కల నెరవేరింది

ABN , First Publish Date - 2021-11-13T06:31:22+05:30 IST

అధికార పార్టీలో ఆ ఇద్దరి కల నెరవేరింది.

కల నెరవేరింది

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 

వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కల్యాణిలకు టిక్కెట్లు

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

16 నుంచి నామినేషన్లు స్వీకరణ

వచ్చే నెల పదో తేదీన ఎన్నికల నిర్వహణ

ఎన్నిక లాంఛనమే


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అధికార పార్టీలో ఆ ఇద్దరి కల నెరవేరింది. ఎన్నో ప్రయత్నాలు...మరెన్నో హామీలు...పోటీగా బరిలో మరికొందరు నాయకులు. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ. అవకాశం ఇస్తారో, లేదోనని..ఏదైతేనేమి చివరికి ఇద్దరి పేర్లను  వైసీపీ అధిష్ఠానం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌కు, మరో నాయకురాలు వరుదు కల్యాణికి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల్లో  వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వుండడంతో వారి ఎన్నిక లాంఛనమే కానున్నది.


ఇద్దరి ప్రస్థానం ప్రజారాజ్యం నుంచే

చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కల్యాణి.. ఇద్దరూ ప్రజారాజ్యం పార్టీ ద్వారా 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. వంశీకృష్ణ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓటమి చవిచూశారు. అటు వరుదు కల్యాణి శ్రీకాకుళం నుంచి అదే ఏడాది పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఇద్దరూ వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస్‌ వైసీపీ తరఫున మళ్లీ తూర్పులో అదే వెలగపూడిపై పోటీ చేసి రెండోసారి ఓడిపోయారు. మళ్లీ 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. విశాఖపట్నం మేయర్‌గా అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇవ్వడంతో నాడు పోటీకి దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అయితే మేయర్‌ పీఠం ఆయనకు దక్కలేదు. అదే సామాజికవర్గానికి చెందిన గొలగాని హరివెంకటకుమారిని ఎంపిక చేయడంంతో వంశీకృష్ణ తీవ్ర ఆవేదన చెందారు. పార్టీలో కొందరు తనను మోసం చేశారంటూ వాపోయారు. అయితే ఎక్కడా నోరు జారకుండా, తనకు జరిగిన అన్యాయం పార్టీ అధినేతకు చెప్పుకొంటానని, భార్యతో సహా వెళ్లి జగన్‌ను కలిశారు. రాజకీయాల్లోకి వచ్చి తాను ఆర్థికంగా ఎంత చితికిపోయిందీ వివరించారు. పరిస్థితి బాగా లేకున్నా పార్టీ నగర అధ్యక్షునిగా వుంటున్నానని చెప్పుకోవడంతో అక్కడ అభయం లభించింది. ఇక్కడ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న సాయిరెడ్డి కూడా మాట సాయం చేయడంతో వంశీకృష్ణకు ఎట్టకేలకు అవకాశం లభించింది. 


కల్యాణి మెట్టినిల్లు చోడవరం

వరుదు కల్యాణి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సారవకోట. జిల్లాలోని చోడవరం అత్తవారి ఊరు. 2012లో వైసీపీలో చేరారు. తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా, ఆ తరువాత అరకు పార్లమెంటు ఎన్నికల ఇన్‌చార్జిగా, అనంతరం విజయనగరం పార్లమెంటు ఇన్‌చార్జిగా చేశారు. 2019 ఎన్నికల ముందు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎంపీగా పోటీ చేసే అవకాశం పార్టీ  కల్పించింది. అయితే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో ఆమెను తప్పించి టీడీపీ నుంచి డాక్టర్‌ సత్యవతిని తీసుకువచ్చారు. ఆ తరువాత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పర్యవేక్షకురాలిగా పనిచేశారు. పార్టీని నమ్ముకొని పనిచేయడంతో ఆమెకు అధిష్ఠానం ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇచ్చింది.  


ఎన్నికలకు షెడ్యూల్‌

జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా వున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 26న పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబరు పదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే, రెండు మునిసిపాలిటీల్లోని కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. వీటిల్లో సింహభాగం వైసీపీ గెలుచుకోవడంతో ఎన్నిక లాంఛనంగానే వుంటుందని అంటున్నారు.


మూడు నెలల క్రితం ఖాళీ అయిన స్థానాలు

స్థానిక సంస్థల కోటాలో కిందటసారి టీడీపీ తరపున పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్‌ మూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మూర్తి మరణంతో ఖాళీ అయిన స్థానంలో అనకాపల్లికి చెందిన బుద్ధ నాగజగదీశ్వరరావుకు పార్టీ అవకాశం కల్పించింది. వారి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీతో ముగిసింది. అయితే, అప్పటికి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా ఫలితాలు ఆలస్యం కావడంతో...ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది.

Updated Date - 2021-11-13T06:31:22+05:30 IST