దేశాన్ని మరింత బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-01T08:00:14+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పౌరుడిని ప్రభావితం

దేశాన్ని మరింత బలోపేతం చేయాలి

  • సముద్రం నుంచి అంతరిక్షం వరకూ...
  •  యూపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ 


మహారాజ్‌గంజ్‌/బల్లియా/ఖుషీనగర్‌, ఫిబ్రవరి 28: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని భారత్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌, బల్లియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో ఆయన ప్రసంగించారు. పెద్ద రాష్ట్రం అయినందున, దేశాన్ని శక్తిమంతం చేయడంలో యూపీపై గొప్ప బాధ్యత ఉందన్నారు. దేశ సరిహద్దుల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘‘వైబ్రెంట్‌ విలేజ్‌’’ పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని చెప్పారు.


కాగా.. యూపీలో అధికారంలో ఉన్న సమయంలో ఎస్పీ, బీఎస్పీలు కులాల ప్రాతిపదికగా పనిచేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. బీజేపీ మాత్రం 2017 నుంచి అన్ని వర్గాల వారికోసం పనిచేసిందని చెప్పారు. ఖుషీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే బాలికలకు ఉచితంగా స్కూటర్లు ఇస్తామని, ఉన్నత విద్య చదివే పేద యువతకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇస్తామని, ఐదేళ్ల పాటు రైతులు కరెంటు బిల్లులు చెల్లించొద్దని లేదని షా చెప్పారు. 


దేశాభివృద్ధిలో ‘పీఎం గతిశక్తి’ కీలకం: మోదీ

దేశాభివృద్ధిలో ‘పీఎం గతిశక్తి’ కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సమన్వయం, పర్యవేక్షణ ద్వారా మెరుగైన మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందన్నారు. కార్పొరేట్‌ సంస్థలు సర్కారుతో భాగస్వామ్యం కావాలని కోరారు. ‘పీఎంగతిశక్తి’పై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. 


మోదీ ప్రసంగిస్తుండగా సభాస్థలిని వీడిన జనం

యూపీలోని సొంత నియోజకవర్గం వారణాసిలో మోదీకి భంగపాటు ఎదురైంది. వారణాసిలో ఇటీవల ఓ సభ నిర్వహించారు. బీజేపీకి చెందిన 20వేల మంది బూత్‌ ఆఫీస్‌ బేరర్లు హాజరయ్యారు. మోదీ అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. ఆయన కోసం ఎదురుచూసి విసిగిపోయిన పలువురు నేతలు.. మోదీ ప్రసంగిస్తుండగానే సభాస్థలిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. 


Updated Date - 2022-03-01T08:00:14+05:30 IST