కలవరపెడుతోన్న కరోనా

ABN , First Publish Date - 2021-05-10T05:14:58+05:30 IST

మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏ వీఽధిలో చూసినా పాజిటివ్‌ వచ్చిన వారే కనిపిస్తున్నారు. దీంతో ఈ మహమ్మారి మాకెక్కడ వస్తుందోనని వ్యాక్సిన్‌ వేసుకునేందుకు జనం పరుగులు పెడుతున్నారు. అయితే వ్యాక్సిన్‌ వేసుకున్నాం.. మాకేం కాదని కొందరు మొండిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

కలవరపెడుతోన్న కరోనా
వ్యాక్సిన్‌ కోసం క్యూలో ఉన్న ప్రజలు (ఫైల్‌)

వ్యాక్సిన్‌ కోసం జనం పరుగులు 

కట్టడిలో అధికారులు విఫలం

సీకేదిన్నె, మే 9: మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏ వీధిలో చూసినా పాజిటివ్‌ వచ్చిన వారే కనిపిస్తున్నారు. దీంతో ఈ మహమ్మారి మాకెక్కడ వస్తుందోనని వ్యాక్సిన్‌ వేసుకునేందుకు జనం పరుగులు పెడుతున్నారు. అయితే వ్యాక్సిన్‌ వేసుకున్నాం.. మాకేం కాదని కొందరు మొండిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొందరు వ్యాక్సిన్‌ వేసుకోకుండానే భయం లేకుండా, కనీసం మాస్కు లేకుండా నిర ్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొవిడ్‌ కేసులు ఎక్కువవడంతో వైద్యశాఖ వారు తలలు పట్టు కుంటున్నారు. కాగా, ప్రభుత్వం ఈ మధ్య 12 గంటల తరువాత కర్ఫ్యూ విధించింది. బయట తిరగొద్దని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని సూచిస్తోంది. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఇదిలా ఉండగా మండలంలోని కొప్పర్తి, తాడిగొట్ల, నాగిరెడ్డిపల్లె గ్రామాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. మిగతా గ్రామాల్లో కూడా అక్కడక్కడా కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడిస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారిలో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, మరికొందరు హోంఐసొలేషన్‌లో ఉంటున్నారు. 


ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

ప్రతిఒక్కరూ జాగ్ర త్తగా ఉండాలి. మాస్కు లేనిదే బయటకు రాకూ డదు. మండలంలో ఇప్పటికే 700 పైగా పాజిటివ్‌ కేసులు ఉండగా, 421 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కొవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ మొదటి, రెండవ డోస్‌ కలిపి మొత్తం 6,923 మందికి వ్యాక్సిన్‌ అందించాం. మిగతా వారికీ వ్యాక్సిన్‌ అందిస్తాం. అయితే వ్యాక్సిన్‌ వేసుకున్నాం కదా అని కొందరు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. అది మంచిది కాదు. మా వంతు ఆయా గ్రామాల్లో సిబ్బందితో అవగాహన కల్పిస్తూ సూచనలు చేస్తూనే ఉన్నాం. అయినా ప్రజలు తెలుసుకుని సహకరించాలి. 

 - శైలజ, వైద్యాధికారిణి

Updated Date - 2021-05-10T05:14:58+05:30 IST