మూర్తీభవించిన తెలంగాణ ఉద్యమం

ABN , First Publish Date - 2022-01-27T05:56:32+05:30 IST

వివక్ష, దోపిడీ, అణచివేత, అవమానాల నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్గత వలసపాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తం చేయడానికి 1952 నుంచి అహరహం పోరు చేసిన ప్రొ.కేశవరావు జాదవ్‌ను...

మూర్తీభవించిన తెలంగాణ ఉద్యమం

వివక్ష, దోపిడీ, అణచివేత, అవమానాల నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్గత వలసపాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తం చేయడానికి 1952 నుంచి అహరహం పోరు చేసిన ప్రొ.కేశవరావు జాదవ్‌ను తలుచుకోకుంటే కృతఘ్నతే అవుతుంది. పాతబస్తీ హుసేని ఆలంలో 1933 జనవరి 27న ఆర్యసమాజ్ కుటుంబంలో జన్మించి సమాజమే కుటుంబంగా నిరంతరం సమసమాజ నిర్మాణం కోసం తపించి, శ్రమించిన స్వార్థరహితుడు ప్రొ. జాదవ్.


తెలంగాణలో కరువొచ్చినా, కాటకమెచ్చినా, వరదొచ్చినా, కలహాలొచ్చినా ప్రజలతో కలిసి ఎండలో, నీడలో వెంటనడిచిన ధన్యజీవి. విద్యార్థిగా ముల్కీ ఉద్యమంలో అరెస్టయి, జీవితచరమాంకంలో కూడా పోలీసు లాఠీలకు, తూటాలకు, చెరసాలలకు వెరవకుండా తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలకు నారు, నీరు పోసిన వైతాళికుడు. రాంమనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెజ్, బద్రీ విశాల్ పిత్తీ వంటి వారితో కలిసి సోషలిస్టు పార్టీని నిర్మించడంలో అగ్రభాగాన ఉన్నారు.


మలిదశ ఉద్యమానికి నాందిగా గౌలీగూడలో సభలు పెట్టించి, అక్కడ నందినీ హోటల్‌లో ప్రొ. జయశంకర్‌కు ఏళ్ల తరబడి వసతి కల్పించి ఉద్యమానికి ఊతం ఇచ్చారు ప్రొ. జాదవ్. పత్రికలు, కరపత్రాల ద్వారా సామ్యవాద సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అటు మావోయిస్టుల నుంచి, కాంగ్రెస్ నుంచి, ఆరెస్సెస్ వరకు అన్ని పార్టీలను ఒక్క గొడుగు కిందికి తెచ్చి ఉద్యమాన్ని నడిపిన ఏకైక ఉద్యమకారుడు. సోనియాగాంధీ మొదలు లాల్ కృష్ణ ఆడ్వాణి వరకు నేతలందరినీ కలిసి తెలంగాణ కోసం రాష్ట్ర విభజన బిల్లు పెట్టాలని వాదించి, ఒప్పించిన మేధావి, కార్యశీలుడు. తనను తాను ‘మిస్టర్ తెలంగాణ’గా చెప్పుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం అంటేనే ప్రొ. జాదవ్. జాదవ్ అంటేనే తెలంగాణ. ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేదే కాదు.


సోషలిస్టు ఉద్యమం కోసం, తెలంగాణ కోసం, హైదరాబాద్ ఏక్తా కోసం విరామం, నైరాశ్యం ఎరుగక అహోరాత్రాలు వీధుల్లోనే శ్రమించిన ప్రొ. కేశవరావు జాదవ్‌ను, ఆయన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా స్మరించుకుందాం.  ప్రొ. జాదవ్ జయంతిని పురస్కరించుకుని జనవరి 27 గురువారం నాడు మధ్యాహ్నం 3గంటల నుంచి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అఖిలపక్ష సభ జరుగనున్నది. డాక్టర్ రాంమనోహర్ లోహియా చూపిన సమాజవాద సిద్ధాంతం వెలుగులో ప్రజాతెలంగాణ నిర్మాణానికి దారులు తీయడానికి సమష్టిగా కృషిచేద్దాం.

లోహియా విచార్ మంచ్

Updated Date - 2022-01-27T05:56:32+05:30 IST