ (డబ్ల్యూడీఆర్‌ఏ)లో రిజిస్టర్‌ చేసుకున్న గిడ్డంగులు జారీ చేసే రసీదుల ఆధారంగా ఇచ్చే తనఖా లేదా హామీపై ఈ రుణాన్ని జారీ చేస్తారు. 


రాష్ట్రాలకు బాసట: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ పరిమితిని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులను ఆర్‌బీఐ ఆమోదించింది. దీంతో రాష్ట్రాలు, యూటీల మొత్తం డబ్ల్యూఎంఏ పరిమితి రూ.47,010 కోట్లకు పెరగనుంది.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.