గడువు నాలుగు నెలలే!

ABN , First Publish Date - 2022-07-26T04:15:27+05:30 IST

జిల్లాలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల భవనాల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి వీటి నిర్మాణాలు పూర్తికావడం లేదు. గత మూడేళ్లుగా గడువులు విధించడం.. రకరకాల కారణాలు చూపుతూ పనులు చేయకపోవడం పరిపాటిగా మారింది. వాస్తవానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో జిల్లాకు నాలుగు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలు మంజూరయ్యాయి. కురుపాం, పాచిపెంట, మక్కువ, భామిని మండలాల్లో రూ.12 కోట్లతో ఒక్కో పాఠశాలకు సంబంధించి భవన నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.

గడువు నాలుగు నెలలే!
భామినిలో పునాదుల స్థాయిలో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులు

ముందుకుసాగని ‘ఏకలవ్య’ భవన నిర్మాణాలు

ఇంకా పునాదుల స్థాయిలోనే పనులు

డిసెంబరులోపు నిర్మిస్తామంటున్న అధికారులు

ఆశ్రమ పాఠశాలల్లో తరగతులు

ఇబ్బందిపడుతున్న విద్యార్థులు

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల భవనాల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి వీటి నిర్మాణాలు పూర్తికావడం లేదు. గత మూడేళ్లుగా గడువులు విధించడం.. రకరకాల కారణాలు చూపుతూ పనులు చేయకపోవడం పరిపాటిగా మారింది. వాస్తవానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో జిల్లాకు నాలుగు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలు మంజూరయ్యాయి. కురుపాం, పాచిపెంట, మక్కువ, భామిని మండలాల్లో రూ.12 కోట్లతో ఒక్కో పాఠశాలకు సంబంధించి భవన నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను నిధులు కూడా మంజూరు చేశారు. నిర్మాణ పనులు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగానికి అప్పగించారు. కానీ నాటి నుంచి పనుల్లో మాత్రం ఎటువంటి పురోగతి లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇంకా పునాది స్థాయి కూడా దాటడం లేదు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో, ప్రైవేటు భవనాలు, ఇరుకు గదుల్లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

గత మూడేళ్లుగా..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణాలపై దృష్టిపెట్టినట్టు ప్రకటించింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయనున్నట్టు ప్రకటించింది. అయితే తరువాత కొవిడ్‌ ను సాకుగా చూపి చాలా రోజులు పనులు ప్రారంభించలేదు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తరువాత కూడా పనుల్లో పురోగతి లేదు. మరోవైపు అధికారులను అడుగుతుంటే డిసెంబరు నాటికి పూర్తిచేస్తామని చెబుతున్నారు. అయితే గడువు చూస్తే మరో నాలుగు నెలలే ఉంది. అప్పట్లోగా పనులు సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో విద్యార్థినులకు వసతి సమస్య తలెత్తుతోంది. ఇటీవల ఈ భవన నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టిసారించినట్టు అధికారులు చెబుతున్నారు. జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో ఆనంద్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో కదలిక వచ్చింది. 

బోధనా సిబ్బంది భర్తీ ఎప్పుడో?

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో బోధన కూడా మెరుగుపడడం లేదు. భవనాలు లేవు కదా బోధన సిబ్బంది ఎందుకు అనుకున్నారో ఏమో ఇంతవరకూ ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే సీఆర్‌టీలు, ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించి విద్యా బోధన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇంటర్‌ వరకూ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. కానీ అటు వసతి, ఇటు బోధనలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోతోంది. అటు పర్యవేక్షణ కూడా లేకపోతోంది. గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లనే ఇక్కడ ఇన్‌చార్జిలుగా నియమించారు. అయితే ఇటీవల బదిలీల్లో భాగంగా ఎక్కువ మంది పక్క జిల్లాలకు వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్తగా నియామకాలు లేవు. 

 దృష్టిపెట్టాం

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులపై దృష్టిసారించాం. డిసెంబరులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌, జేసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పనులు వేగవంతానికి చర్యలు చేపడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తిచేయిస్తాం. 

-శాంతేశ్వరరావు, సూపరింటిండెంట్‌ ఇంజినీర్‌, గిరిజన ఇంజినీరింగ్‌శాఖ



Updated Date - 2022-07-26T04:15:27+05:30 IST