విధ్వంసం వెనుక ఆవుల?

ABN , First Publish Date - 2022-06-19T09:13:07+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం పాత్రదారులు ఏపీ, తెలంగాణకు చెందిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సన్నద్దమవుతున్న అభ్యర్థులైతే వారి వెనుక ఉండి కథంతా నడిపించింది ఓ శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్న వ్యక్తి అని గుర్తించారు.

విధ్వంసం వెనుక ఆవుల?

  • సికింద్రాబాద్‌ దాడుల సూత్రధారి 
  • సుబ్బారావుగా ప్రాథమిక నిర్ధారణ
  • సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ
  • ప్రకాశం జిల్లా  కంబంలో ఆవుల అరెస్టు
  • పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు..
  • తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు 9 శిక్షణా కేంద్రాలు 
  • ‘అగ్నిపథ్‌’ దుర్మార్గమంటూ 10 వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం
  • ‘చలో సికింద్రాబాద్‌’ నినాదంతో అభ్యర్థులకు మెసేజ్‌లు
  • బోగీలకు నిప్పు పెట్టింది నరసరావుపేటకు చెందిన 10 మంది?
  • మరో 52 మంది అరెస్ట్‌.. ఫోన్లు సీజ్‌.. వాట్సాప్‌ గ్రూపుల విశ్లేషణ 


హైదరాబాద్‌ సిటీ, అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం పాత్రదారులు ఏపీ, తెలంగాణకు చెందిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సన్నద్దమవుతున్న అభ్యర్థులైతే వారి వెనుక ఉండి కథంతా నడిపించింది ఓ శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్న వ్యక్తి అని గుర్తించారు. ఈ మేరకు విధ్వంసం వెనుక ఏపీలోని ప్రకాశం జిల్లా కంబం వా స్తవ్యుడు, తెలుగు రాష్ట్రాల్లో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసి.. తన ప్రసంగాలతో అకాడమీలో శిక్ష ణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి.. ఆందోళన కార్యక్రమానికి పథకం పన్ని.. అందుకు వేదికగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి.. వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌చేసి.. అభ్యర్థులను తరలింపులో అన్నీతానై వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆవులను కంభం పోలీసులు శనివారం అరెస్టు చేయగా.. తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌కు తరలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆవులను రైల్వే పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిరసన జరుగుతున్న క్రమంలో రైళ్లపై దాడికి పాల్పడి, ఆందోళన హింసాత్మకంగా మారడానికి కారణం ఏపీలోని నరసరావుపేటకు చెందిన పది మంది అని, వారంతా సాయి డిఫెన్స్‌ అకాడమీ అభ్యర్థులు అని విచారణలో తేలినట్లు తెలిసింది. ఇప్పటికే  పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేసినట్లు సమాచారం. 


అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ..

ఆవుల సుబ్బారావు గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యా డు. పదమూడేళ్ల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఏటా వందల మందికి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ ఇస్తున్నాడు. తెలుగురాష్ట్రాల్లో 9 వరకు సాయి డిఫెన్స్‌ పేరుతో శిక్షణ కేంద్రాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ‘అగ్నిపథ్‌’ గురించి ప్రకటన చేసిన తర్వాత ఈ పథకం ఆర్మీ ఉద్యోగాలకు గండికొట్టేలా ఉందని తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆవుల చెప్పాడు. సికింద్రాబాద్‌ అల్లర్లకు మూడు రోజులు ముందు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గుంటూరులో ఆవు ల భారీ ఆర్మీర్యాలీ నిర్వహించాడు. ఇందులో ఆయన అకాడమీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సన్నద్ధమవుతున్న వందలమంది అభ్యర్థులు పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి ఆవుల మాట్లాడారు. అగ్నిపథ్‌ దుర్మార్గమైన పథకం అని, ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలని కలలుగనే యువత ఆశయాలకు గండికొట్టేలా ఉందని ఉపన్యసించినట్లు తెలిసింది. 


వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటు 

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థులంతా నిరసన తెలియజేయాలని, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళన నిర్వహించి డిల్లీకి తెలిసేలా చేయాలని ఆవుల నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు వివిధ ఆర్మీ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఆయన సమన్వయం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువకులు సమాచారం షేర్‌ చేసుకునేలా హాకీంపేట సోల్జర్స్‌, వరంగల్‌ ఆర్మీ, ఆదిలాబాద్‌ ఆర్మీ సోల్జర్స్‌, గుంటూరు సోల్జర్స్‌ అనే ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయించాడు. హకీంపేట్‌ ఆర్మీ సోల్జర్స్‌ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో ‘సాయి డిఫెన్స్‌ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు గారు హైదరాబాద్‌కు చేరుకున్నారు.. రేపు (ఘటన జరిగిన 17వ తేదీ) జరిగే నిరసన ర్యాలీకి మద్దతు తెలపనున్నారు.. మిగతా డైరెక్టర్లు కూడా సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాం’ అంటూ మహిర అనే పేరుతో గురువారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఓ మెసేజ్‌ పోస్టయినట్లుగా ఏపీ పోలీసులు గుర్తించారు. కాగా ‘చలో సికింద్రాబాద్‌’ అనే నినాదంతో అభ్యర్థులకు ఆవుల మెసేజ్‌లు పంపాడు. ఆయన ప్రభావంతో అభ్యర్థులంతా మన ఉద్యోగాల కోసం మనమే పోరాడాలి అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, ప్రసంగాలు, వీడియోలు పోస్టులు చేసుకున్నారు. చాలా మంది గురువారం రాత్రే సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. కొంతమందికి నగరంలోని ఆవుల అకాడమీలోనే బస ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  గుంటూరు, నరసరావుపేట నుంచి సుమారు 450 మంది అభ్యర్థులు రైల్లో శుక్రవారం ఉదయానికే సికింద్రాబాద్‌ చేరుకున్నారు. ఆ తర్వాత నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.


విధ్వంసానికి కారణం ఆ పదిమందేనా..?

గుంటూరు, నర్సారావుపేట నుంచి వచ్చిన 10 మంది అభ్యర్థులు రైలు బోగీల్లోకి వెళ్లి నిప్పు పెట్టినట్లు విచారణలో తేలింది. వారు అలా చేయడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహాజ్వాలలు ఎగిసిపడి ఉద్రిక్తతకు దారితీసింది. ఫలితంగానే ఈ ఘటన రైల్వే పోలీసుల లాఠీచార్జి చేయడం.. ప్రతిగా అభ్యర్థులు రాళ్లదాడికి దిగడం.. చివరికి పోలీసుల కాల్పుల దాకా వెళ్లింది. ఇలా అరగంట లోనే సికింద్రాబాద్‌ రైల్యే స్టేషన్‌ రణరంగంగా మారింది. ముందస్తు పథకం ప్రకారమే ఆవుల సుబ్బారావు.. నిరసనకారులకు అవసరమైన పులిహోర ప్యాకె ట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు సరఫరా చేశాడు. గుంటూరు, నర్సారావుపేట నుంచి వచ్చిన 450 మంది అభ్యర్థుల తాలూకు ఖర్చులు ఆయనే భరించినట్లు విచారణలో తేలింది. కాగా, విధ్వంసానికి కారణమైన వారిలో 52 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో 19 మంది గోపాలపురం పోలీసుల అదుపులో ఉండగా.. మిగిలిన వారిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటుపై ఆరా తీసి నట్లు సమాచారం. విచారణ అనంతరం గోపాలపురం పోలీసు లు 19 మంది నిరసనకారులకు గాంఽధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాత్రి ఎల్బీనగర్‌లోని రైల్వే కోర్టు జడ్జి నివాసంలో హాజరుపర్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 



Updated Date - 2022-06-19T09:13:07+05:30 IST