ఇక..సమరమే!

ABN , First Publish Date - 2022-08-16T09:56:11+05:30 IST

సీపీఎస్‌ రద్దుపై జగన్‌ సర్కారు మోసపూరిత విధానాన్ని నిరసిస్తూ సీపీఎస్‌ ఉద్యోగులు మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

ఇక..సమరమే!

  • 1న సీఎం ఇల్లు ముట్టడి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం
  • 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు
  • 93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తి
  • భవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచన
  • హామీపై జగన్‌ మడమ తిప్పేశారని మండిపాటు
  • ఎన్నికల ముందటి హామీపై నిలదీస్తామని ప్రకటన


సీపీఎస్‌ రద్దుపై జగన్‌ సర్కారు మోసపూరిత విధానాన్ని నిరసిస్తూ సీపీఎస్‌ ఉద్యోగులు మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈసారి నేరుగా తాడేపల్లిలోని సీఎం ఇంటినే ముట్టడించాలని నిర్ణయించారు. సీపీఎస్‌ విధానాన్ని అమలులోకి తెచ్చిన సెప్టెంబరు 1ని గత కొన్నేళ్లుగా బ్లాక్‌డేగా పాటిస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, కొత్తగా జీపీఎస్‌ అమలు చేస్తామంటూ మోసపూరితంగా వ్యవహరిస్తుండడంతో ఈ ఏడాది అదేరోజున నేరుగా సీఎం ఇంటినే ముట్టడించి నిరసన తెలపాలని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది.


అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేత హోదాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్రలో ఎక్కడ సభ జరిగినా, సీపీఎస్‌ అంశం ప్రస్తావించేవారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలో సీపీఎ్‌సను రద్దు చేసి... ఓపీఎ్‌సను పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చేవారు. దీంతో 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలు నమ్మకంగా జగన్‌కు జై కొట్టాయి. ఆయన అధికారంలోకి వచ్చారు. తమకిచ్చిన హామీ నెరవేరుస్తారని మూడు నెలలు చూశారు.. రద్దు కాలేదు. 6 నెలలు చూశారు.. రద్దు కాలేదు. సంవత్సరం చూశారు రద్దు కాలేదు. 


రెండేళ్లు చూశారు.. రద్దు కాలేదు. దీంతో జగన్‌ తమకిచ్చిన హామీని గుర్తు చేసేందుకు సీపీఎస్‌ ఉద్యోగులు  నిరసన గళం విప్పారు. ఆందోళనలు, ర్యాలీలు, ప్రభుత్వ పెద్దలను కలిసి వినతులు, వేడుకోలులు చేశారు. అయినా జగన్‌ ప్రభుత్వం నుంచి సీపీఎస్‌ రద్దు మాట రాలేదు. కమిటీలు వేశారు. కాలక్షేపాలు చేశారు. సమావేశాలు అన్నారు. ఈ గ్యాప్‌లోనే సీఎంగా జగన్‌ మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. చావు కబరు చల్లాగా.. అన్నట్టు మూడేళ్ల తర్వాత సీపీఎస్‌ రద్దుపై జగన్‌ నోరు విప్పారు. ఓపీఎ్‌సను పునరుద్ధరిస్తే భవిష్యత్తులో ఆర్థిక భారంగా మారుతుందని, అందుకే జీపీఎస్‌ తీసుకొస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దీంతో.. ఈ మాట చెప్పడానికి మూడేళ్లు పట్టిందా అంటూ సీపీఎస్‌ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఆర్థికభారం అవుతుందని ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? అని నిలదీస్తున్నారు. హామీపై  మడమ తిప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


 ముట్టడికి కార్యాచరణ షురూ..

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన ఉద్యోగులు ఇప్పుడు నేరుగా తమ నిరసనను సీఎంకే తెలపాలని, ఆ హామీ గురించి నిలదీయాలని నిర్ణయించారు. ఈ ఏడాది సెప్టెంబరు 1న ఏకంగా సీఎం ఇంటినే ముట్టడించి నిరసన తెలపాలని నిర్ణయానికి వచ్చారు. సీపీఎస్‌ రద్దు చేసి, ఎన్నికల ముందు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేయనున్నారు. అందుకు తగ్గ కార్యాచరణను  ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. 


తక్షణమే రద్దు చేయాలి: ఏపీసీపీఎస్‌యూఎస్‌ 

తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సెప్టెంబరు 1న బ్లాక్‌ డే పాటిస్తూ, తాడేపల్లిలోని సీఎం ఇంటిని ముట్టడించాలని ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్‌సయూఎస్‌) రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతగుంట్ల మరియదాసు, రవికుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు 93 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పాల్గొని తమ, కుటుంబ భవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ర్టాలు సీపీఎ్‌సను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తుంటే ఇక్కడి వైసీపీ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. 


2004లో ఏపీ ప్రభుత్వం వివిధ శాఖల్లో సీపీఎస్‌ అమలు చేస్తోందని, పదవీ విరమణ తర్వాత న్యాయంగా, చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్‌, గ్రాట్యుటీ, ఫ్యామిటీ పెన్షన్‌, కమ్యుటేషన్‌లు ఇవ్వకుండా, ఆర్థిక-సామాజిక భద్రత లేకుండా చేసిందని తెలిపారు. సీపీఎస్‌ విధానంలో ఒక్కో ఉద్యోగికి కోటి నుంచి కోటిన్న రూపాయల వరకు వస్తాయని అప్పట్లో మభ్యపెట్టారని, అయితే, రిటైర్డ్‌ సీపీఎస్‌ ఉద్యోగికి రూ.650, రూ.1,005 పెన్షన్‌ వస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేసి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా సీపీఎస్‌ ఉద్యోగుల వాటాపై కేంద్రం అప్పుగా ఇస్తామనడం, అవి వెయ్యి కోట్లు అయినా లేకున్నా రూ.4,203 కోట్లు అప్పు ఇస్తామని రాజ్యసభలో ప్రకటించడంలో ఏపీ ప్రభుత్వ పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. 

Updated Date - 2022-08-16T09:56:11+05:30 IST