ఎనిమిది ఆలయాల నెలవు!

ABN , First Publish Date - 2021-04-30T05:30:00+05:30 IST

శిల్ప సౌందర్యం, ప్రకృతి సోయగం, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన చోటు భైరవకోన. ఇక్కడ ఒకే కొండలో ఎనిమిది గుహాలయాలు చెక్కి ఉండడం ఒక విశేషమైతే, ఒక చోట త్రిమూర్తులు కొలువు తీరడం మరో ప్రత్యేకత...

ఎనిమిది ఆలయాల నెలవు!

శిల్ప సౌందర్యం, ప్రకృతి సోయగం, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన చోటు భైరవకోన. ఇక్కడ ఒకే కొండలో ఎనిమిది గుహాలయాలు చెక్కి ఉండడం ఒక విశేషమైతే, ఒక చోట త్రిమూర్తులు కొలువు తీరడం మరో ప్రత్యేకత. 


నల్లమల అడవుల్లో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని భైరవకోన. కీకారణ్యం మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో కొండలూ కోనలూ, వాగులూ వంకలూ ప్రకృతి ఆరాధకులను మైమరపిస్తాయి. మరోవైపు పురాతనమైన ఆలయాల శిల్ప సంపద అబ్బురపరుస్తుంది. ఆధ్యాత్మికంగా భైరవకోనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకే కొండలో మలచిన ఎనిమిది ఆలయాలు భక్తులను తరతరాల నుంచి ఆకర్షిస్తున్నాయి. ఏడు తూర్పు ముఖంగా, ఒకటి ఉత్తరముఖంగా ఉండే ఈ ఆలయాలన్నిటిలో ప్రధాన దైవం మహాశివుడు. ఒక్కక్క లింగాన్నీ ఒక్కొక్క పేరుతో ఆరాధిస్తారు. ఎనిమిదో గుహలో గోడల మీద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు కనిపిస్తాయి. గర్భగుడిలో శివుడు లింగాకారంలో ఉంటాడు. అలాగే ఇక్కడ ఉన్న పురాతనమైన త్రిముఖ దుర్గాదేవి ఆలయాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. క్షేత్రపాలకుడైన భైరవుడితో పాటు వనదుర్గ, అన్నపూర్ణేశ్వరి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఈ ప్రాంతానికి ‘భైరవకోన’ అనే పేరు ఎలా వచ్చిందో వివరించే కథ స్థల పురాణంలో ఉంది. కృతయుగంలో, హిరణ్యకశిపుడి సంహారం తరువాత ప్రహ్లాదుడు నృసింహ స్వామికి ఆలయం కట్టించి, భైరవుడు అనే వ్యక్తిని అర్చన కోసం ఏర్పాటు చేశాడు. ప్రహ్లాదుడు పరమపదించాక, ఆ ఆలయాన్ని పట్టించుకొనేవారు లేకపోవడంతో... భైరవుడు దారిదోపిడీలతో జీవించేవాడు. చివరకు నృసింహస్వామి శాపంతో రాక్షసుడిగా మారాడు. శాపవిమోచన కోసం భైరవుడు వేడుకోగా.. భక్తులు తనకు కనిపించకుండా తెచ్చే పదార్థాలను స్వీకరించి బతకమనీ, కలియుగం పూర్తయ్యాక తనను ప్రత్యక్షంగా సేవించుకోవచ్చనీ అతనికి స్వామి వరమిచ్చాడు. అప్పటి నుంచీ అదృశ్యంగా ఉంటూ ఈ ప్రాంతాన్ని భైరవుడు కాపాడుతున్నాడన్న విశ్వాసం ఉంది. 

ప్రతి యేటా కార్తిక పౌర్ణమి రోజున... దుర్గ ఆలయంలో... అమ్మవారి విగ్రహం మీద చంద్ర కిరణాలు పడతాయి. ఆ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు భైరవకోనను సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో 200 అడుగుల ఎత్తునుంచీ దూకే జలపాతం, ఆలయం సమీపంలో అన్ని కాలాల్లోనూ ప్రవహించే సెలయేరు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.


Updated Date - 2021-04-30T05:30:00+05:30 IST