లాభాల ‘పంట’

ABN , First Publish Date - 2022-06-28T05:47:17+05:30 IST

లాభాల ‘పంట’

లాభాల ‘పంట’
కురవి మండలం కొత్తూరు (సి)లో కాతకు వచ్చిన ఆయిల్‌పామ్‌ తోట, కొత్తూరు(సి) చెట్టు నుంచి ఆయిల్‌పామ్‌ గెలలను తీస్తున్న జిల్లా కలెక్టర్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థ చైర్మన్‌

ప్రస్తుతం 1,006 ఎకరాల్లో సాగు

హరిపిరాలలో 50 ఎకరాలలో నర్సరీ ఏర్పాటు

ఈ ఏడాదిలో 6,800 ఎకరాల సాగుకు ప్రతిపాదన


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జూన్‌ 27 : మూడేళ్ల క్రితం వేసిన ఆయిల్‌పామ్‌ తోటలు కాత కాసి నేడు తొలి పంట దిగుబడి చేతికి వచ్చింది. జిల్లా అధికార యంత్రాంగం ప్రోత్సాహంతో ఆయిల్‌పామ్‌ తోటలు విస్తరిస్తున్నాయి. మానుకోట జిల్లాలో ఆయిల్‌పామ్‌ు తోటలు పంట దిగుబడి వస్తుందో.. లేదోనన్న అనుమానాలకు పటాపంచాలు చేస్తూ పంట దిగుబడి రావడంతో ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేస్తున్న.. తోటను సాగు చేయాలనుకున్న రైతులకు అనుమానాలు తొలిగిపోయాయి. రాష్ట్రంలోనే మానుకోట జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆయిల్‌పామ్‌ పంట దిగుబడి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆయిల్‌పామ్‌ తోటలను మరింత విస్తరించడానికి జిల్లా ఉద్యానవనశాఖ, అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ ఏడాది 6,800 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకోసం జిల్లాలోని వివిధ మండలాల్లో రైతులను చైతన్యం చేస్తున్నారు. 


2020లోనే ప్రారంభమైన తోటలు..

జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటలు పెంచడానికి ఈ భూములు అనుకూలంగా ఉన్నాయని పలుమార్లు అధికారుల బృందం సర్వే జరిపింది. 2020లో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు కురవి, నర్సింహులపేట, డోర్నకల్‌, తొర్రూరు, మహబూబాబాద్‌ మండలాల్లో ప్రయోగాత్మకంగా 305 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలను సాగుచేశారు. గతేడాది 701 ఎకరాలను సాగు విస్తీర్ణం పెంచారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరి, ఇతర పంటలు వేయడానికి బదులు ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేసి అత్యధిక లాభాలు గడించాలని జిల్లా కలెక్టర్‌ శశాంక, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి కె.సూర్యనారాయణ రైతులను ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారు. లేబర్‌, కోతుల సమస్య ఉండదని, నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈసారి 6,800 ఎకరాల్లో సాగు చేయడానికి రైతులను ఎంపిక చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అందుకనుగుణంగా జిల్లాలోని తొర్రూరు మండలం హరిపిరాలలో నర్సరీలో నాలుగు లక్షల ఆయిల్‌పామ్‌ మొక్కలను పెంచుతున్నారు. 


కాగా, 2019లోనే మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ యానాల ఇంద్రసేనారెడ్డికి కురవి మండలం కొత్తూరు (సి) గ్రామంలో 20 ఎకరాల భూమి ఉంది. ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే లాభాలు గడించవచ్చునని ఆలోచించిన ఆ డాక్టర్‌ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుంచి మొక్కలు తీసుకువచ్చి సాగు చేశారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆయిల్‌పామ్‌ పంట దిగుబడి ఆయన తోటలోనే వచ్చింది. ఒక చెట్టుకు పది నుంచి పద్నాలుగు గెలలు కాతకాయగా, ఒక్కొ క్క గెల ఎనిమిది నుంచి 10 కిలోలల బరువు ఉన్నాయి. జిల్లాలో మొదటిసారి కాత వచ్చినందుకు గాను ఇంద్రసేనారెడ్డిని ఇటీవల జిల్లా కలెక్టర్‌ శశాంక, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ సంస్థ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి శాలువ కప్పి మెమోంటో ఇచ్చి సన్మానించారు. 


హరిపిరాలలో నర్సరీ ఏర్పాటు..

తొర్రూరు మండలం హరిపిరాలలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని మూడేళ్ల క్రితం సేకరించారు. ఆయిల్‌పామ్‌ నర్సరీని ఏర్పాటు చేసి అందులో ఈ ఏడాది నుంచే మొక్కలు పెంచి జిల్లాలోని ఇతర రైతులకు అందిస్తున్నారు. గోపాలగిరి గ్రామంలో మరో 70 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ స్థాపించడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. రానున్న రోజుల్లో జిల్లాలో 20 వేల నుంచి 25 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు విస్తీర్ణ పెరిగితే అక్కడ ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్థాపించడానికి ముందుకు వస్తుంది.  పండించిన గింజల నుంచి ఆయిల్‌ వస్తుండగా దీంతో పాటు చెట్టు మట్టల నుంచి పీచు పదార్థాలు ఎరువులుగా ఉపయోగపడతాయి. ఫ్యాక్టరీ ఏర్పాటైతే రైతులతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గతంలో అశ్వారావుపేట నుంచి మొక్కలు తీసుకువచ్చి తోటలు సాగు చేస్తుండగా ఈ ఏడాది నుంచి హరిపిరాలలో నర్సరీ ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాలకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క మొక్క రూ.200 ఉండగా అన్ని వర్గాల రైతులకు రూ.180 సబ్సిడీ ఇచ్చి రైతు తన వాటగా రూ.20 చెల్లిస్తే ఒక మొక్క అందజేస్తారు. అంతేకాకుండ ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు నాలుగేళ్ల వరకు రూ.4,100 వరకు సబ్సిడీ అందజేస్తారు. అలాగే డ్రిప్‌ ఏర్పాటు చేసుకుంటే రూ.15వేల నుంచి రూ.16వేల వరకు సబ్సిడీ ఉంది. 


ఆయిల్‌పామ్‌తో ఆదాయం పొందవచ్చు : కె.సూర్యనారాయణ, జిల్లా ఉద్యానవన అధికారి

జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటలు పండుతాయో.. లేదోన్నన్న అనుమానాలు కొత్తూరు (సి)లో దిగుబడి రావడంతో తొలగిపోయాయి. కొత్త పంట మొదటిసారిగా వస్తున్నందున ఎకరాకు 12 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆరు సంవత్సరాల్లో మరింత పెరిగి ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఆదాయం పొందవచ్చు. పంట వేసిన మూడు సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. వరి, ఇతర పంటలు సాగు చేసే బదులుగా ఆయిల్‌పామ్‌ సాగుచేసుకుంటే మంచిది. ఈ పంటలకు ప్రభుత్వం కూడా సబ్సిడీ అందిస్తుంది. 


 తోటలు సాగు చేస్తే మంచిదే... : డాక్టర్‌ యానాల ఇంద్రసేనారెడ్డి, ఆయిల్‌పామ్‌తోట యాజమాని, మహబూబాబాద్‌ 

కురవి మండలం కొత్తూరు (సి) గ్రామంలో 20 ఎకరాల్లో ఓ శాస్త్రవేత్త సూచన మేరకు 2019లో ఆయిల్‌పామ్‌ తోటను సాగు చేశాను. అశ్వారావుపేట నుంచి మొక్కలు తీసుకువచ్చి సాగు చేశాను. మూడు నెలల ముందే కాయ కోతకు వచ్చింది. ఒక చెట్టుకు 10 నుంచి 14 గెలలు కాయగా 8 కిలోల నుంచి 10 కిలోల బరువు ఉన్నాయి. ఆ తోటలో వేరుశనగతో పాటు పసుపు అంతర్‌పంటగా వేయడంతో అదనపు ఆదాయం వచ్చింది. రైతులు ఆలోచించి ఆయిల్‌పామ్‌ తోటలు చేసుకుంటే లాభదాయకమే. 

Updated Date - 2022-06-28T05:47:17+05:30 IST