తెగిన మాంగల్యాల ఉసురు!

Published: Fri, 25 Mar 2022 00:27:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెగిన మాంగల్యాల ఉసురు!

‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం’. ఈ మాటల్ని ఎవరు ఎక్కడ ఎప్పుడు అన్నారో ఒకసారి ముఖ్యమంత్రి గారు జ్ఞాపకం చేసుకుంటే మంచిదేమో. మూడేళ్ల క్రితం జగన్ విడుదల చేసిన ఎలక్షన్ మ్యానిఫేస్టోలోని హామీ ఇది. ‘చంద్రబాబు మద్యాన్ని నిషేధిస్తారో లేదో నాకు తెలీదు. ఆయన ప్రభుత్వం పోతుంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. డబ్బులున్నవాడో, సూటు బూటు వేసుకున్నవాడో ఐదు నక్షత్రాల హోటళ్లకు వెళ్లి తాగితే ఫర్వాలేదు కానీ ఇంత విచ్చలవిడిగా ప్రజలతో మద్యం తాగిస్తారా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు’ అని ప్రతిపక్షనేత హోదాలో విజయవాడలో 2015 డిసెంబరు 8న విలేఖరులతో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలవి. 


ఈ వాగ్దానాలు చూసి మద్యానికి మూడింది అని ప్రజలు నమ్మి అత్యధిక స్థానాలతో జగన్ పార్టీని గెలిపించారు. కానీ నాడు ఆయనను అన్నా అని నోరారా పిలిచిన ఆడబిడ్డలే నేడు శాపనార్ధాలు పెడుతున్నారు. మద్యాన్ని నిషేధించాలి అంటే దాని వినియోగం తగ్గించాలి. వినియోగం తగ్గిస్తే ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. అంటే బడ్జెట్‌లో ఎక్సైజ్‌పై వచ్చే ఆదాయం తక్కువ ఉండాలి. కానీ ఈ జగన్‌ ప్రభుత్వంలో మద్యం ద్వారా 2021–22లో రూ.24,714 కోట్ల విక్రయాలు జరిగాయి. రూ.11వేల కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు ఆదాయం పెరిగింది. మీరనుకున్న మద్యపాన నిషేధం ద్వారా ఆదాయం తగ్గాలి కానీ ఎందుకు, ఎలా పెరిగింది? డిస్టిలరీలను నడుపుతోంది ఎవరి బినామీలు? గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీలను తెచ్చారని, ఆ పార్టీ నేతలే నకిలీ మద్యాన్ని తయారుచేశారనీ చెబుతున్న జగన్‌ మరి వాటిని ఎందుకు రద్దు చేయడం లేదు? భర్తను చంపి భార్యకు అమ్మఒడి ఇస్తారా? కొడుకును చంపి తల్లిదండ్రులకు పెన్షన్‌ ఇస్తారా? ఇలా ఎక్కడైనా ఉందా? ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైన అంశం ఇంకేమైనా ఉందా అని మొన్న నాటుసారా తాగి మరణించిన ప్రజల కుటుంబాల క్షోభను చూసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రజలు. జగన్‌ సీఎం అయ్యాక పెరిగిన ఎక్సైజ్ ఆదాయాన్ని చూస్తుంటే మెడ మీద తలకాయ ఉన్న ఎవరైనా ఏమని అనుకుంటారు? మద్యాన్ని ఊరు వాడా విస్తరిస్తున్నారని కాదా దాని అర్థం? సంక్షేమం పేరుతో ప్రభుత్వ ధనంతో ఓటు బ్యాంకు పెంచుకోవాలని కలలు కంటున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో దొరికే మద్యం బ్రాండ్లను ఏపీ నుంచి లంచాల కోసం, తమ నేతల సొంత బ్రాండ్‌ల కోసం తరిమేశారని ప్రజలు బహిరంగంగానే విమర్శించారు. దేశంలో ఎక్కడా దొరకని అనామక మద్యం బ్రాండ్లను ఊరూరా ప్రభుత్వమే స్వయంగా అమ్ముతోంది. అసలు ఈ బ్రాండ్లు ఏంటి? వాటి నాణ్యత ఏంటి? ఈ బ్రాండ్ల వెనక సూత్రధారులు ఎవరు, ఆ బ్రాండ్లు వ్యాపారం చేసుకోవటానికి అసలు అనుమతులు తీసుకున్నారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రముఖ బ్రాండ్లను ఏపీలో దొరక్కుండా చేశారని, దానివలన ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆ బ్రాండ్లు తెచ్చుకుంటున్నారని, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కొందరు మద్యం వ్యాపారులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోపక్క ఆ అనామక బ్రాండ్ల మద్యంపై భారీగా ధరలు పెంచారు. మద్యపాన నిషేధం కోసమే ధరలు పెంచామనీ, ధరలకు భయపడి ఎవరూ మద్యం తాగరనీ, తగ్గిస్తారనీ కట్టుకథలు చెప్పారు. ధరలు పెంచటం వెనుక ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనే దురాశే తప్ప మద్యాన్ని నిషేధించాలనే చిత్తశుద్ధి లేదు. ఆ ధరలకు మద్యం కొనలేక నాటుసారా తాగి ఇటీవల జంగారెడ్డిగూడెంలో 20మందికి పైగా చనిపోతే ప్రభుత్వం ప్రతిపక్షాలపై చేస్తున్న ప్రచారాన్ని చూస్తుంటే, ప్రభుత్వ అడ్డగోలు సమర్థన హేయమనిపించక మానదు.


ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసి తద్వారా సంక్షేమ పథకాలు అడ్డుకోవాలనే ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు ముఖ్యమంత్రి గారు. అదే నిజం అనుకుంటే జగన్ ప్రభుత్వ సంక్షేమం సీసాలపై ఆధారపడి నడుస్తోందా? జగన్ చెప్పినట్టే మద్యం తాగకుండా చేయటానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే అది మంచిదేగా? జగన్ చెప్పింది కూడా మద్యం తాగకుండా చేస్తామనేగా? మరి ఎందుకు జగన్ ప్రభుత్వానికి ఈ ఉలికిపాటు?


కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కోవటం అంటే ఏంటో తెగిన తాళిబొట్లను అడగండి, తాళిని తాకట్టు పెట్టి ఆలిని అవస్థల పాలు చేస్తూ తాగుడికి జనాల్ని బానిసలుగా చేస్తున్న ఖాళీ సీసాలను అడగండి చెబుతాయి అని రాష్ట్ర ఆడపడుచులు ఆక్రందనలు చేస్తున్నారు. 


మాట తప్పం మడమ తిప్పం అనే మీ మార్కు నినాదాలకు కాలం చెల్లిందనీ, ఒకటి కాదు వంద విషయాల్లో మాట తప్పి, మడమ తిప్పారనీ అందుకే కోర్టులు కూడా మీకు మొట్టికాయలు వేశాయని ప్రజలు భావిస్తున్నారు.


పూర్తిగా కోవిడ్ ప్రభావం నుండి వ్యాపారాలు కోలుకోలేదు. ఉపాధి అవకాశాల పునరుద్ధరణ పూర్తి కాలేదు. దానికి తోడు పరిశ్రమలు రాక, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల పూర్తి ఇవేమీ జరగటం లేదు. పాలన చేపట్టి మూడు సంవత్సరాలవుతున్నా, రాష్ట్ర ఖజానా నింపే ప్రణాళికల, కార్యక్రమాల ఊసే లేదు. రాష్ట్రంలో అభివృద్ధి ద్వారా, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సంక్షేమానికి వినియోగించాలి కానీ జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా పక్కదారి మళ్ళిస్తూ, కేంద్ర ప్రాజెక్టులలో రాష్ట్ర వాటాలను విడుదల చేయకుండా, రాష్ట్రంలో ప్రగతిని అధోగతి పాలు చేస్తోంది. పాశ్చాత్య పాలకులు అలవాటు చేసిన దర్పంలో భాగంగా, సంతోషంలోనూ, బాధలోనూ, పండగలకూ, పుట్టినరోజులకూ... ఇలా సందర్భం ఉన్నా లేకపోయినా మద్యం సేవించడం దాదాపు అన్ని తరగతుల ప్రజలకు అలవాటయిపోయింది. అతి చిన్న వయసునుండే కుటుంబ సభ్యులను చూసో, స్నేహితుల ప్రోద్బలంతో ముఖ్యంగా నేటి కాలపు సినిమాలలో విచ్చలవిడిగా మద్యాన్ని సేవించే దృశ్యాలను చూపించడం వలన యువతలో మద్యంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. వారిని మద్యానికి బానిసలుగా చేస్తోంది. పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే, కుటుంబ వ్యవస్థను కాపాడాల్సిన ఆడవారు సైతం మద్యం, పొగ తాగడం స్వేచ్ఛకు సంకేతం అని ఇటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలలో మహిళ భాగస్వామ్యం అతి కీలకమైనది కానీ కొన్ని అసాంఘిక సామాజిక శక్తుల వలన, కుహనా లౌకికవాదుల ప్రోద్బలంతో కొంతమంది మహిళలు కుటుంబ వ్యవస్థను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. టీవీ సీరియళ్ళలో కూడా ఆడవారు మద్యం తాగటం, క్లబ్బులు, పబ్బులు తిరగటం అని చూపిస్తూ, గృహిణుల, ఆడపిల్లల మనసును ప్రభావితం చేస్తున్నారు.


మద్య నిషేధం సామాజిక పరివర్తనకు చెందిన అంశం. మద్యాన్ని నిషేధించాలంటే కేవలం ఎన్నికలలో ఓట్ల కోసం వాడే అస్త్రంగా, ఓటు బ్యాంక్ రాజకీయంగా, ఖజానాకు అత్యుత్తమ ఆదాయ వనరుగా కాకుండా, నిజాయితీగా, చిత్తశుద్ధితో, ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించి, అభివృద్ధితో సంక్షేమాన్ని అందించినప్పుడే ప్రభుత్వం మద్యపాన నిషేదం లాంటి హామీలను నిలబెట్టుకోగలదు. మద్య విమోచన ప్రచార సమితి కమిటీలను వేస్తే సరిపోదు. సమితి పేరిట జీతభత్యాలు తీసుకోవడం కాదు కావాల్సింది. డీ అడిక్షన్ సెంటర్లను నెలకొల్పి, వాటి ద్వారా ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. కుటుంబం, సమాజంలోని వ్యక్తులు కూడా ఇటువంటి వ్యసనాలకు దూరంగా, మంచి ఆరోగ్యపు అలవాట్లను చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి. సినిమా, వినోద రంగాలపై కఠిన ఆంక్షలను విధించాలి. మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా మహిళలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. ఏది ఏమైనప్పటికీ స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుండీ మద్యపాన నిషేధ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. చూద్దాం మరి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ మేరకు ఈ ప్రయత్నాలు సఫలం అవుతాయో.

సాదినేని యామిని శర్మ 

సామాజిక కార్యకర్త

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.