అధికారుల పల్లెబాట

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ఇక అధికార యంత్రాంగమంతా పల్లెబాట పట్టబోతోంది.

అధికారుల పల్లెబాట
సారంగాపూర్‌ మండలంలోని జామ్‌ గ్రామ పంచాయతీ ఇదే

ఇక గ్రామాలకు అధికారులు 

కరోనా ఎత్తివేతతో పనులపై పర్యవేక్షణ 

జిల్లా వ్యాప్తంగా పారిశుధ్యం, ఆరోగ్యంపై నజర్‌ 

సీఎం హెచ్చరికలతో కదలిక 

నిర్మల్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ఇక అధికార యంత్రాంగమంతా పల్లెబాట పట్టబోతోంది. కరోనాతీవ్రత కారణంగా అన్నిశాఖల అధికారులు ఇప్పటి వరకు ఉన్నచోటుకే పరిమితమయ్యారు. దీంతో పాటు లాక్‌డౌన్‌ కొనసాగింపుతో పూర్తిస్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే కాకుండా అన్ని రకాల అధికారిక కార్యకలాపాలు అంతంత మాత్రంగానే కొ నసాగాయి. దీని కారణంగా జనం ఇబ్బందులపాలయ్యారు. అయితే వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, పారిశుధ్య సిబ్బంది మాత్రమే పూర్తిస్థాయిలో విధులు చేపట్టినప్పటికీ మిగతాశాఖల పనితీరు లాక్‌డౌన్‌ కారణంగా స్తంభించిపోయింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెప్రగతి, పట్టణప్రగతిలపై సమీక్ష జరపడమే కాకుండా అధికారులంతా గ్రామాలకు తరలాలంటూ ఆదేశించారు. కరోనాకు ముందు ప్రతీ రెండు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీల వారీగా అధికారులు అన్నిశాఖలతో కలిసి 29 అంశాలపై గ్రామసభలు నిర్వహించేవారు. ఈ గ్రామసభలు పల్లెలప్రగతికి దిశానిర్దేశం చేసేందుకు తోడ్పడేవి. అధికార యంత్రాంగమంతా గ్రామసభల్లో పాల్గొని స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు వారి అవసరాలను గుర్తించి చర్యలు చేపట్టేది. 29 అంశాల్లో పారిశుధ్యం, అలాగే ప్రజల ఆరోగ్యం, విద్య, పశువైద్యంతో పాటు వివిధ సంక్షేమ పథకాల లాంటి వాటిపై సమీక్ష జరిగేది. ప్రస్తుతం కరోనా కారణంగా గత నాలుగైదు నెలల నుంచి గ్రామసభలు నిర్వహించకపోవడం, అలాగే అధికారుల పర్యటనలన్నీ నిలిచిపోవడంతో పల్లెప్రగతి గాడి తప్పింది. దీంతో పాటు జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో సైతం పారిశుధ్యం సమస్య అక్కడి పాలకవర్గాలకు సవాలుగా మారుతోంది. అయితే ప్రభుత్వం కరోనాతీవ్రత తగ్గిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు నిర్ణయించింది. ఆదివారం నుంచి అన్ని రకాల కార్యకలాపాలు మళ్లీ యథావిధిగా జరగనున్నాయి. చివరకు హోటళ్లు, సినిమా థియేటర్‌లు, బార్లు యధావిధిగా నడుస్తాయి. దీంతో పాటు పంక్షన్‌హాల్‌లను కూడా తెరవబోతున్న కారణంగా ఇప్పటి వరకు నిలిచిపోయిన పెండ్లివేడుకలు మళ్లీ మొదలుకాబోతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వారందరికి మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికార యంత్రాంగం పల్లెభాటపట్టి స్థానికులందరికీ మనోదైర్యం కల్పించడమే కాకుండా వారికి బాసటగా నిలవబోతోంది. అధికారులు పల్లెబాటతో పాటు పల్లెనిద్ర కూడా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో పాటు అధికారులే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులంతా వరుసగా పల్లెనిద్ర చేపడుతూ గ్రామసభలు నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న సర్కారు ఆదేశాలు లాక్‌డౌన్‌ ఎత్తివేతతో సంపూర్ణంగా అమలుకానున్నాయంటున్నారు. 

కసరత్తు  మొదలుపెట్టిన అధికారులు

ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమ నిర్వహణలో భాగంగా అధికారులందరినీ పల్లెబాట పట్టాలంటూ ఆదేశించడంతో సంబందిత యంత్రాంగం తమతమ శాఖల వారిగా ప్రణాళికలు రూపొందిస్తోంది. గత మూడునాలుగు నెలల నుంచి తమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులతో పాటు కొత్తగా చేపట్టబోయే పనులు, వాటి అమలు తీరు, గ్రామస్థుల భాగస్వామ్యం, నిధులు లాంటి అంశాలపై ఇక సమీక్షలు కొనసాగనున్నాయి. ప్రతిరెండు నెలలకొసారి జరగాల్సిన గ్రామసభలు నిలిచిపోయిన తరుణంలో కొత్త ప్రతిపాదనల రూపకల్పనలో యంత్రాంగం తలమునకలవుతోంది. ఈ సారి గ్రామాల్లో పారిశుధ్యం, ఆరోగ్యరంగాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించనున్నారు. వర్షకాలం మొదలైన నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ముఖ్యంగా కలుషిత నీరు, దోమల నివారణ లాంటి వాటికి ఈ సారి ప్రాధాన్యతనిస్తూ కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి కేంద్రీకరించనున్నారు. గ్రామసభల సందర్భంగా ఇదే అంశాన్ని చర్చించాలని నిర్ణయించారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, సానిటైజర్‌ను ఉపయోగించడం లాంటి వాటిని తప్పనిసరి చేసుకోవాలంటూ ఈ గ్రామసభల ద్వారా సందేశం ఇవ్వనున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు పకడ్భందీ చర్యలు మొదలుపెట్టారు. 

పల్లెనిద్రకు ప్రాధాన్యత

పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టబోతున్న పల్లెబాట ప్రజలకు భరోసా మరింతగా పెంచే విధంగా ఉండాలన్న ఆదేశాలు సర్కారు నుంచి జారీ అయ్యాయి. మొక్కుబడిగా కాకుండా ప్రణాళికబద్దంగా పల్లె ప్రగతిని అమలు చేయాలని నిర్ణయించారు. ఓ వైపు 29 అంశాలకు సంబంధించి అధికారులను పల్లెప్రగతికి సన్నద్దం చేస్తూనే మరోవైపు సంబంధిత మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులందరినీ ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ, తమ నియోజకవర్గాల్లోని అత్యధిక సమస్యలున్న గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగానే ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా పల్లెనిద్ర చేపట్టాలని కూడా సర్కారు ఆదే శించింది. దీంతో అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు పల్లెల్లోనే తిష్ట వేసి ప్రగతిని సమీక్షించనున్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అభివృద్ది సంక్షేమ పథకాల కోసం గానూ విడుదల చేస్తున్న నిధుల వ్యయంపై కూడా ఫోకస్‌ పెట్టనున్నారు. ఈ సారి ప్రజల్లో కరోనాపై మరింత అవగాహన పెంపొందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీని కోసం గాను విద్య, వైద్యం, పారిశుధ్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత అధికారులను ఇటువైపు పురమాయించాలని యో చిస్తున్నారు. థర్డ్‌వేవ్‌ కరోనా ప్రభావం రాకుండా అడ్డుకునేందుకు ప్రజలు భౌతికదూరం, మాస్క్‌లు, సానిటైజర్‌ల నిబంధనలను తప్పనిసరిగా పాటించే విధంగా చూడాలని కూడా చర్యలు చేపట్టబోతున్నారు. 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST