నష్టం అపారం

ABN , First Publish Date - 2021-11-25T06:24:32+05:30 IST

జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు రైతాంగానికి అపార నష్టాన్నే కలిగించాయి.

నష్టం అపారం
పర్చూరు ప్రాంతంలో ఉరకెత్తిన మిర్చి

లక్ష ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు  

ప్రాథమికంగా గుర్తించిన యంత్రాంగం

రైతు వారీ ప్రాతిపదికన  అధికారుల సర్వే 

కుళ్లిన మినుము, మిర్చి, శనగ, పొగాకు

చాలాచోట్ల మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి

ఒంగోలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు రైతాంగానికి అపార నష్టాన్నే కలిగించాయి. ముసురుపట్టి కురిసిన భారీవర్షాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈనెల 15 నుంచి 22 వరకు కురిసిన వర్షాలతో 99,298.71 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. క్షేత్రస్థాయిలోని తమ శాఖల సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వ్యవసాయశాఖ పరిధిలోని పంటలు 66,039 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే ఉద్యాన శాఖ పరిధిలో 18,056 ఎకరాలలో తోటలు దెబ్బతినగా, పొగాకు బోర్డు పరిధిలో సుమారు 15,204.60 ఎకరాల్లో పొగాకు పైరు దెబ్బతిన్నట్లు అధికారిక సమాచారం. అధికారులు గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే జిల్లా రైతాంగం రూ.250 కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు ఈ వర్షాలతో నష్టపోయిన పరిస్థితి. భారీవర్షాలు కురవడమే కాక ముసురుగా పడటంతో పొలాల్లో నీరు నిలిచి పంటలు దెబ్బతిన్నాయి. 


ఒకవైపు ఉరక.. మరోవైపు మొలక

జిల్లాలో 5.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో, మరో లక్ష ఎకరాల్లో రబీ సీజన్‌లో పంటలు సాగు కాగా కోతలు పూర్తయిన పంటలుపోను ఇంచుమించు ఐదు లక్షల ఎకరాల్లో పైర్లు పొలాల్లో ఉన్నాయి. కాగా ముసురుపట్టి భారీవర్షాలు కురవడంతో మెట్టభూముల్లో సాగు చేసిన మిర్చి, పత్తి, శనగ, మినుము, పొగాకు పంటలకు అపారనష్టం జరిగింది. మిర్చి, పత్తి ముదురు తోటలు ఉరకెత్తి పోగా కోతదశకు చేరిన మినుము పొలంలోనే కాయలు మొలకెత్తాయి. అలాగే చాలా ప్రాంతాల్లో మొలక దశలో ఉన్న శనగ, మినుము నీటిలో నాని కుళ్లిపోయింది. పొగాకు, మిర్చి లేత తోటలు వర్షపు నీటిలో నాని ఎండిపోయాయి. కొన్నిచోట్ల భారీవర్షాలతో పొలంలో నీరుపారి ఇటీవల విత్తనాలు వేసిన లేదా నాట్లు వేసిన పైర్లు కొట్టుకుపోయాయి. 


పెరుగుతున్న నష్టం అంచనాలు

వర్షాలు తగ్గి ఎండలు వస్తుండటంతో పంటలకు జరిగిన నష్టాలు మరింతగా వెలుగుచూస్తున్నాయి. చాలాచోట్ల దెబ్బతిన్న లేత పైర్లను తొలగించి మళ్లీ వేసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక పత్తి, మిర్చి, ముదురు తోటలు దెబ్బతిన్న చోట తిరిగి సాగుచేసే అవకాశం కూడా లేదని రైతులు చెబుతున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎకరాకు సగటున రూ.25వేల నుంచి రూ.30వేల వంతున చూసినా ఈ వర్షాలతో రైతులు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.




Updated Date - 2021-11-25T06:24:32+05:30 IST