నెరవేర్చాల్సిన దైవకార్యం

ABN , First Publish Date - 2020-12-18T05:32:04+05:30 IST

మానవులకు మంచి మార్గాన్ని చూపించడానికీ, వారిని సత్కార్యాల వైపు నడిపించడానికీ మహా ప్రవక్తలను అల్లాహ్‌ ఈ భూమి మీదకు పంపాడు.

నెరవేర్చాల్సిన దైవకార్యం

మానవులకు మంచి మార్గాన్ని చూపించడానికీ, వారిని సత్కార్యాల వైపు నడిపించడానికీ మహా ప్రవక్తలను అల్లాహ్‌ ఈ భూమి మీదకు పంపాడు. దేవుడు మెచ్చిన సద్గుణాల వైపు మానవులను ఆహ్వానించడం, అదే సమయంలో అన్ని రకాల చెడుల నుంచీ వారిని దూరంగా ఉంచడం, తద్వారా ఇహపర సాఫల్యం పొందడానికి దోహద పడడం, దైవ ప్రసన్నతను పొందేలా, దైవాగ్రహం నుంచి తమనుతాము కాపాడుకొనేలా వారికి  మార్గనిర్దేశం చేయడం... ఇవీ ప్రవక్తల కర్తవ్యాలు. అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ రాకతో దేవుడి నుంచి దూతలుగా వచ్చే ప్రవక్తల పరంపర పూర్తయింది. అందుకనే, ప్రళయదినం వరకూ ఈ మహత్కార్యాన్ని నెరవేర్చే బాధ్యత మహా ప్రవక్త మహమ్మద్‌ అనుచర సమాజానిది. 


మానవులలో మంచి వైపు పిలిచి, మంచి పనులు చేయాలని ఆజ్ఞాపించి, చెడు నుంచి వారించే ఒక వర్గం ఉండడం తప్పనిసరి. ఈ పనులు చేసేవారే సాఫల్యం పొందుతారని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ పేర్కొన్నారు. ‘‘ఓ మహమ్మద్‌ అనుయాయులారా! మీరు సమస్త మానవాళి కోసం ఉనికిలోకి వచ్చిన అత్యుత్తమమైన సముదాయం. మీరు మంచి చెయ్యాలని ఆజ్ఞాపిస్తారు. చెడు వైపు మళ్ళకుండా ఆపుతారు. అల్లాహ్‌ను విశ్వసిస్తారు. విశ్వాసంతో కూడిన జీవితం గడుపుతారు’’ అని అల్లాహ్‌ తెలిపారు.


వేరొకరిని సత్కార్యం వైపు మళ్ళించిన వ్యక్తికి ఆ సత్కార్యం చేసిన వారికి లభించే దానితో సమానమైన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా మంచి పని కోసం పిలుపు ఇచ్చే వ్యక్తికి... ఆ మంచి పని వల్ల కలిగే ఫలితంతో సమానమైనది ఒనగూరుతుంది. అదేవిధంగా, ఇతరులను చెడు మార్గాలవైపు, దుష్ట కార్యాలవైపు ప్రోత్సహిస్తే... ఆ పనులు చేసే వారికి వచ్చే పాపంతో సమానమైన పాపం వాటిని ప్రోత్సహించిన వారికి కూడా వస్తుందని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. ‘‘విశ్వాసులారా! నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తిమంతుడి (భగవంతుడి) సాక్షిగా చెబుతున్నాను. మంచిని చెయ్యాలని ఆజ్ఞాపించండి. చెడు నుంచి ఇతరులను వారించండి. ఈ కార్యాన్ని నెరవేరుస్తూ ఉండండి. ఇది మీకు తప్పనిసరి. దీన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు. దాని నుంచి కాపాడాలని మీరు మొరపెట్టుకున్నా ఫలితం ఉండదు’’ అని ఆయన స్పష్టం చేశారు.


అలాగే పాప కార్యాలను సమర్థించేవారికి కూడా ఆ పాపంలో భాగం ఉన్నట్టే. ఎక్కడైనా అలాంటిది జరిగినప్పుడు అక్కడ ఉండి, దాని పట్ల తమ అసంతృప్తినీ, అసహనాన్నీ వ్యక్తం చేసేవారు అక్కడ లేనివారిగానే పరిగణన పొందుతారనీ, దాన్ని సమర్థించే వ్యక్తులు అక్కడ లేకపోయినా దానిలో భాగస్వాములుగా పరిగణన పొందుతారనీ దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. కాబట్టి తోటివారికి మంచి మార్గం చూపాలి. వాళ్ళు చెడ్డ దారుల్లోకి మళ్ళకుండా నిరోధించాలి. ప్రవక్తలు నిర్దేశించిన, మానవులు నెరవేర్చవలసిన దైవ కార్యం అదే.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-12-18T05:32:04+05:30 IST