పథకాల అమల్లో జిల్లా ముందంజ

ABN , First Publish Date - 2022-08-13T06:06:27+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో జిల్లా ముందంజలో ఉందని ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ అన్నారు.

పథకాల అమల్లో జిల్లా ముందంజ
త్రివర్ణ జెండాలను మంత్రులకు అందజేస్తున్న కలెక్టర్‌

అభివృద్ధి సమీక్షలో ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 12: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో జిల్లా ముందంజలో ఉందని ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని మీటింగు హాలులో నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలులో జిల్లా మెరుగైన స్థానంలో ఉందన్నారు. నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జిల్లాలో చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, కొవిడ్‌ మృతులకు పరిహారం చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. చామంతిపురం, కృష్ణాపురం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ జాతీయ జెండాలను అందజేశారు. 

‘స్పందన’ భవనానికి శంకుస్థాపన 

కలెక్టరేట్‌ ప్రాంగణంలో రూ.50 లక్షల జిల్లాపరిషత్‌ నిధులతో నిర్మించనున్న ‘స్పందన’ కార్యక్రమ భవనానికి శుక్రవారం మధ్యాహ్నం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌, డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారుల రకోసం ఈ భవన నిర్మాణం చేపడుతున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళల చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, చుడా చైర్మన్‌ పురుషోత్తం రెడ్డి, జేసీ వెంకటేశ్వర్‌, ఎస్పీ రిషాంత్‌ రెడ్డి, డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు చంద్రశేఖర్‌ రెడ్డి, రమణయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T06:06:27+05:30 IST