చిన్నారి ప్రాణం ఖరీదు 20 లక్షలు!

ABN , First Publish Date - 2022-07-18T08:49:22+05:30 IST

చిన్నారి ప్రాణం ఖరీదు 20 లక్షలు!

చిన్నారి ప్రాణం ఖరీదు 20 లక్షలు!

నాలుగేళ్ల బాలుడిని కబళిస్తున్న బోన్‌మ్యారో కేన్సర్‌

రెండన్నరేళ్లకే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స

అది వికటించడంతో మళ్లీ ప్రాణాపాయ స్థితికి

మరో ఆపరేషన్‌కు రూ.20 లక్షలు అవసరం

ఇప్పటికే ఉన్నదంతా అమ్మిన తల్లిదండ్రులు

నిస్సహాయ స్థితిలో దాతల కోసం ఎదురుచూపు


నెల్లూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ముద్దు ముద్దు మాటలతో అమ్మఒడిలో ఆడుకోవాల్సిన ఆ చిన్నారి ఆస్పత్రి బెడ్‌పై అచేతనంగా పడిఉన్నాడు. అభం శుభం తెలియని వయసులో బోన్‌మ్యారో కేన్సర్‌ మహమ్మారి బారినపడిన ఆ బాలుడిని బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్మి రూ.35 లక్షలు పెట్టి ఆపరేషన్‌ చేయించారు. ఇప్పుడా ఆపరేషన్‌ వికటించడంతో ఆ చిట్టి ప్రాణం ఆయుష్షు కోసం పోరాడుతోంది. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి నిస్సహాయులుగా మిగిలిన తల్లిదండ్రులు.. బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. హృదయాలను బరువెక్కిస్తున్న ఈ దీనగాధ వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మేడం కృష్ణారెడ్డి, దయమ్మ దంపతులు పదిహేనేళ్ల క్రితం నెల్లూరుకు వచ్చి స్థిరపడ్డారు. రవీంద్రనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకుంటూ కృష్ణారెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో చిరుద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ప్రదిక్షిత్‌ (6), వర్షిత్‌ (4). గతేడాది చిన్న కుమారుడు వర్షిత్‌ నోటి నుంచి రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించారు. డాక్లరు బోన్‌మ్యారో కేన్సర్‌ అని చెప్పారు. అప్పటి నుంచి వర్షిత్‌ చెన్నైలోని శ్రీ రామచంద్ర వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. వెంటనే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని వైద్యులు సూచించడంతో గతేడాది ఉన్న ఆస్తులమ్మి రూ.35 లక్షలతో ఆపరేషన్‌ చేయించారు. ఆ తర్వాత నెల్లూరుకు వచ్చేయగా కొన్నాళ్లు ఆ బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం మళ్లీ నోటి నుంచి రక్తం కారడంతో మరోమారు వైద్యులను సంప్రదించారు. ఆపరేషన్‌ వికటించిందని, మళ్లీ శస్త్రచికిత్స చేయాలని, అందుకు మరో రూ.20 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి ప్లేట్‌లెట్లు, రక్తం ఎక్కించాలి. దానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఎవరైనా దాతలు సాయం చేస్తేనే ప్లేట్‌లెట్లు, రక్తం ఎక్కిస్తున్నారు. దీంతో తమ బిడ్డను రక్షించండయ్యా అంటూ దీనంగా వేడుకొంటున్నారు. వర్షిత్‌ పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరైనా సాయం చేసేందుకు ముందుకొస్తే.. తమను ఫోన్‌ నెంబర్‌ 8500226454లో సంప్రదించాలని, ఇది తమ ఫోన్‌పే నంబర్‌  కృష్ణారెడ్డి తెలిపారు. ఎస్‌బీఐ బ్యాంకు అకౌంట్‌ వివరాలు.. 30142280185, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌ 000887 ద్వారా సాయం చేయాలని వేడుకొంటున్నారు.

Updated Date - 2022-07-18T08:49:22+05:30 IST