పల్లెల్లో టీడీపీకి సడలని పట్టు

ABN , First Publish Date - 2021-11-19T06:16:36+05:30 IST

:గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన స్థానిక ఉపపోరు(ఎంపీటీసీ)లో అధికార పార్టీ ప్రాభవం తగ్గుతోందా...? అంటే... అవునని ఫలితాలే బదులిస్తున్నాయి.

పల్లెల్లో టీడీపీకి సడలని పట్టు

తేడా 3.59శాతమే

 స్థానిక ఉప పోరులో అధికార పార్టీకి ఆశాభంగం

ప్రభుత్వంపై వ్యతిరేకతకు చిహ్నమా..?

16 ఎంపీటీసీల్లో వైసీపీకి 10... టీడీపీకి 6 

చిలమత్తూరు జడ్పీటీసీ వైసీపీదే

అనంతపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి):గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన స్థానిక ఉపపోరు(ఎంపీటీసీ)లో  అధికార పార్టీ ప్రాభవం తగ్గుతోందా...? అంటే... అవునని ఫలితాలే బదులిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఈ ఫలితాలే చిహ్నమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వాటి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఓవైపు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూనే... మరోవైపు వలంటీర్ల ద్వారా బెదిరింపులకు తోడు ఓటుకు నోటు పంచి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార పార్టీ 10 స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి 6 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఈ ఫలితాలను చూస్తే... గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి పట్టు సడలలేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా... వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతంలో పెద్దగా తేడా కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తున్నామని, వైసీపీ వైపే ఓటర్లున్నారని ఆ పార్టీ స్థానిక నేతల నుంచి ముఖ్య నేతల వరకూ చెప్పు కుంటున్నప్పటికీ... ఓటు రూపంలో ఆ పార్టీకి ఓటర్ల నుంచి మద్దతు లభించలేదు.  


తేడా శాతం స్వల్పమే...

జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎంపీటీసీ స్థానాల పరిధిలో మొత్తం 42262 మంది ఓటర్లున్నారు. ఇందులో 31608 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 74.79 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాగా... గురువారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో 16 ఎంపీటీసీ స్థానాల పరిధిలో వైసీపీ అభ్యర్థులకు 15629 ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే... పోలైన ఓట్లలో 49.44 శాతం ఓట్లు ఆ పార్టీ కి దక్కాయి. ఇక టీడీపీ అభ్యర్థులకు 16 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 14494 ఓట్లు వచ్చాయి. అంటే  45.85 శాతం మంది ఓటర్లు టీడీపీకి ఓటేశారు. ఈ లెక్కన అటు వైసీపీ, ఇటు టీడీపీకి మధ్య వచ్చిన ఓట్ల తేడా 1135 ఓట్లు మాత్రమే. అంటే కేవలం 3.59 శాతం ఓట్లు తేడా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా... జరిగిన పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డులకు గానూ అధికార పార్టీకి అత్యధికంగా 18 వార్డులు దక్కాయి. టీడీపీ కేవలం రెండు వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ 20 వార్డులకుగానూ 20,409 మంది ఓటర్లుండగా... 16,940 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో వైసీపీ అభ్యర్థులకు 10279 ఓట్లు రాగా...  టీడీపీ అభ్యర్థులకు 6099 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోలైన ఓట్లతో పోలిస్తే... వైసీపీకి 60.67 శాతం ఓట్లు రాగా... టీడీపీకి 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన 24.67 శాతం ఓట్ల తేడా ఉంది. దీన్నిబట్టి చూస్తే... పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, ప్రలోభాలు, బెదిరింపులు పనిచేసినా... గ్రామీణ ప్రాంత ఓటర్లు వాటికి తలొగ్గలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది



జడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే....

జిల్లాలో చిలమత్తూరు జడ్పీటీసీతో పాటు 16 ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల స్థానిక పోరులో చిలమత్తూరు జడ్పీటీసీతో పాటు పది ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి దక్కాయి. 6 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మాజీ ఎమ్మె ల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన స్వగ్రామం పెద్దపప్పూరు మండలంలోని జూటూరు ఎంపీటీసీ స్థానం నుంచి అనూహ్య పరిణామాల నేపథ్యంలో... వైసీపీ అభ్యర్థి ఒక ఓటుతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో భాగంగా... ముందుగా టీడీపీ అభ్యర్థి నాలుగు ఓట్లతో గెలుపొందగా... వైసీపీ అభ్యర్థి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రీ కౌంటింగ్‌ పెట్టాలని పట్టుబట్టారు. దీంతో  రీ కౌంటింగ్‌ చేపట్టారు. టీడీపీ అభ్యర్థికొచ్చిన ఓట్లలో ఐదు ఓట్లు చెల్లని ఓట్లుగా తేల్చారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైసీపీ అభ్యర్థి ఒక ఓటుతో గెలుపొందినట్లు అధికారులు ధృవీకరించారు. 



చిలమత్తూరు జడ్పీటీసీ  వైసీపీదే...

హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు జడ్పీ టీసీ స్థానం వైసీపీ ఖాతాలోకే వెళ్లింది. ఆ జడ్పీటీసీ స్థానం పరిధిలో మొత్తం 41441 మంది ఓటర్లున్నారు. వీరిలో 25299 మంది ఓటర్లు ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా... వైసీపీ అభ్యర్థి గొల్ల అనూషకు 12952 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి లీలావతికి 9988 ఓట్లు వచ్చాయి. 2964 ఓట్ల ఆదిక్యంతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. కాగా... పోలైన ఓట్లతో పోలిస్తే  వైసీపీ అభ్యర్థికి 51.19 శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 39.47 శాతం ఓట్లు దక్కాయి.  మొత్తం ఈ పరిణామాలను పరిశీలిస్తే... గ్రామీణ ప్రాంతా ల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ప్రారంభమైందన్న అభిప్రా యం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. 

Updated Date - 2021-11-19T06:16:36+05:30 IST