రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఎలా దక్కిందంటే... 2021 ఇండియా రౌండప్‌లో..!

ABN , First Publish Date - 2021-12-29T16:30:19+05:30 IST

ఈ ఏడాది వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వచ్చిన నూతన ఆవిష్కరణలు, ఆర్థిక రంగ వృద్ధి, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని..

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఎలా దక్కిందంటే... 2021 ఇండియా రౌండప్‌లో..!

ఈ ఏడాది వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వచ్చిన నూతన ఆవిష్కరణలు, ఆర్థిక రంగ వృద్ధి, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన  సమాచారాన్ని ఇస్తున్నాం.


మహాత్ముని కటక్‌ సందర్శనకు వందేళ్లు

1921 మార్చి 23న మహాత్మాగాంధీ కటక్‌లోని స్వరాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించారు.  ఈ చారిత్రాత్మక సంఘటనకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవడంతో ఒడిషా రాష్ట్రం దానికి స్మృతిగా వందో వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అదే విధంగా ఒడిషా క్యాబినెట్‌ అహింస అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.


బయోడైవర్సిటీ హెరిటేజ్‌ సైట్‌గా అంబోలి

మహారాష్ట్ర ప్రభుత్వం సింధు దుర్గ్‌ జిల్లాలోని పశ్చిమ కనుమలలోని అంబోలి ప్రాంతాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో షిష్టురా హిరణ్యకేశి జాతి చేపలని కనుగొన్నారు. ఇవి రంగురంగుల చేపలు. 


భారత ఎన్నికల సంఘం-అట్లాస్‌

2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల విశేషాలతో రూపొందించిన అట్లా్‌సని  కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం భారతదేశ ఓటర్లలో 18 నుంచి 29 ఏళ్ల వయసు వారు నాలుగో వంతు ఉన్నట్లు ఈ అట్లాస్‌ ద్వారా వెల్లడైంది.


జమ్మూ కశ్మీర్‌ క్యాడర్‌ అధికారుల విలీనానికి ఆర్డినెన్స్‌

జమ్మూ అండ్‌ కశ్మీర్‌ క్యాడర్‌కు చెందిన ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారుల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మిజోరం అండ్‌ యూ నియన్‌ టెరిటరీ క్యాడర్‌లో విలీనం చేసేందుకు భారత ప్రభుత్వం ‘జమ్మూ, కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ ఆర్డినెన్స్‌ 2021’ని జారీ చేసింది. ఇక నుంచి ఈ రాష్ట్రాల అధికారులను జమ్మూ కశ్మీర్‌ పరిపాలనలో వినియోగించుకోవచ్చు.


దేశంలోనే తొలి డిజిటల్‌ యూనివర్సిటీ

దేశంలోనే మొదటి డిజిటల్‌ యూనివర్సిటీని కేరళలో ప్రారంభించారు. తిరువనంతపురం సమీపంలోని మంగళాపురంలోని టెక్నో సిటీలో కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ డిజిటల్‌ సైన్సెస్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ ప్రారంభించారు.


ఆరు లైట్‌ హౌస్‌లకు శంకుస్థాపన

ప్రధాని మోదీ ఆరు లైట్‌ హౌస్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌),  చెన్నై(తమిళనాడు), రాంచీ(జార్ఖండ్‌), అగర్తల(త్రిపుర), రాజ్‌ కోట్‌(గుజరాత్‌), లక్నో(ఉత్తర్‌ప్రదేశ్‌)లో లైట్‌ హౌస్‌ లను ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ చాలెంజ్‌ ఇండియాలో భాగంగా వీటిని అభివృద్ధి చేస్తారు.


రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా

ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది. రామప్ప తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉంది. ఈ ఆలయం అసలు పేరు కాకతీయ రుద్రేశ్వర ఆలయం.  భారత దేశంలో ఉన్న ప్రపంచ వారసత్వ కేంద్రాల్లో ఇది 39వ ప్రదేశం. 


లోక్‌సభ, రాజ్యసభ టీవీల విలీనం

మాజీ ప్రసార భారతి చైర్మన్‌ సూర్య ప్రకాష్‌ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల ఆధారంగా లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ విలీనం అయ్యాయి. ఈ రెంటి స్థానంలో ఇప్పుడు సంసద్‌ టీవీ ఏర్పాటైంది. పార్లమెంట్‌ ప్రసారాలను ఇప్పుడు ఈ చానెల్‌ ప్రసారం చేస్తోంది.


105వ రాజ్యాంగ సవరణ చట్టం

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను ఎస్‌ఈ బీసీలుగా గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల అధికారాలను పునరుద్దరించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం పొం దింది. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 


ఎం. బాల లత

సివిల్స్ మెంటార్

Updated Date - 2021-12-29T16:30:19+05:30 IST