జిల్లా వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-22T05:28:52+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఫీవర్‌ సర్వే ప్రారంభమైంది. తొలి రోజు శుక్రవారం అనుమానిత లక్షణాలున్న 849 మందిని గుర్తించినట్లు జిల్లా ప్రోగ్రాం అధికారి శశికళ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే ప్రారంభం
గద్వాలలో ఫీవర్‌ సర్వేను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

- అనుమానిత లక్షణాలున్న 849 మంది గుర్తింపు, మెడికల్‌ కిట్లు అందజేత

- పర్యవేక్షించిన అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల/ గద్వాల క్రైం/ అలంపూర్‌/ ఉండవల్లి/ ఇటిక్యాల/ అయిజ, జనవరి 21 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఫీవర్‌ సర్వే ప్రారంభమైంది. తొలి రోజు శుక్రవారం అనుమానిత లక్షణాలున్న 849 మందిని గుర్తించినట్లు జిల్లా ప్రోగ్రాం అధికారి శశికళ తెలిపారు. 588 మంది వైద్యసిబ్బంది బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా 30,428 ఇళ్లలో సర్వే నిర్వహించారు. అనుమానిత లక్షణాలున్న వారికి మెడికల్‌ కిట్లను అందించారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతు న్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు. సర్వే చేసేందుకు వచ్చే వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. గద్వాల పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో ఫీవర్‌ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష పర్యవేక్షించారు. 


- గద్వాల మండలంలో ఎంపీడీవో జెమ్లా నాయక్‌, ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 46 బృందాలు ఫీవర్‌ సర్వే నిర్వహించాయి. 2,301 ఇళ్లను సర్వే చేసి, 132 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించి మందులను పంపిణీ చేశారు. మరో 43 మందికి కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో కరోనా కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని, ఇంటికే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు. 


పారదర్శకంగా చేపట్టాలి

గ్రామాల్లో ఫీవర్‌ సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం అన్నారు. ఉండవల్లి మండల కేంద్రంలో కొనసాగు తున్న ఫీవర్‌సర్వేను శుక్రవారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేలో భాగంగా జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, ఇతరాత్ర జబ్బులు ఉన్నవారిని గుర్తించి, అవసరమైన మందులు అందిం చాలని చెప్పారు. తగిన సూచనలు ఇవ్వాలని అంగన్‌ వాడీ, ఆశ వర్కర్లకు సూచించారు. ప్రజలు కూడా సర్వేకు పూర్తిగా సహకరించాలని కోరారు. బయటికి వెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలని, గుంపులుగా ఉండకుండా, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగశేషాద్రి సూరి, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి

ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేయాలని ఇటిక్యాల ఎంపీడీవో రవీంద్ర వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇటిక్యాల మండలంలోని మొగిలిరావులచెర్వు గ్రామంలో వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న ఫీవర్‌ సర్వేను ఆయన శుక్రవారం పరిశీలించారు. గ్రామాల్లో విషజ్వరాలు, ఇతర వ్యాధుల బారిన పడిన వారిని గుర్తించి పేర్లు నమోదు చేయాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ సర్వే కొనసాగించాలని చెప్పారు. 


- అలంపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో శుక్రవారం ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఫీవర్‌ సర్వే చేపట్టారు. జ్వరం, కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి మందులు అందించారు. వైద్య సిబ్బంది 40 బృందాలుగా ఏర్పడి 2,277 ఇళ్లను సర్వే చేశారు. కొవిడ్‌ లక్షణాలున్న 105 మందిని గుర్తించి మెడికల్‌ కిట్లు అందించారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని సూచంచారు. 


- అయిజ మండలంలో 89 బృందాలు 3,500 ఇళ్లలో సర్వే చేశాయి. అనుమానిత లక్షణాలున్న 85 మందిని గుర్తించి మెడికల్‌ కిట్లు అందించారు. ఎంపీడీవో సాయిప్రకాశ్‌ కార్యకమాన్ని పర్యవేక్షించారు.



Updated Date - 2022-01-22T05:28:52+05:30 IST