మరణ మృదంగం

ABN , First Publish Date - 2022-05-21T05:08:14+05:30 IST

తాండూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న అసహజ మరణాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మరణ మృదంగం


  • తాండూరులో భారీగా అసహజ మరణాలు
  • రెండు నెలల్లో నియోజకవర్గంలో భారీగా మరణాలు
  • వేర్వేరు కారణాలతో 16 మంది మృత్యువాత
  • హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలతో మృత్యు కోరల్లోకి...
  • గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన డెత్‌ టోల్స్‌
  • మృతుల్లో యుక్త వయస్కులే అధికం

తాండూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న అసహజ మరణాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గడిచిన 60 రోజుల్లో హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద స్థితిలో మృతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా సంభవించాయి. వేర్వేరు కారణాలతో ఈ కాలంలో 16 మంది మృత్యువాత పడ్డారు. కక్షలు, ఆర్థిక గొడవలు, భార్యభర్తల పంచాయితీ తదితర కారణాలతో హత్యలు జరిగాయి. అలాగే ఇంట్లో గొడవలు, నిరంతరం మద్యం మత్తు, అసాంఘిక కార్యకలాపాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలు, నీటి గుండాల్లో పడి చనిపోయిన సంఘటనలూ సంభవించాయి. ఇవిలా ఉంటే అనుమానాస్పద మృతి కేసులు సైతం ఇటీవల ఎక్కువగానే నమోదైనట్టు పోలీసు రికార్డులను బట్టి తెలుస్తోంది.

తాండూరు, మే 20: తాండూరు నియోజకవర్గంలో గత నెల రోజుల వ్యవధిలో వివిధ కారణాలతో అకాల మరణాలు భారీగా చోటుచేసుకున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలతో మరణాలు ఎక్కువ సంభవించాయి. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం యుక్తవయసు వారే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే వేర్వేరు సంఘటనల్లో రెండు నెలల్లో 16 మంది మృతిచెందారు. వ్యక్తిగత కారణాలతో కొందరు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు మద్యం మత్తులో, పాత కక్షలతో హత్యలకు గురయ్యారు. రోడ్డు ప్రమాదల్లో చనిపోయారు. ఇలాంటి సంఘటనలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ సంభవించాయి. ప్రమాదవశాత్తుగా పేర్కొంటున్న మరణాల్లోనూ అనుమానాస్పద స్థితిలో సంభవించినవే ఎక్కువగా ఉన్నాయి. మృతుల్లో అధికంగా 25-55ఏళ్లలోపు వారు ఎక్కువున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హత్యలు, ఆత్మహత్యల నియంత్రణకు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నా పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తాండూరు ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల క్రైం రేటు పెరిగింది. అదీ ప్రాణాలు తీయడం, తీసుకోవడం, ప్రమాదాలు వంటి కారణాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాల్లో విచ్చిలవిడిగా బెల్టు షాపుల నిర్వహణ, యువత, నడీడు వారు పొద్దంతా మద్యం మత్తులో తూగడం.. తోటి వారితో ఘర్షణ పడడం, పాత కక్షలు, ఆర్థిక పంచాయితీలు, వివాహేతర సంబంధాలు, పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలు సైతం హత్యలకు, ఆత్మహత్యలకు కారణభూతం అవుతున్నాయి. గ్రామాల్లో కల్తీ కల్లు, బెల్టు షాపులపై ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడం, వారికి అమ్మకాల టార్గెట్‌పై ఉన్న శ్రద్ధ జనం ఆరోగ్యం, ప్రాణ రక్షణపై ఉండకపోవడంతోనూ నిత్యం హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్య సంభవిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

60 రోజుల వ్యవధిలో జరిగిన హత్యలివీ...

ఏప్రిల్‌ 12న పెద్దేముల్‌ మండలం గొట్లపల్లిలో రౌడీషీటర్‌ అనంతయ్య(45)ను హత్య. కత్తితో దాడి చేసి ప్రత్యర్థులు చంపేశారు.

ఏప్రిల్‌ 30న యాలాల మండలం తిమ్మాయిపల్లిలో సూర్క రామప్ప (50)ను దాయాదులు బండరాయితో మోది హత్య చేశారు.

మే 1న పెద్దేముల్‌ మండలం పాషాపూర్‌లో మంగ్లీబాయి(50) మద్యం తాగేందుకు రూ.50 ఇవ్వలేదని మద్యానికి బానిసైన ఓ వ్యక్తి బండరాయితో మోది చంపేశాడు.

మే 10న తాండూరు పట్టణ మల్‌రెడ్డిపల్లిలో లాలప్ప(50)ను ఇద్దరు  పట్టపగలే ఇనుప రాడ్డు, బండరాయితో కొట్టి హత్య చేశారు.

మే 14 తాండూరు మండలం చెంగోల్‌లో సంగీత(30) అనే వివాహితను మద్యం మత్తులో ఉన్న భర్త బండరాయితో మోది చంపాడు.

ఏప్రిల్‌ 21న బషీరాబాద్‌ మండల సరిహద్దు కర్ణాటక ప్రాంతంలో మొగులప్ప(30) అనే వ్యక్తిని దుండగులు చంపేసి మృతదేహానికి నిప్పంటించారు.

వేర్వేరు కారణాలతో చోటుచేసుకున్న బలవన్మరణాలు

మే 2న తాండూరు మండలం చింతామణిపట్నంలో బజారమ్మ(54) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

మే 9న తాండూరు మండలం కొత్లాపూర్‌లో వివాహిత పల్లవి(29) ఉరేసుకుంది.

మే 11న బషీరాబాద్‌ మండలం మర్పల్లిలో కమలమ్మ అనే మహిళ భర్తతో గొడవపడి తన 13నెలల పాప వైష్ణవితో బావిలో దూకింది. ఈ ప్రమాదంలో శిశువు వైష్ణవి మృతిచెందగా, స్థానికులు తల్లి ప్రాణాలను కాపాడారు.

ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలు

ఏప్రిల్‌ 4న బషీరాబాద్‌ మండలం గొటిగఖుర్దులో జేసీబీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బైక్‌పై వెళ్తున్న సాయిలు(30) అనే వ్యక్తిని ఢీకొన్నాడు. రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభానికి తగులుకొని సాయిలు అక్కడికక్కడే మృతిచెందాడు.

ఏప్రిల్‌ 6న కరన్‌కోట్‌లో గనిలో ఉన్న నీటి గుంతలో పడి దస్తప్ప(48)అనే వ్యక్తి మృతిచెందాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి చనిపోయాడు.

ఏప్రిల్‌ 7న తాండూరు ధన్గర్‌గల్లీకి చెందిన శ్రీనివాస్‌(42) పర్మిట్‌ రూంలో మద్యం తాగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడి మరణానికి కారణం కల్తీ మద్యమా, లేక ఆరోగ్య సమస్యా అనేది ఫోరెన్సిక్‌ పరీక్షల ఫలితాల అనంతరం అధికారులు వెల్లడించాల్సి ఉంది.

మే 2న యాలాల మండలం జుంటుపల్లిలో మల్‌రెడ్డిపల్లికి చెందిన రాంచందర్‌ (48) నీటి గుండంలో పడి మృతిచెందాడు. దైవ పూజ కోసం స్నానానికని గుండంలో దిగగా నీట మునిగి మృతిచెందాడని పోలీసులు పేర్కొన్నారు.

మే 5న పాత తాండూరులో బావిలో ఈత కోసం దూకి హాది(25) అనే యువకుడు మరణించాడు.

మే 13న తాండూరులో తాపీ మేస్ర్తి నిర ్లక్ష్యం కారణంగా సిమెంటు భీం కూలి సైదులప్ప(54) అనే కూలీ  దుర్మరణం చెందాడు.

మే 14న యాలాల మండలం బాణాపూర్‌లో పాండునాయక్‌(54) అనే రైతు మైసమ్మకు వదిలిన దున్నపోతు పొడవడంతో మృతిచెందాడు.

ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం

తాండూరు నియోజకవర్గంలో క్షణికావేక్షంలో జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు కళాజాతల ద్వారా పోలీసు శాఖ అవగాహన కల్పిస్తోంది. అలాగే హత్యలు జరగకుండా, గ్రామాల్లో గొడవలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులు ఎక్కడా తప్పించుకోకుండా అరెస్టు చేసి తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెడుతున్నాం. ఇక ప్రమాదవశాత్తు మరణాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. చెరువులు, నీటి గుండాలు, పుష్కరిణుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. యాలాల మండలం జుంటుపల్లి గుండంలో యేటా ఎవరో ఒకరు మృతిచెందుతున్నందున అక్కడ వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించాం.

                                                             - లక్ష్మీనారాయణ, డీఎస్పీ, తాండూరు

Updated Date - 2022-05-21T05:08:14+05:30 IST