పాణ్యంను నంద్యాల జిల్లాలో కలపాలి

ABN , First Publish Date - 2022-01-29T05:07:59+05:30 IST

పాణ్యం మండలాన్ని నంద్యాల జిల్లాలో కలిపేవరకు ఆందోళన చేస్తామని ప్రజాసంఘాల నాయకులు అన్నారు.

పాణ్యంను నంద్యాల జిల్లాలో కలపాలి
పాణ్యం జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు

  1.  ప్రజా సంఘాల నాయకుల డిమాండ్‌


పాణ్యం, జనవరి 28: పాణ్యం మండలాన్ని నంద్యాల జిల్లాలో కలిపేవరకు ఆందోళన చేస్తామని ప్రజాసంఘాల నాయకులు అన్నారు.  శుక్రవారం స్థానిక బస్టాండు కూడలిలో జాతీయ రహదారిపై ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు. స్థానిక టీ చంద్రయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకుడు రాంమోహన్‌నాయుడు, ఆర్వీఎఫ్‌, ఏఐఎ్‌ఫబీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘాల నాయకులు రాజునాయుడు, వెంకటాద్రి, శివవకృష్ణ యాదవ్‌, ప్రతాప్‌, రియాజ్‌ మాట్లాడుతూ పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలోనే కలపాలన్నారు. 14 కిలోమీటర్ల రూరంలో ఉన్న పాణ్యంను 70 కిలోమీటర్ల దూరంలోని కర్నూలు జిల్లాలో కలిపేలా ప్రభుత్వం గజిట్‌ తయారు చేయడం వెనుక గల కారణాలు తెలపాలన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రణాళిక విభాగం కార్యదర్శి ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలో కలిసి ఉండే కల్లూరును దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గాన్ని కర్నూలులో కలపడం అన్యాయమన్నారు. కల్లూరు వాసులు నంద్యాలకు రావడంలోని ఇబ్బందులు పరిశీలించారే తప్ప రెండు నియోజకవర్గాల ప్రజలకు ఏర్పడే సమస్యలు ప్రణాళికా విభాగం కార్యదర్శికి కనపడలేదా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంతోపాటు రెవెన్యూ డివిజన్‌ కూడా కర్నూలులోనే ఉండడంతో రెండు మండలాల  రైౖతులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలోనే ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేస్తే డ్రైవర్లు కర్నూలుకు వెళ్లి తమ వాహనాలను రిజిస్ట్రేషన్‌  చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఆర్‌డీవో, డీఎస్పీ, తదితర జిల్లా అధికారులు కర్నూలులోనే ఉండాల్సి వస్తుందన్నారు. న్యాయస్థానం కర్నూలులోనే ఉండడంతో పాణ్యం, గడివేముల పోలీసులు 70 కిలోమీటర్ల దూరంలోని కర్నూలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. యాభై ఏళ్లుగా నియోజకవర్గ కేంద్రంగా ఉన్నా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని పాణ్యం ఈ పరిణామంతో మరింత వెనకబాటుకు గురవుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు కేజే శ్రీనివాసరావు, ప్రతాప్‌, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-29T05:07:59+05:30 IST