వినబడదా ‘ఆత్మ’ఘోష!

ABN , First Publish Date - 2021-02-27T05:29:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు.. సాంకేతికంగా రైతులను చైతన్యవంతులను చేసేందుకు గతంలో ఆత్మ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రస్తుతం ఈ పథకంపై వారికి కనీస అవగాహన లేకుండా పోయింది. నిధుల విడుదల కూడా నిలిచిపోగా... సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చేవారు కరువయ్యారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వినబడదా ‘ఆత్మ’ఘోష!
రైతులకు సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తున్న ఆత్మ సిబ్బంది(ఫైల్‌)

 నామమాత్రంగా సదస్సులు

 సిబ్బంది లేమితో ఇబ్బందులు 

(ఇచ్ఛాపురం రూరల్‌)

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు.. సాంకేతికంగా రైతులను చైతన్యవంతులను చేసేందుకు గతంలో ఆత్మ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రస్తుతం ఈ పథకంపై వారికి కనీస అవగాహన లేకుండా పోయింది. నిధుల విడుదల కూడా నిలిచిపోగా... సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చేవారు కరువయ్యారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


ఇదీ పరిస్థితి


జిల్లాలో ఏటా సుమారు 4.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో అత్యధికంగా వరి సాగవుతోంది. దీంతో పాటు పత్తి, మొక్కజొన్న, అపరాలు, కూరగాయలు తదితర పంటలతో పాటు మామిడి, జీడి, అరటి, కొబ్బరి, బొప్పాయి తోటలను పెంచుతున్న రైతులకు సాగుపై సూచనలు, సలహాలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో సాగులో అధునాతన పద్ధతులపై అవగాహన కల్పిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో ఆత్మ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి కన్వీనర్‌గా ఉంటారు. గతంలో డివిజన్‌ స్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి యంత్రాలతో ప్రదర్శనలు నిర్వహించి రైతులకు సాంకేతికతపై అవగాహన కల్పించేవారు. సమగ్ర వ్యవసాయ సహకారిగా తోడ్పడే పశు సంవర్థక, ఉద్యానవన శాఖ, చేపల పెంపకం వంటి శాఖల్లో సాంకేతికంగా వచ్చే మార్పులకు సంబంధించిన అంశాలను వివరించేవారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలు విడుదల చేసేది. కానీ ఏడాది కాలంగా నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో జిల్లాలో ఎక్కడా సదస్సులు, ప్రదర్శనలు కానరావడం లేదు. అధునాతన యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించే నాథులే కరువయ్యారని రైతులు వాపోతున్నారు. మొక్కుబడి సదస్సులతో మమ అనిపిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.  


వేధిస్తున్న నిధులు, సిబ్బంది కొరత :


ఆత్మ పథకానికి ఓ వైపు నిధుల లేమితో పాటు మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. సంవత్సర కాలంగా ఈ పథకానికి నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. 2019- 20 వరకూ సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించారు. 2020- 21 సంవత్సరం నుంచి ఒక్క పైసా కూడా ప్రభుత్వం కేటాయించలేదు. జిల్లా స్థాయిలో ఒక ప్రాజెక్టు డైరెక్టర్‌, 9 సబ్‌ డివిజన్లు స్థాయిలో 9 మంది బ్లాక్‌ టెక్నాలజీ టీమ్‌ కన్వీనర్లు, 16మంది అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్లు ఉండేవారు. ప్రస్తుతం కేవలం ఒక పీడీ ,  ఓ డీపీటీ మాత్రమే ఉన్నారు. వారిద్దరు కూడా ఇన్‌చార్జిలే. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆత్మ పథకాన్ని సక్రమంగా కొనసాగించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


ఆర్‌బీకేల ద్వారా అవగాహన 

ప్రస్తుతం ఆత్మ పథకాన్ని జిల్లా వనరుల కేంద్రం పేరుతో నిర్వహిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు వ్యవసాయశాఖ సిబ్బందితో అవగాహన సదస్సులు, పొలంబడి వంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 

- కె.కృష్ణారావు, ఆత్మ పీడీ.

Updated Date - 2021-02-27T05:29:23+05:30 IST