లాక్‌డౌన్‌ సమయంలో కేసుల విచారణలో జిల్లా ముందంజ

ABN , First Publish Date - 2021-03-07T06:02:05+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా న్యాయస్థానాలు కేసుల పరిష్కారంలో ముందంజలో ఉన్నాయని, జిల్లా పరిపాలన జడ్జిగా తనకు మంచి గుర్తింపు లభించిందని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టీస్‌ చల్లా కోదండరాం తెలిపారు.

లాక్‌డౌన్‌ సమయంలో కేసుల విచారణలో జిల్లా ముందంజ
జిల్లా కోర్టు ఆవరణలో గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేస్తున్న హైకోర్టు జడ్జి చల్లా కోదండరాం

- హైకోర్టు జడ్జి జస్టీస్‌ కోదండరాం

కరీంనగర్‌ లీగల్‌, మార్చి 6: లాక్‌డౌన్‌ సమయంలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా న్యాయస్థానాలు కేసుల పరిష్కారంలో ముందంజలో ఉన్నాయని, జిల్లా పరిపాలన జడ్జిగా తనకు మంచి గుర్తింపు లభించిందని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టీస్‌ చల్లా కోదండరాం తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఉమ్మడి జిల్లా న్యాయమూర్తుల కాన్ఫరెన్స్‌కు  హాజరయ్యారు.   మొదట రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఎంపీ నిధుల నుంచి కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ లైబ్రెరీహాల్‌కు రూ.20 లక్షలు మంజూరు చేయగా ఆ భవనానికి జడ్జి శంకుస్థాపన చేశారు.  మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించి విజేతలకు ప్రకటించారు. అనంతరం ఉమ్మడి జిల్లా బార్‌ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయవాదులు టెక్నాలజీని వినియోగించుకోవాలని, కరోనా సమయంలో వచ్చిన ఆన్‌లైన్‌ విధానం భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో రానుందని తెలిపారు.  కరోనా సమయంలో కేసుల పరిష్కారంలో రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు  సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లాగా  పరిశీలిస్తానన్నారు. జిల్లా జ్యుడీషియరీ అభివృద్ధికి  పూర్తి సహకారం అందిస్తానన్నారు.  సమావేశంలో జిల్లా జడ్జి ఎం.జి ప్రియదర్శిని, అదనపు జిల్లా జడ్జిలు డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరెడ్డి, కృష్ణమూర్తి, లలితా శివజ్యోతి, కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పీవీ రాజ్‌కుమార్‌, కార్యదర్శి లెంకల రాంరెడ్డి, సిరిసిల్ల పెద్దపల్లి, కోరుట్ల, జగిత్యాల బార్‌ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T06:02:05+05:30 IST