ఓట్ల లెక్కింపు ప్రశాంతం

Sep 20 2021 @ 03:38AM
జమ్మలమడుగులో బ్యాలెట్‌పత్రాల కౌంటింగ్‌ జరుపుతున్న దృశ్యం

ఆరు నెలల తరువాత తేలిన విజేతలు

పలు నియోజకవర్గాల్లో ఎన్నికలను బహిష్కరించిన ప్రతిపక్షం

12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు గానూ..

11 జడ్పీటీసీ, 92 ఎంపీటీసీల్లో వైసీపీ

ఒక జడ్పీటీసీ, 11 ఎంపీటీసీల్లో టీడీపీ విజయం

7 ఎంపీటీసీలు దక్కించుకున్న బీజేపీ.. ఐదింట స్వతంత్రులు

మూడు స్థానాల్లో ఫలితాలు పెండింగ్‌

24మండలాధ్యక్షులు, 25న జడ్పీ చైర్మన  ఎంపిక


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగితే.. హైకోర్టు సింగిల్‌ బెంచ తీర్పుతో ఓట్ల లెక్కింపు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ఆదివారం ఉదయం 8 గంటలకు 16 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యాలు, పోలీసుల వేధింపులను నిరసిస్తూ పలు నియోజకవర్గాల్లో పరిషత ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో ముప్పాతిక శాతం వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ రెబల్స్‌ పోటీ చేశారు. పోటీలో వారే.. గెలుపు వారిదే అన్నట్లు ఫలితాలు ఉన్నాయి. 11 జడ్పీటీసీ, 92 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఒక జడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. 7 ఎంపీటీసీ స్థానాలను బీజేపీ, ఐదు స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. 25న జడ్పీ చైర్మన, 24న మండలాధ్యక్షుల ఎంపికతో ఏడాదిన్నర తరువాత జడ్పీ, మండల పరిషత్తుల్లో నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు, 554 మండల పరిషత ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) ఉన్నాయి. 38 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన 432 ఎంపీటీసీ స్థానాల్లో 417 వైసీపీ, 9 తెలుగుదేశం పార్టీ, రెండింటిని బీజేపీ, నాలుగు స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. మిగిలిన 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీలకు ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగితే.. 4,79,752 ఓటర్లకు గానూ 3,05,074 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ముద్దనూరు మండలంలో పలు ఎంపీటీసీ స్థానాలకు పోలైన ఓట్లు బ్యాలెట్‌ బాక్సుల్లోనే వర్షపు నీటికి తడిసిపోయాయి. అక్కడ ఫలితాల వెల్లడిపై ఎన్నికల సంఘానికి జిల్లా అధికారులు నివేదిక పంపారు. 713 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరకుండా భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ కేకేఎన అన్బురాజన బందోబస్తు తీరును పరిశీలించారు. నామినేషన సందర్భంగా నాడు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాల కారణంగా పలు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఫలితాలు వైసీపీకి ఏకపక్షమయ్యాయి. 


గోపవరంలో సత్తా చాటిన టీడీపీ 

బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రతిపక్ష టీడీపీ సత్తా చాటింది. జడ్పీటీసీ స్థానంతో పాటు ఎన్నికలు జరిగిన నాలుగు ఎంపీటీసీ స్థానాలకు గానూ మూడింట విజయం సాధించింది. జడ్పీటీసీ స్థానానికి 10,058 ఓట్లకు గానూ 9,700 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి నారపురెడ్డి వేణుగోపాల్‌రెడ్డికి 4,680 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి కలువాయి జయరామిరెడ్డి 4779 ఓట్లు సాధించి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 99 ఓట్ల అధిక్యతో విజయం సాధించారు. ఈ మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉంటే.. ఏకగ్రీవంతో కలిపి రెండింటిని వైసీపీ దక్కించుకుంది. మూడు ఎంపీటీసీ స్థానాలు తెలుగుదేశం దక్కించుకుని మండల అధ్యక్ష పీఠం కైవసం చేసుకుంది. జిల్లాలో 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. తక్కువ స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 11 స్థానాలు దక్కించుకోవడం కొసమెరుపు.


ఏడు స్థానాల్లో బీజేపీ విజయం

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఐదు జడ్పీటీసీ, 48 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ పోటీ చేయలేదు. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదినారాయణరెడ్డి బీజేపీ అభ్యర్థులను బరిలో దింపారు. ఎర్రగుంట్లలో ఒకటి, జమ్మలమడుగులో 2, మైలవరంలో 2, ముద్దనూరు, కొండాపురం మండలాల్లో ఒక్కో స్థానం దక్కించుకున్నారు. కాగా ముద్దనూరు, జమ్మలమడుగు మండలాల్లో బ్యాలెట్‌ బాక్సుల్లో వర్షపు నీరు చేరి బ్యాలెట్‌ పత్రాలు తడవడం వల్ల రెండు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు పెండింగ్‌లో పెట్టారు. 


జడ్పీటీసీ విజేతల వివరాలు

జడ్పీటీసీ స్థానం విజేత అభ్యర్థి పార్టీ మెజార్టీ

గోపవరం కె.జయరామిరెడ్డి టీడీపీ 99

బద్వేలు వంకెల చిన్నపోల్‌రెడ్డి వైసీపీ 4,510

చిట్వేలి సి.పుష్పలత వైసీపీ 20,281

కొండాపురం ఎద్దు భారతి వైసీపీ 8,290

ముద్దనూరు బి.ఉమాదేవి వైసీపీ 6,409

మైలవరం వి.మహాలక్ష్మి వైసీపీ 4,500

రైల్వేకోడూరు పాలెంకోట రత్నమ్మ వైసీపీ 24,580

నందలూరు గడికోట ఉషారాణి వైసీపీ 20,566

పెద్దముడియం సి.హిమజ వైసీపీ 6,680

పోరుమామిళ్ల మత్యాల ప్రసాద్‌ వైసీపీ 13,380

పెనగలూరు  పెద్దసుబ్బరాయుడు వైసీపీ 14,328

జమ్మలమడుగు గండ్లూరు అశ్విని వైసీపీ 517


ఎంపీటీసీల వివరాలు

పార్టీ స్థానాలు 

వైసీపీ 92

టీడీపీ 11

బీజేపీ 7

స్వతంత్రులు 5

పెండింగ్‌ 2

మొత్తం 117

జమ్మలమడుగులో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జేసీ గౌతమి


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.