కరోనా కట్టడిలో బెస్ట్, వరస్ట్ దేశాల లిస్ట్ ఇదీ.. భారత్ ఏ జాబితాలో ఉందంటే..

ABN , First Publish Date - 2021-05-06T18:13:24+05:30 IST

గత ఏడాదిన్నర కాలంగా మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజవణికిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఎక్కడో చైనాలోని వ్యూహాన్ నగరంలో పురుడుపోసుకున్న మహమ్మారి.. అనతికాలంలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. వైరస్ ఉధృతికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రిజిల్, ఇటలీ తదితర దేశాలు చిగురాటాకుల వణికిపోయాయి. ప్రస్తుతం భారత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

కరోనా కట్టడిలో బెస్ట్, వరస్ట్ దేశాల లిస్ట్ ఇదీ.. భారత్ ఏ జాబితాలో ఉందంటే..

గత ఏడాదిన్నర కాలంగా మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజవణికిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఎక్కడో చైనాలోని వ్యూహాన్ నగరంలో పురుడుపోసుకున్న మహమ్మారి.. అనతికాలంలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. వైరస్ ఉధృతికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ తదితర దేశాలు చిగురాటాకుల వణికిపోయాయి. ప్రస్తుతం భారత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇలా వైరస్ వెలుగుచూసి ఏడాదిన్నర కావస్తున్నా.. దాని ధాటికి ప్రపంచ దేశాలు ఇప్పటికీ వణికిపోతూనే ఉన్నాయి. మొదట పలు దేశాలు వైరస్‌ను కట్టడి చేయడంలో చాలా వరకు విజయవంతంమయ్యాయనే చెప్పాలి. కానీ, మరోసారి మహమ్మారి విరుచుపడుతుండడంతో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, కరోనాకు ఎదురొడ్డి నిలిచిన కొన్ని దేశాలు మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా వ్యాక్సినేషన్‌లోనూ దూసుకెళ్తున్నాయి. కఠిన చర్యలతో వైరస్‌ను కట్టడిచేసి ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పుతున్నాయి. అలాగే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక పూర్తిగా విఫలమైన దేశాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌లో బెస్ట్‌గా నిలిచిన ఐదు దేశాలను ఇప్పుడు మనం చూద్దాం...


న్యూజిలాండ్

కోవిడ్ కట్టడికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తక్షణమే నిర్ణయం తీసుకుని వైరస్‌పై విజయం సాధించిన దేశం న్యూజిలాండ్. మహమ్మారి ప్రభావాన్ని ముందస్తుగానే అంచనా వేసిన కివీస్ చివరకు వైరస్‌పై పోరులో విజయం సాధించింది. ఇప్పటివరకు న్యూజిలాండ్‌లో కేవలం 2,629 పాజిటివ్ కేసుల, 26 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు గతేడాది జనవరి 28న ఆ దేశ ఆరోగ్యశాఖ.. నేషనల్ హెల్త్ కోఆర్డినేషన్ సెంటర్(ఎన్‌హెచ్‌సీసీ) ఏర్పాటు చేసింది. దీంతో వైరస్ వ్యాప్తిని నివారించడంలో కీలక అడుగు పడినట్లైంది. గతేడాది ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే దేశ సరిహద్దులోనే మహమ్మారిని అడ్డుకునేలా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇక దేశంలో తొలి 100 కేసులు నమోదైన వెంటనే దేశవ్యాప్తంగా 2020 మార్చి 26న సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. ఆర్థికవ్యవస్థ కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌ ఇప్పటికీ దేశవ్యాప్తంగా కోవిడ్-19 నియంత్రణకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా కొత్తకేసులు లేనప్పటికీ విదేశాల నుంచి వచ్చే వారిలో పాజిటివ్‌ వస్తున్నట్లు కివీస్ సర్కార్ తెలియజేసింది.


ఈ ఐదు దేశాలు మహమ్మారి కరోనావైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిస్తే.. మరో ఐదు దేశాలు కరోనాను కట్టడిచేయలేక భారీ మూల్యం చెల్లించుకున్నాయి. ఈ ఐదు దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్‌తో పాటు అమెరికా, బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్ ఈ జాబితాలో ఉన్నాయి. 


అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ఇంతలా విజృంభించడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలే ఓ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మొదట వైరస్‌ను ట్రంప్ తేలికగా తీసుకున్నారు. వైద్య నిపుణులు హెచ్చరించిన ఆయన తన పంతాను వీడలేదు. అసలు అది అంతా పెద్ద రోగమేమి కాదని, దానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడితే సరిపోతుందంటూ చెప్పుకొచ్చారు. ఈ నిర్లక్ష్యమే అమెరికా కొంపముంచింది. చాపకింద నీరులా అతి తక్కువ కాలంలోనే అగ్రరాజ్యంలో భారీ సంఖ్యలో కేసు, మరణాలు నమోదు కావడం మొదలైంది. ఇప్పటివరకు యూఎస్‌లో 3.25 కోట్ల మంది వైరస్ బారిన పడగా, 5.78 లక్షల మరణాలు సంభవించాయి. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదైంది అమెరికాలోనే. ప్రారంభంలోనైతే న్యూయార్క్ నగరం వైరస్‌కు కేంద్ర స్థానంగా మారింది. డైలీ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవించాయి. మధ్యలో కొంతకాలం కేసులు తగ్గిన గతేడాది డిసెంబర్ నుంచి మళ్లీ మహమ్మారి విజృంభించింది. దాంతో రోజువారి కేసులు మూడు లక్షలు దాటాయి. మరణాలు కూడా మూడు వేలకుపైగా నమోదు కావడం ప్రారంభమైంది. అనంతరం జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ఆంక్షల వల్ల వైరస్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం లాంటి చర్యలతో కొంతమేర వైరస్‌ను కట్టడి చేయడంలో బైడెన్ సర్కార్ విజయవంతమైంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తంగా అగ్రరాజ్యం కరోనా కట్టడిలో విఫలమై భారీ మూల్యమే చెల్లించుకుంది. 


తైవాన్

మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలకు తైవానే ఆదర్శమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైరస్ వెలుగుచూసిన డ్రాగన్ కంట్రీకి చాలా దగ్గరగా ఉండే దేశం. చైనాకు కేవలం 130 కి.మీ దూరంలోనే ఉంటుంది. ఈ దేశం జనాభా 2.3కోట్లు. ఇప్పటి వరకు తైవాన్‌లో కేవలం 1,153 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో 12 మంది మృతి చెందారు. తొలుత వైరస్ వెలుగుచూసిన సమయంలోనే చైనాలోని వ్యూహాన్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులను తైవాన్ క్వారంటైన్ చేసింది. అనంతరం దేశంలో కేసులు బయటపడిన తర్వాత టెక్నాలజీ సాయంతో కరోనా రోగులను ట్రేసింగ్ పద్దతిలో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంది. దీంతో గతేడాది ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదైన వేళ.. 200 రోజులపాటు అక్కడ స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.


కానీ, దురదృష్టవశాత్తు నవంబర్‌ 30న ఒకే రోజు 24 కేసులు వెలుగుచూశాయి. వీటిలో అత్యధికంగా ఇండోనేషియా నుంచి వచ్చిన వారు ఉండడం తైవాన్ అధికారులు గుర్తించారు. దాంతో దేశంలోని ఇండోనేషియా వాసులందరికీ టెస్టులు నిర్వహించింది. అనుమానుతుల్ని క్వారంటైన్ సెంటర్లకు తరలించింది. తైవాన్ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ బృందం ఎప్పటికప్పుడు ట్రేసింగ్, టెస్టింగ్‌తో మళ్లీ దేశంలో వైరస్ వ్యాప్తి లేకుండా చూసింది. ఇలా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించిన తైవాన్‌, ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక చైనాలోని వ్యూహాన్‌లో మహమ్మారి విజృంభణను గుర్తించిన తైవాన్... ఈ విషయాన్ని డిసెంబరు 31న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌ఓ)కు తెలియజేసింది. కానీ, తైవాన్‌ మాటలను డబ్ల్యూహెచ్‌ఓ పట్టించుకోలేదు. తేలికగా తీసుకుంది. అయినప్పటికీ తైవాన్‌ మాత్రం ముందుజాగ్రత చర్యగా వైరస్‌ కట్టడికి ముమ్మరంగా ప్రయత్నించింది. సెంట్రల్‌ ఎపిడమిక్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అనుమానితులను ట్రేస్‌ చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికీ ఈ ప్రక్రియ తైవాన్‌లో కొనసాగుతోంది. పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రత్యేక క్యాబ్‌లు ఏర్పాటు చేసి హోటళ్లలో ఉంచుతూ వైరస్‌ వ్యాప్తిని అరికడుతోంది. ఇలా తైవాన్ మహమ్మారి కట్టడిలో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.


ఐస్‌లాండ్‌

కేవలం 3,64,000 జనాభా ఉన్న ఐస్‌లాండ్‌ కూడా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో పైచేయి సాధించింది. ఎలాంటి లాక్‌డౌన్ అమలు చేయకుండా కేవలం ముందస్తు ప్రణాళికతో ఐస్‌లాండ్‌ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొవడం ఇక్కడ గమనించదగిన విషయం. ఇప్పటివరకు ఆ దేశంలో కేవలం 6,491 పాజిటివ్ కేసులు, 29 మరణాలు మాత్రమే సంభవించాయి. అయితే, వైరస్ ప్రబలకుండా ఐస్‌లాండ్ చేసిన మొదటి పని పాజిటివ్‌ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం. అక్కడే చికిత్స అందించడం చేసింది. దాంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటివారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం కూడా చేసింది. 


సింగపూర్​

కోవిడ్-19ను సమర్థవంతంగా కట్టడి చేయడంలో సక్సెస్ అయిన మరో దేశం సింగపూర్. సకాలంలో స్పందించడం, టెస్టుల్లో దూకుడు, వైరస్ వాహకదారులను గుర్తించడం వంటి పద్ధతుల ద్వారా కరోనా వైరస్‌ను సింగపూర్ సమర్థవంతంగా ఎదుర్కొంది. సరైన ప్రణాళిక, భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు, సరిహద్దులపై ఆంక్షలు విధించడం, క్వారంటైన్‌ నిబంధనలు కఠినంగా అమలుచేయడం వంటి చర్యల ద్వారా మహమ్మారిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. 5.7 మిలియన్ల జనాభా గల సింగపూర్‌లో ఇప్పటి వరకు కేవలం 61,252 కేసులు నమోదు కాగా, ఇందులో 31 మంది వైరస్‌కు బలయ్యారు. కాగా, సింగపూర్‌లో గుర్తించిన అత్యధిక కేసుల్లో చాలా వసతి గృహాల్లో ఉండే విదేశీ కార్మికులను తెలుస్తోంది. ఇటీవల నమోదైన కేసుల్లో 90 శాతానికి పైగా ఈ కోవకు చెందిన కేసులేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడున్న యువ జనాభా కారణంగా మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్న మాట. ప్రస్తుతం అక్కడ పాజిటివ్‌ కేసులు సున్నా. అయితే, 2003లో వచ్చిన సార్స్‌ ప్రభంజనం నుంచి పాఠాలు నేర్చుకున్న సింగపూర్.. కరోనా విషయంలో ఆ తప్పు చేయలేదు. అందుకే మహమ్మారిని నిలువరించడంలో విజయవంతమైంది. అటు టీకాల పంపణీలోనూ సింగపూర్‌ దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో ఐదోవంతు మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది.


వియత్నాం

మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో సఫలీకృతమైన మరో దేశం వియత్నాం. చైనాలో కోవిడ్-19 వెలుగు చూపిన వెంటనే వియత్నాం అప్రమత్తమైంది. జనవరి 30, 2020న తొలి కేసు నమోదైన వెంటనే పక్కా ప్రణాళికను రూపొందించుకుంది. అప్పటికీ చాలా దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కానీ, వియత్నాం మాత్రం ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షలను ముమ్మరంగా నిర్వహించింది. ఆ దేశ న్యూ ఇయర్(ల్యూనార్‌ ఇయర్‌) కారణంగా అప్పటికే అక్కడ పాఠశాలలు మూతపడ్డాయి. వీటిని మే నెల వరకూ మూసివేసి ఉంచింది. అంతేకాకుండా విదేశీ పర్యాటకులను అక్కడ నుంచి పంపిచివేసింది. అనంతరం కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్‌ విధించింది. ఇలా కఠిన చర్యలతో వియత్నాం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. దీంతో ఇప్పటి వరకు అక్కడ కేవలం 2,995 కేసులు నమోదయ్యాయి. అలాగే 35 మంది మరణించారు. వైరస్‌ నియంత్రణకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడంతో వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగింది. 


బ్రెజిల్

కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైన దేశాల్లో బ్రెజిల్ కూడా ఉంది. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది బ్రిజిల్‌లోనే. ఇక్కడ 4 లక్షలకు పైగా మంది మహమ్మారికి బలయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో సైతం ట్రంప్ మాదిరిగానే వైరస్‌ను తేలికగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ.. వైద్య నిపుణులు సూచించిన సలహాలను బోల్సోనారో పెడచెవిన పెట్టారు. మాస్కుల నుంచి టెస్టులు, ట్రేసింగ్ విషయంలో కూడా అధ్యక్షుడు పూర్తిగా అలసత్వం ప్రదర్శించారు. దాంతో వైరస్ విజృంభణ మరింతగా పెరిగింది. కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. వృద్ధులు ఎక్కువగా ఉండడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఎంతగా అంటే.. ఒకనొక సమయంలో శవాలను పూడ్చిపెట్టేందుకు కూడా స్థలం దొరకని భయానక పరిస్థితులు తలెత్తాయి. స్మశానవాటిక ముందు హౌస్‌ఫూల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంత జరుగుతున్న అధ్యక్షుడు బోల్సోనారో మాత్రం నిమ్మకు నిరేత్తిన్నట్లు ఉండిపోయారు. వైరస్ కట్టడికి చాలా దేశాలు లాక్‌డౌన్ దిశగా వెళ్లినా.. ఆయన మాత్రం ఒక్కసారి కూడా లాక్‌డౌన్ గురించి ఆలోచించలేదు. వైరస్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో మహమ్మారి మరింత విజృంభించి భారీగా ప్రాణాలు బలిగొంది. 


భారత్

మొదట కరోనా కట్టడికి బాగానే స్పందించిన భారత్, ఆ తర్వాత నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు సెకండ్ వేవ్ బారినపడి విలవిల్లాడుతోంది. గతేడాది జనవరి 17న దేశంలో కరోనా ప్రభావం ప్రారంభమైంది. తొలుత కేసులు పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యకు చేరింది. దాంతో మార్చి 24 నుంచి మే 31 వరకు మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. పలు కఠిన ఆంక్షలను అమలు చేసింది. దీంతో మహమ్మారి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత ఆంక్షలను సడలించడం, జనాలు వైరస్‌ను తేలికగా తీసుకోవడంతో మళ్లీ మహమ్మారి పంజా విసిరింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు వైరస్ అదుపులోనే ఉంది. ఆ తర్వాత నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో డైలీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతుంటే.. మరణాలు మూడు వేలకు పైగానే సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు దొరకని దయనీయ పరిస్థితులు. కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్న వైనం. మొత్తంగా ప్రస్తుతం భారత్‌లో కరోనా వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న ఫలితం లేకుండా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా మందికి వైరస్ సోకగా, 2.26 లక్షల మందిని మహమ్మారి కబళించింది.  


మెక్సికో

కరోనావైరస్ కట్టడిలో ఘోరంగా విఫలమైన దేశాల జాబితాలో మెక్సికో కూడా ఉంది. ఇక్కడ వైరస్ ఇంతలా విజృంభించడానికి కారణం కూడా ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ నిర్లక్ష్యమే. వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ కూడా దేశ సరిహద్దులను మూసివేయలేదు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించలేదు. దీంతో అనతికాలంలోనే వైరస్ చాపకింద నీరులా శరవేగంగా విస్తరించింది. అంతేగాకా యూరోప్, యూఎస్ నుంచి వెళ్లిన టూరిస్టుల ద్వారా కూడా మెక్సికోలో మహమ్మారి విజృంభణకు కారణమైంది. గతేడాది మార్చిలో అక్కడ కరోనా ఉధృతి తారస్థాయికి చేరింది. దాంతో చేసేదేమిలేక మార్చి 30న లాక్‌డౌన్ విధించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరించింది. భారీగా కేసులు, మరణాలు పెరిగాయి. ఇప్పటి వరకు మెక్సికోలో 2.17 లక్షల మంది వైరస్‌కు బలయ్యారు. 2.35 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. ఇలా మెక్సికో మహమ్మారి కట్టడిలో పూర్తిగా విఫలమైంది. 


బ్రిటన్

యూకేలో లాక్‌డౌన్ విషయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో వైరస్ మరింత విజృంభించింది. మొదట వైరస్ అంత ప్రమాదకారి ఏమీ కాదని, సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకుంటే సరిపోతుందని ప్రధాని ప్రజలకు చెప్పారు. ఈ అలసత్వమే బ్రిటన్ కొంపముంచింది. వైరస్ వ్యాప్తి పెరిగింది. 285 మరణాలు నమోదైతే గానీ, ప్రధానికి వైరస్ ప్రభావం గురించి తెలిసి రాలేదు. దాంతో హూటాహూటిన లాక్‌డౌన్ ప్రకటన చేశారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో అక్కడి కొత్త కరోనా వేరియంట్లు బయటపడ్డాయి. దాంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది. రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతూ పోయాయి. యూకేలో ఇప్పటి వరకు 1.27 లక్షల మంది కరోనాతో మరణించారు. అలాగే 4.44 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారు. లాక్‌డౌన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్‌లో కూడా బోరిస్ జాన్సన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడమే భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదు కావడానికి కారణమైందని వైద్య నిపుణుల అభిప్రాయం. 

Updated Date - 2021-05-06T18:13:24+05:30 IST