పాపాలకు పరాకాష్ఠ విగ్రహ విధ్వంసం

ABN , First Publish Date - 2021-01-12T06:30:42+05:30 IST

దేవుని భూములను అన్యాక్రాంతం చేస్తే పాపం తగులుతుంది అధ్యక్షా!’ అని వైసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం..

పాపాలకు పరాకాష్ఠ విగ్రహ విధ్వంసం

దేవుని భూములను అన్యాక్రాంతం చేస్తే పాపం తగులుతుంది అధ్యక్షా!’ అని వైసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ, దేవాలయాలపై దాడులు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, గత 18 నెలలుగా ఆలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. టీటీడీ నుంచి సింహాచలం వరకు ఆలయ భూములపై తిమింగలాలు కన్ను వేశాయి. దేవాదాయ శాఖ నిధులను ఎడాపెడా జగన్మోహన్ రెడ్డి తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రకటించిన పథకాలకు మళ్లిస్తున్నారు. రాష్ట్రమంతటా వాలంటీర్లను నియమించి క్రైస్తవ మత మార్పిడికి ఉపయోగించుకుంటున్నారు. పోలీసు వ్యవస్థను కూడా తమ చెప్పు చేతల్లోకి తీసుకుని జగన్ ప్రభుత్వంలో హిందూ వ్యతిరేక ధోరణులను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని సైతం అరెస్టు చేసి భయకంపిత వాతావరణం సృష్టిస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన ఈ దుశ్చర్యల వల్ల ఆయనకు ఎంత పాపం తగలాలి? అసలు పాపం అన్న పదానికి ఆయనకు అర్థం తెలుసా?


అంతర్వేది రథం దగ్ధం, దుర్గ గుడిలో సింహాల ప్రతిమల చోరీ, రామతీర్థంలోని కోదండ రామాలయంలో విగ్రహ ధ్వంసం, ఆ ప్రతిమ శిరస్సును కోనేట్లో పడేయడం, రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతులు విరగ్గొట్టడం, కర్నూలులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి రోడ్డుపై పడేయడం, బిట్రగుంటలో ప్రసన్నాంజనేయ స్వామి రథం దగ్థం, మంత్రాలయంలో ఆదిశేషుడి పడగలు విరగ్గొట్టడం... ఇలా వందలాది ఘటనలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి వద్ద ఇలాంటి ఘటనలకు సంబంధించిన వివరాలు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల ఆయన చేసిన ఒక ప్రకటనను బట్టి తెలుస్తోంది. తాను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వెంటనే తన ప్రతిష్ఠ తగ్గించేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. యథా ప్రకారం మొసలి కన్నీళ్లు కార్చి దేవుడు ఇలాంటి దాడులుచేసిన వారిని క్షమించడని, దేవుడితో రాజకీయాలు ఆడిన వారిని వదిలిపెట్టబోమని వీరంగం ఆడుతున్నారు. నిజానికి దేవాలయాలపై దాడులు చేసిన వారిని జగన్ ఎందుకు క్షమిస్తున్నారు? ఇప్పటి వరకూ వారిలో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదు? అని బిజెపి ప్రశ్నిస్తోంది. అసలు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హిందూ మత వ్యతిరేక శక్తులు ఎందుకు రెచ్చిపోతున్నాయి? ఏ ధైర్యంతో ఆ శక్తులు హిందూ మత దేవాలయాలపై, ఆస్తులపై దాడులు చేస్తున్నాయి? అసలు దేవాలయాలపై దాడులు చేయడం తప్పని, తమను అరెస్టు చేస్తారనే భయం వారిలో ఎందుకు కలగడం లేదు? పోలీసు ఉన్నత శాఖలోనే కాక అనేక కీలక పదవుల్లో ఒకే మతానికి చెందిన వారిని నియమించడం వల్లే ఈ మత శక్తులకు ప్రోద్బలం లభిస్తోందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.


కొండను త్రవ్వి ఎలుకను పట్టిన చందంగా విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో దైవ ప్రతిమను ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ఎలెక్ట్రిక్ రంపాన్ని తాము కనిపెట్టామని, రాజమండ్రిలో కూడా ఆలయ దాడికి ఇదే రంపాన్ని ఉపయోగించారని సిఐడి పోలీసులు, శాంతి భద్రతల విభాగం ఉన్నతాధికారులు ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. అంతర్వేదిలోని చర్చిలో రెండు అద్దాలు పగిలితేనే 43 మందిని అరెస్టు చేసిన పోలీసులు హిందూ దేవాలయాలపై కొన్ని నెలలుగా వరుసగా దాడులు జరుగుతున్నా ఎవర్నీ అరెస్టు చేయకపోగా రంపాన్ని కనుక్కున్నామని చెప్పడం దారుణం. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం పులివెందులలో ఆలయంపై దాడి జరిగినా చర్య తీసుకోలేని పోలీసులు, పుంగనూరులో పెద్దిరెడ్డి అరాచక పాలన అంతమై త్వరలో కాషాయజెండా ఎగురుతుందని, నియంతల పాలన ఇక సాగదని ఫేస్‌బుక్‌లో పోస్టులు చేసిన పాపానికి ఆగమేఘాలపై ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఏ మత ప్రయోజనాలకు తోడ్పడుతున్నదో అర్థం చేసుకోవడానికి ఈ రెండు ఉదంతాలు చాలవూ! 


వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేవాదాయ శాఖ నిధులను ఆయన ప్రకటించిన అమ్మఒడి, జగనన్న ఆసరా, వాహన మిత్ర, వైఎస్సార్ నేతన్న నేస్తం వంటి రకరకాల పథకాలకు మళ్లిస్తున్నారు. దేవాదాయ శాఖకూ ఈ సంక్షేమ పథకాలకు సంబంధం ఏమిటి? కొవిడ్ మూలంగా తమ శాఖ ఆదాయం తగ్గినందువల్ల ఆలయ సిబ్బంది జీతాలు చెల్లించే స్థితిలో లేమని, దశల వారీగా చెల్లించే ప్రయత్నం చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ స్వయంగా ప్రకటించారు. తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దేవాదాయ శాఖ వివిధ కులాల, వృత్తుల వాళ్ల సంక్షేమ పథకాలకు నిధులు ఎలా ఇవ్వగలుగుతోంది? కేంద్రం నుంచి ఏ నిధులు మంజూరైనా వాటిని వెంటనే ఏదో ఒక పథకానికి మళ్లిస్తున్నారని స్పష్టంగా తేలింది. ఒకరి పొట్టకొట్టి మరొకరి పొట్ట నింపుతున్నట్లు నాటకాలు ఆడడం, ఒక శాఖ నుంచి మరో శాఖకు నిధులు బదిలీ చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్యగా కనపడుతోంది. అసలు పథకాలు ప్రకటించేటప్పుడు అందుకు తగ్గ బడ్జెట్ ఉన్నదా, ఎలా నిధులు కేటాయిస్తారు అన్న విషయం కూడా పట్టించుకోకుండా విచ్చలవిడిగా ప్రకటనలు ఎలా చేస్తారు?


ఆంధ్రప్రదేశ్‌లో లక్ష ఎకరాల ఆలయ భూమి ఆక్రమణలో ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారికంగా తెలిపింది ఈ భూముల ఆక్రమణ విషయంలో జగన్ ప్రభుత్వం ఏమి చేయదలుచుకుంది? వాటిని క్రమబద్ధీకరించదలచుకున్నారా స్పష్టం చేయాలి. సింహాచలంకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూముల ఆస్తులపై కన్ను వేసిన జగన్ ప్రభుత్వం ఈ భూముల విషయంలో పారదర్శకంగా వ్యవహరించే అవకాశాలు లేవు. అధికారంలోకి రాగానే టీటీడీ భూముల వేలంపై జగన్ ప్రభుత్వం కన్ను వేసిన విషయం ఎవరికీ తెలియనిది కాదు. ఇదే ప్రయత్నం తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో కూడా జరిగిన విషయం మరిచిపోరాదు. అర్చక వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించిన నాటి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును ఉన్నపళాన తొలగించిన సంగతి చరిత్ర పుటల్లో రికార్డు అయింది. ఇప్పుడు ఇదే చంద్రబాబు ఆలయాలు, పూజారులపై దాడుల గురించి వాపోవడం విడ్డూరం.


జగన్ హయాంలో ఆలయాలు, వాటి ఆస్తుల విషయంలో జరుగుతున్న దుర్మార్గాలు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. రాష్ట్రంలో ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవడం కోసం మత మార్పిడులను ప్రోత్సహించేందుకు గ్రామస్థాయి నుంచి వాలంటీర్లను నియమించడం వంటి కుత్సిత ఆలోచన ఏ ప్రభుత్వాధినేతా చేయలేదు. గ్రామాలనుంచి కొన్ని వర్గాలను, శక్తులను ప్రోత్సహించి, వారికి ఆర్థిక, ఇతర ప్రయోజనాలను కల్పించడం ద్వారా సంఘటితం చేసేందుకు వ్యూహరచన చేసిన ఘనచరిత్ర ఏ ముఖ్యమంత్రికీ లేదు. రాష్ట్రంలో అభివృద్ధిని, ఆర్థిక పునర్నిర్మాణాన్నీ గాలికి వదిలేసి, కేవలం ఓట్లను దండుకోవడంపైనే దృష్టిపెట్టి కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి జగన్ మినహా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరెవరూ లేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు తమ పేర్లను ప్రకటించుకోవడం, మళ్లించడం గతంలో ముఖ్యమంత్రులు కూడా చేశారు. కాని పథకాల పేరుతో ప్రజలను ప్రలోభపెట్టి వారిని వర్గాలుగా, మతాలుగా విడదీసి, కేవలం ఎన్నికల రాజకీయాల కోసమే ప్రభుత్వ పాలన అన్న విధంగా వ్యవహరించిన నాయకుడు మరొకరు లేరు. శాసనసభ్యులను, పార్టీ కార్యకర్తలను అరాచకాలకు, ప్రత్యర్థులను బెదిరించేందుకు ప్రోత్సహించి మొత్తం రాష్ట్ట్రంలోనే ఫ్యాక్షనిజానికి తెరలేపిన నేత ఇంకొకరు లేరు. ఆఖరుకు పోలీసు వ్యవస్థను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్రంలో చట్టాలకు, న్యాయానికి తగిన విలువ లేకుండా చేసిన హింసాప్రవృత్తి గల నాయకత్వం మనకేనాడూ లభించలేదు. గడచిన 18 నెలల్లోనే రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకత్వం లభించినందుకు తమను తాము ఓదార్చుకునే పరిస్థితిలో పడ్డారనడంలో సందేహం లేదు. దేశమంతటా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి అరాచకశక్తులు తమకు అడ్డుఉండదనే ఇన్నాళ్లూ ధైర్యంతో వ్యవహరించారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రవేశించగానే ప్రజల్లో ఆ అరాచకశక్తుల నుంచి తమకు విముక్తి లభిస్తుందనే ధైర్యం ప్రవేశించింది. బిహార్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లోనే అరాచక పాలనకు ప్రజలు అంతం పలికారు. తెలంగాణలో కేసిఆర్ అరాచక పాలనకు బిజెపియే ప్రత్యామ్నాయమని ప్రజలు ఇప్పటికే తేల్చారు. బెంగాల్ ఎన్నికల్లో మమత దుష్ట పాలనకు ప్రజలకు చరమ గీతం పాడడం ఖాయం. కనుక జగన్ ప్రభుత్వం హిందూ మనోభావాలతో చెలగాటమాడుతూ ప్రదర్శిస్తున్న స్వైర విహారానికి కూడా ప్రజలు తగిన జవాబు ఇచ్చే సమయం ఎంతో దూరంలో లేదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)


Updated Date - 2021-01-12T06:30:42+05:30 IST