గోవుల మృత్యుఘోష

ABN , First Publish Date - 2022-05-19T04:40:36+05:30 IST

పశువుల స్మగ్లింగ్‌లో విషాదకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు పోలీసు శాఖ స్పందించింది.

గోవుల మృత్యుఘోష

-మహారాష్ట్ర కేంద్రంగా గోవుల అక్రమ రవాణా

-నిబంధనలకు విరుద్దంగా తరలింపు

-మధ్యలోనే చనిపోతున్న పశువులు

-స్మగ్లింగ్‌కు అడ్డుకట్టవేసేందుకు రంగంలోకి పోలీసులు

-ఎస్పీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

పశువుల స్మగ్లింగ్‌లో విషాదకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు పోలీసు శాఖ స్పందించింది. ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశాలతో పశువుల రవాణా అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేశారు. ఇటీవల రెండు మూడు ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో కుక్కిన గోవులను కాగజ్‌నగర్‌కు గోశాలకు తరలించగా అప్పటికే భౌతిక అంతర్గత గాయాలతో తీవ్రంగా గాయపడి ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. రక్షించిన గోవులకు చికిత్స అందించాల్సిన పశుసంవర్ధక శాఖ ప్రేక్షక పాత్రకు పరిమితమై చోద్యం చూస్తోంది. 

గోవధ నిషేధ చట్టం ఉన్నప్పటికీ

ఆర్టికల్‌-48 ప్రకారం నిషేధం ఉన్నా మహారాష్ట్ర కేంద్రంగా పశువుల అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది. ఒక్కో కంటైనర్‌, ఐచర్‌ వాహనాల్లో నిబంధనలకు విరుద్దంగా 35నుంచి 50 వరకు పశువులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో పశువులు ఊపిరి ఆడక తొక్కిలాసటకు గురై మార్గమధ్యలోనే మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని కాళ్లు, మెడ నడుము విరిగిపోయి తీవ్ర గాయాల పాలై కొనఊపిరితో కబేలాకు, పోలీసులు పట్టుకుంటే గోశాలలకు చేరుతున్నాయి. 

నకిలీ రశీదులు చూపుతూ తరలింపు

మహారాష్ట్రలో అతి తక్కువ ధరకు ఎద్దులు, ఆవులను కొనుగోలు చేసి అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వెంట్రావుపేట, వీరూర్‌, వాంకిడి, కెరమెరి సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో పశువులను కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నారు. వాస్తవంగా ఒక్కొక్క ఐచర్‌వాహనంలో ఏడు పశువులు తరలించాల్సి ఉంటుంది. తరలించే ముందు పశువైద్యాధికారి దృవీకరించాల్సి ఉంటుంది. వాహనంలో వసతులున్నాయా..? లేదా..? అనే కోణంలో నివేదిక చేసి తర్వాత క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తరలించే వాహనంలో పశువులకు తాగునీటి సౌకర్యం, పశుగ్రాసం పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు పర్యవేక్షకుడిగా ఒకరిని తప్పకుండా ఉంచాల్సి ఉంటుంది. ఇన్ని నిబంధనలు పాటించాల్సి ఉండగా అధికారులకు మాముళ్లు ఇచ్చి ఈ దందాను యధేచ్ఛగా నడుపుతున్నారు. ఒక్కొక్క కంటైనర్‌లో 40నుంచి 50 పశువులు తరలిస్తున్నారు. 

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు చేరుకోవాలంటే కనీసం 20 చెక్‌ పోస్టులుంటాయి. ఇన్ని చెక్‌ పోస్టులున్నా కూడా ఏ ఒక్క వాహనాన్ని ఆపటం లేదు. ప్రతినెల మాముళ్లు ఇస్తూ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. కాగా ఎస్పీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసి ఈ దందాకు బ్రేక్‌ వేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు

గోవుల అక్రమ రవాణ తతంగంలో స్మగ్లర్లు పకడ్బందీగా పశువుల వాహనాలను మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మీదుగా నేరుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆల్‌కబీర్‌ మొదలుకొని వివిధ పశు వధ శాలలకు నిర్భయంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లో దాదాపు 20కిపైగా పశువుల అక్రమ రవాణా స్మగ్లర్ల ముఠాలు ఏర్పడినట్టు పోలీసు శాఖకు చెందిన వర్గాలే చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రవాణా సమయంలో రవాణా శాఖ సిబ్బంది(ఆర్‌టీఎ) అడ్డుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క వాహనాన్ని కూడా ఆపి జప్తు చేసిన దాఖలాలు లేవు. ఒక్కక్క పశువుల వాహనం పశువుల తరలింపు కోసం స్మగ్లర్లు చాలా పకడ్బందీ వ్యూహం అనుసరిస్తున్నారు. పశువుల వాహనం ముందు లైన్‌ క్లియర్‌ చేయటం కోసం ఇద్దరు పైలట్‌లు వెళ్లుతారు. ముందు పోలీసులు ఇతర అధికారులు ఉన్నది లేనిది వారు నిర్ధారించుకున్న తర్వాత ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తేనే వెనుక ఉండే పశువులను తరలించే వాహనం ముందుకు కదులుతుంది. అలాగే అనుకోని పరిస్థితుల్లో ఎక్కడైనా పోలీసులు వాహనాన్ని నిలిపివేసిన వాహనం వెనుకాలే కారులో మరో బృందం వస్తుంటుంది. ఇలా హైదరాబాద్‌ వరకు మార్గమధ్యలో ఉండే అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సిబ్బందిని మేనేజ్‌ చేస్తూ గోవులను పశువధ శాలలకు తరలిస్తున్నారు. 

స్పందించని పశుసంవర్ధక శాఖ

పశువుల అక్రమ రవాణాలో మూగజీవాలు పట్టుబడిన సందర్భాల్లో గాయాల పాలైన వాటిని రక్షించేందుకు చర్యలు చేపట్టే పరిస్థితులు లేకుండా పోయింది. ముఖ్యంగా పశు సంవర్ధక శాఖ నిర్లక్ష్య వైఖరి కారణంగా రక్షించ బడిన గోవులు కూడా గోశాలల్లో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కొల్పోతున్నాయి. నిర్వాహకులు, ప్రజాసంఘాల వారు వైద్యులకు సమాచారం అందించిన సిబ్బంది లేరు, మందులు లేవన్న సాకుతోచికిత్స అందించకుండా చేతులు దులుపేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తాజాగా కాగజ్‌నగర్‌లో చోటు సంఘటనే చక్కటి తార్కణం. రెండ్రోజుల క్రితం అక్రమంగా తరలిస్తున్న గోవులను రెబ్బెన సీఐ నాగేందర్‌ పట్టుకున్నారు. పోలీసులు రక్షించిన గోవులను కాగజ్‌నగర్‌లోని గోశాలకు తరలించారు. ఇక్కడ పశువులను వాహనం నుంచి దింపిన తర్వాత చాలా మూగ జీవాలు ఆకలి దప్పులతో నిరసించి పోగా, ప్రయాణంలో తీవ్రంగా దెబ్బ తిన్న పశువులు పునరావా కేంద్రంలో ఊపిరి వదలటం జంతు ప్రేమికులను తీవ్రంగా కలిచి వేసింది. ఇదే విషయమై ‘ఆంధ్రజ్యోతి’ గోశాలను సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించగా, కొనఊపిరితో కొట్టుకుంటున్న జీవాలతో ప్రాంగణమంతా హృదయవిదారకంగా కన్పించింది. పశువైద్యున్ని వచ్చి చూడాలని నిర్వా హకులు కోరినా స్పందించలేదని గోశాల నిర్వహకుడు ఉమేష్‌ చెప్పారు.

తెచ్చి వదిలేస్తున్నారు

-ఉమేష్‌, గోశాల నిర్వాహకుడు, కాగజ్‌నగర్‌

పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాల్లోని ఆవులు, పశువులను ఇక్కడి గోశాలకు తీసుకవస్తున్నారు. అందులో కొన్ని అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. మిగితావన్నీ కొన ఊపిరితో ఉంటున్నాయి. స్థానిక పశువైద్యా ధికారులకు సమాచారం అందించినప్పటికీ కూడా చికిత్స అందించడం లేదు.  ప్రైవేటులో చికిత్సలు చేయిస్తున్నాం. అయినా బతకటం లేదు. చాలా బాధగా ఉంది. 

Updated Date - 2022-05-19T04:40:36+05:30 IST