తర‘గది’ కష్టాలు

ABN , First Publish Date - 2022-07-04T06:29:07+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి.

తర‘గది’ కష్టాలు

శిథిలావస్థలో సర్కారు బడులు

పెచ్చులూడిన తరగతి గదులు

అధ్వానంగా మరుగుదొడ్లు

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

రేపటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం


ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు విద్యార్థులు ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. అయితే పాఠశాలల పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇంకా విద్యాకానుక, పుస్తకాలు అందలేదు. దీంతో ఈ సంవత్సరం విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు. పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఆ స్థాయి సంగతి పక్కన పెడితే... కనీస సౌకర్యాలు కూడా లేని పాఠశాలలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి.


-నంద్యాల, ఆంధ్రజ్యోతి: 



 ప్రమాదం మాటున..


 జిల్లాలోని అనేక పాఠశాలల్లో తరగతి గదులు అధ్వానంగా ఉన్నాయి. పైన పెచ్చులూడి ఎప్పుడు ఊడిపడతాయో అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పెచ్చులూడి విద్యార్థులు గాయపడిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కొన్ని పాఠశాలలకు ప్రహరీలు లేవు. పక్కనే మురుగు కాలువలు ఉన్నాయి. దీంతో పశువులు, పందులు వంటివి పాఠశాలల ఆవరణల్లో తిరుగుతూ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేక గదులు లేవు. దీంతో తరగతి గదుల పక్కన... లేదంటే పాఠశాలలో ఓ మూలన నాలుగు బండల మాటున వంటలు తయారు చేస్తున్నారు. ఆరుబయట వంట శాలలు ఉన్న పాఠశాలల్లో వర్షాకాలం వచ్చిందంటే వంటలు చేయడానికి ఇబ్బంది. దీనివల్ల మధ్యాహ్న భోజనం సమయానికి అందేది కూడా అనుమానమే.


 నిరుపయోగంగా మరుగుదొడ్లు


ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే డొల్లతనం ఇట్టే తెలిసిపోతోంది. కొన్ని పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోగా... ఉన్నచోట్ల ఉపయోగించే స్థితిలో లేవు. దీంతో పిల్లలు ఆరుబయటకు వెళ్లక తప్పని దుస్థితి. దీంతో బాలికలు ఇబ్బంది పడుతున్నారు. 


తరగతి గదుల కొరత


ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు తరగతి గదుల కొరత ఉంది. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో కేవలం రెండు గదుల్లోనే 5 తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో వరండాల్లో... చెట్ల కింద తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. మామూలు రోజుల్లో ఎలాగోలా నెట్టుకొచ్చినా వర్షాలు కురిసేటపుడు ఆ రెండు గదుల్లోనే అందరినీ కూర్చోబెడుతున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి తోడు గత ఏడాది వైసీపీ ప్రభుత్వం బడుల విలీన ప్రక్రియ చేపట్టడంతో గదుల కొరత మరింత ఎక్కువైందన్న విమర్శలు వినిపించాయి. విలీన పాఠశాలల్లో ప్రభుత్వం కొత్తగా గదులు కట్టించింది లేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందీ లేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా ఒకే గదిలో రెండు, మూడు తరగతులను నడపక తప్పదేమో. దీని వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు.


ఇదీ పాఠశాలల పరిస్థితి


నంద్యాల మండలంలోని అయ్యలూరి గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉన్నది రెండే గదులు. అవి కూడా అధ్వానస్థితిలో ఉన్నాయి. పైన పెచ్చులూడి అస్తవ్యస్థంగా ఉన్నాయి. ఇక మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేక గది లేదు. 

బండి ఆత్మకూరు మండలం సోమయాజులపెల్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైన రూఫ్‌ పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. 

ప్యాపిలి మండలంలోని క్రిందిగేరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది. పాఠశాలను బాగుచేయాలని స్థానికులు కొన్నేళ్లుగా అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 

ఇక డోన్‌ పట్టణం నెహ్రూనగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలది మరో కథ. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలో పది గదులు ఉన్నాయి. ఇందులో ఉపాధ్యాయులు, సిబ్బందికి నాలుగు గదులు పోగా.. విద్యార్థులకు 6 గదులను వినియోగిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 3 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించనున్నారు. దీంతో తరగతులు సరే.. గదులేవి అన్న ప్రశ్న తలెత్తుతోంది. 


 పుస్తకాలు ఏవీ?


విద్యా సంవత్సరం మొదలుకాగానే పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పటి వరకు పాఠశాలలకు చేరిన పుస్తకాలు సగం మంది విద్యార్థులకు కూడా సరిపోవని సమాచారం. పుస్తకాలు లేకుండా విద్యా బోధన ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి. పంపిణీ మొదలుపెట్టాక కూడా సక్రమంగా వస్తాయన్న నమ్మకం లేదు. గత ఏడాది పుస్తకాల పంపిణీ డిసెంబరు వరకు కొనసాగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విద్యాకానుక రూపంలో ఇవ్వాల్సిన నోట్‌ పుస్తకాలు, యూనిఫారాలు,   బ్యాగులు, బూట్లు కూడా రాలేదు. ఈ నెల రెండు నుంచే విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నా విద్యా శాఖ అధికారులు అవి చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఇన్ని కష్టాల మధ్య విద్యార్థుల చదువు ఈ విద్యా సంవత్సరం ఎలా సాగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


పాణ్యం: పాణ్యంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. మొదటి విడతలో నాడు-నేడు పనులకు పాఠశాల ఎంపిక కాలేదు. 2019లో పాఠశాల అభివృద్ధికి నాబార్డు నిఽధులు రూ.1.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో భాగంగా రూ. 1.08 కోట్లతో నిర్మిస్తున్న పది అదనపు గదులు ఇంతవరకు పూర్తి కాలేదు. విద్యుత్‌, సౌకర్యం, ఇంగ్లీషు ల్యాబ్‌, మరుగుదొడ్లు, తాగునీరు, ఆర్వో ప్లాంటు, ఫర్నీచర్‌ ఏర్పాట్లు ఇంతవరకు పూర్తికాలేదు. నాడు-నేడు పనులకు మళ్లీ అనుమతులు మంజూరయ్యాయి. ఏడేళ్లుగా పాఠశాలకు అత్యవరమైన ప్రహరీ మాత్రం ఇంతవరకు నిర్మాణానికి నోచుకోలేదు. పాణ్యంలోని ఏఆర్‌ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో ప్రహరీ, వంట గదులు పడగొట్టడంతో వంట ఎక్కడ చేయాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.


రుద్రవరంలో  అసంపూర్తిగా భవనం


రుద్రవరం: రుద్రవరంలో ఉన్నత పాఠశాలలో నూతన భవనం నిర్మించేందుకు, పాత భవనాలకు మరమ్మతులు చేసేందుకు నాబార్డు రూ.98 లక్షలు మంజూరు చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో పనులు ప్రారంభమయ్యాయి. నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో విద్యాశాఖ అధికారులకే తెలియని పరిస్థితి ఉంది.


బేతంచెర్ల: నాగమల్లకుంట, బైనపల్లె గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండు పాఠశాలల్లోనూ తరగతి గదుల్లో పైపెచ్చులు ఊడి ఎప్పుడు పడతాయోనన్న భయంతో విద్యార్థులు వరండాలోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పాఠశాలలను నాడు-నేడు కింద ఎంపిక చేయకపోవడం పై గ్రామస్థులు మండిపడుతున్నారు.

Updated Date - 2022-07-04T06:29:07+05:30 IST