జిల్లేళ్లు మొలుస్తున్న దేశం

ABN , First Publish Date - 2022-06-22T10:15:20+05:30 IST

తగలబడుతున్న దేశంపైన సముద్రాన్ని పిచ్కారీ చేయండి పిడికిలెత్తిన యువసత్తువ భుజాల మీదినుండి...

జిల్లేళ్లు మొలుస్తున్న దేశం

తగలబడుతున్న దేశంపైన

సముద్రాన్ని పిచ్కారీ చేయండి

పిడికిలెత్తిన యువసత్తువ భుజాల మీదినుండి

నిరుద్యోగ కావళ్లు కిందికి దించేయండి

శాంతి కరువైన దేశంలో మొలచిన

విప్లవ వృక్షాలపైన బుల్‌డోజర్లు కాదు

వృత్తి జలాన్ని మంత్రించి చిలకరించండి

గన్‌కల్చర్ ఆలోచనల్ని పక్కకి తోసి

సంస్కారవారధికి రాళ్లెత్తండి

పాలకులారా! ఫలిత పండితులారా!

ఎన్ని తప్పటడుగులు వేశారో లెక్కించండి

దేశ సామూహిక స్వేదామృతంపై అమ్మకం బోర్డు

మీ దివాళా రాజనీతిపైన ఎగురుతున్న జెండా

సరిహద్దుల్ని దేశరక్షణ కోసం కాక

కేవలం మీ రాజకీయ చతురత కోసం

శత్రువుల అష్టదిగ్బంధనానికి గురిచేయకండి

యువతకి మార్గదర్శకత్వం మానేసి

వలపైన ఆశల గింజలు చల్లకండి

యువశక్తి పావురాల గుంపుకాదు

అది అణుశక్తి ప్రభంజనం

ఈ దేశానికి వెన్నెముక రైతన్న ఐతే

రైతన్న రెక్కల్లో కారుతున్న స్వేదం యువత

దేశ రక్షణని ఫణంగా పెట్టి

యువకుల భవితపై గొడ్డలిపెట్టు వేయకండి

మరవకండి–

మీ అగ్నిపథాల పథకాలు

ఆ కిరణాగ్ని సమిధల్ని ఆర్పలేవు!

ఈతకోట సుబ్బారావు 


Updated Date - 2022-06-22T10:15:20+05:30 IST