కరోనా తెచ్చిన కష్టం

ABN , First Publish Date - 2022-06-30T06:22:43+05:30 IST

‘నా కొడుకు పోయాక నువ్వెందుకు ఇక్కడ...మీ ఇంటికి తగలడు...నీతో, నీ పిల్లలతో మాకు సంబంధం లేదు...మళ్లీ ఇంటి గడప తొక్కితే బాగోదు. ఇంతటితో తెగదెంపులు చేసుకుందాం.

కరోనా తెచ్చిన కష్టం

కొవిడ్‌తో భర్తను కోల్పోయిన వారికి అత్తింటి నుంచి నిరాదరణ

నా కొడుకు పోయాక నువ్వెందుకు ఇక్కడ...

మీ ఇంటికి తగలడు...అంటూ వేధింపులు

సంబంధం లేదంటూ తెగదెంపులు చేసుకునేందుకు యత్నం

ఇళ్ల నుంచి గెంటివేత

డొమెస్టిక్‌ వయులెన్స్‌ సెల్‌కు పలువురు బాధితుల ఫిర్యాదు

అత్తింటి వారికి కౌన్సెలింగ్‌

సమస్య పరిష్కారం కాకుంటే న్యాయ స్థానంలో కేసు దాఖలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘నా కొడుకు పోయాక నువ్వెందుకు ఇక్కడ...మీ ఇంటికి తగలడు...నీతో, నీ పిల్లలతో మాకు సంబంధం లేదు...మళ్లీ ఇంటి గడప తొక్కితే బాగోదు. ఇంతటితో తెగదెంపులు చేసుకుందాం. మరోసారి ఇంటికి వచ్చినా, వేరే వాళ్లతో ఈ గొడవ గురించి చర్చ పెట్టినా మర్యాదగా ఉండదు’ 

...ఇదీ కొవిడ్‌తో భర్తను కోల్పోయిన ఓ అభాగ్యురాలికి అత్తింటి నుంచి ఎదురైన వేధింపు. నగరంలో చిరు వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ సమయంలో మృతి చెందాడు. అతడి భార్యను ప్రస్తుతం అత్తింటివారు తీవ్రంగా హింసిస్తుండడంతో ఆమె డొమెస్టిక్‌ వయులెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసింది. 

‘బాబు చనిపోయాక ఇంటి పరిస్థితి బాలేదు. వాడే లేనప్పుడు ఇంక నువ్వెందుకు ఇక్కడ...మీ పుట్టింటికి వెళ్లిపో. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిన్ను కూర్చోబెట్టి పోషించే స్థితిలో లేము.’ 

...కొవిడ్‌తో భర్తను కోల్పోయిన అనకాపల్లి జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళకు అత్తింటి కుటుంబం నుంచి ఎదురైన అనుభవం.

...వీరే కాదు. కొవిడ్‌తో భర్తను కోల్పోయిన చాలామంది ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆత్మీయంగా మెలిగిన అత్తమామలే వేధింపులకు గురిచేస్తుండడం, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ లభించకపోవడంతో...భర్తను కోల్పోయిన మహిళలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. 

ఇంటి నుంచి వెళ్లిపోవాలని.. 

కొవిడ్‌ వల్ల జిల్లాలో వందలాది మంది మృతిచెందారు. వారిలో పెళ్లై పిల్లలున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అప్పటికే వేరుగా వుంటున్న వారికి పెద్దగా సమస్యలు లేనప్పటికీ, భర్త సంపాదనపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న అత్తింటి వారితో కలిసి జీవిస్తున్న వారి పరిస్థితి దారుణంగా తయారైంది. భర్త చనిపోయిన తరువాత సదరు మహిళ, పిల్లలను అత్త,మామలు ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారు. తమ కొడుకు పోయిన తరువాత మీకు ఇక్కడ ఏం పని అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. భర్త చనిపోయిన తరువాత పుట్టింటికి వెళ్లి రావాల్సి ఉంటుంది. అలా, వచ్చిన సందర్భంలోనే ఇంటిలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  

తారస్థాయికి చేరడంతో ఫిర్యాదు.. 

ఈ తరహా వేధింపులు ఎదుర్కొంటున్న పలువురు ఎంవీపీ కాలనీలో గల డొమెస్టిక్‌ వయులెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 15 మంది వరకు ఫిర్యాదు చేశారు. భర్తను కోల్పోయిన తమను ఇళ్లలో నుంచి వెళ్లిపోవాలని అత్త,మామలు, ఇతర కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంటున్నారు. డొమెస్టిక్‌ సెల్‌ సిబ్బంది అత్తింటి కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకరి సమస్యను కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించగా, మరో రెండింటిపై కోర్టులో కేసు వేశారు. మిగిలిన వాటిని కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు భయపడి వేధింపులను భరిస్తున్న వారి సంఖ్య ఇంకా అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

పిల్లలనూ వద్దంటున్న పరిస్థితి.. 

కొవిడ్‌ వల్ల కొడుకును కోల్పోయిన కొన్ని కుటుంబాలు.. కోడలితోపాటు కొడుకు బిడ్డలను వద్దనుకుంటుండడం గమనార్హం. నగర పరిధిలోని పెందుర్తి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం కోడలితోపాటు ఇద్దరు మనుమలను తమ ఇంటికి రావద్దని చెప్పడం గమనార్హం. అలాగే, అనకాపల్లి జిల్లా పరిధిలో ఓ కుటుంబం మనవడు, మనవరాలు ఉన్నప్పటికీ...వారితో తమకు సంబంధం లేదంటూ ఇంట్లోకి రానివ్వడం లేదు. మరో మహిళకు ఇదే పరిస్థితి ఎ దురైనప్పటికీ..స్థానిక పెద్దల మాటతో ఇంట్లోకి అనుమతించారు. అయితే, పని మనిషిలా చూస్తూ సూటిపోటి మాటలతో హింసిస్తుండడంతో భరించలేక ఆమె డొమెస్టిక్‌ వయొలెన్స్‌ సెల్‌కు ఫిర్యాదుచేసింది. 


కౌన్సెలింగ్‌తో సమస్య పరిష్కారానికి కృషి

జ్యోతి, డొమెస్టిక్‌ వయులెన్స్‌ సెల్‌ కౌన్సిలర్‌

కొవిడ్‌ వల్ల భర్తను కోల్పోయిన పలువురికి కుటుంబ సభ్యుల నుంచి అనుకోని కష్టాలు ఎదురవుతున్నాయి. ఇళ్లల్లోకి రావద్దంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. కొందరు ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నాం. తేలని వాటిని కోర్టుకు సమర్పిస్తున్నాం. బాధిత మహిళలకు కోర్టులే న్యాయం చేస్తాయి. 


Updated Date - 2022-06-30T06:22:43+05:30 IST