విద్యాబోధనలో ‘ఆంగ్ల’ విప్లవం

ABN , First Publish Date - 2022-01-26T06:47:14+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యాబోధనలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు....

విద్యాబోధనలో ‘ఆంగ్ల’ విప్లవం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యాబోధనలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం. అంతే కాదు, ఒక విప్లవాత్మకమైన పరిణామం. ఎంతో హర్షణీయమైనది అనడంలో సందేహం లేదు. ప్రపంచీకరణతో సకల దేశాల సమాజాలు వేగంగా విస్తరిస్తున్న కాలమిది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అవకాశాలను అందరూ అందిపుచ్చుకోవాలన్న ఆకాంక్షతో గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల భావితరాలకు ఇంగ్లీష్ విద్యను సమకూర్చాలని మన ముఖ్యమంత్రి సంకల్పించారు. ఆయన అధ్యక్షతన ఈ నెల 17న రాష్ట్ర క్యాబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితో పాటు గ్లోబల్ మొబిలిటీ అనునిత్యం పెరుగుతోంది. ముఖ్యంగా సేవారంగంలో అంతర్జాతీయ అవకాశాలు మనదేశంలోని ఐటీ కంపెనీలకు విశేషంగా వస్తున్నాయి. ఉన్నత విద్యారంగంలో కూడా సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కామర్స్ కోర్సుల ప్రాధాన్యత పెరుగుతున్నది. ఉపాధి పొందడానికి ఆయా ఐటి కంపెనీలకు యువ సుశిక్షిత వృత్తి నిపుణుల అవసరం నేడు చాలా ఉంది. కనుక రాష్ట్రంలో మానవ వనరులను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. యువతీ యువకుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల సమున్నత వికాసమే ఆ అభివృద్ధిని నిర్ణయాత్మకంగా నిర్వచిస్తుంది. 


ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలకు పరిమితమైన ఇంగ్లీష్ మీడియం ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో పాటు, ఆ సరి కొత్త విద్యావిధానం అమలుకు అవసరమైన వసతులు, సదుపాయాలనూ సమగ్రంగా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 7289 కోట్లు కేటాయిస్తున్నది. ఎంతో కీలకమైన ఆ వసతులను సమకూర్చడం వల్ల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య లభ్యమవుతుంది. మెరుగైన ఫలితాలు వస్తాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే అవసరం ఉండదు. వారి విద్య కోసం తల్లిదండ్రులు భరించాల్సిన ఖర్చు తగ్గుతుంది. తల్లిదండ్రుల సంరక్షణలోనే వారు నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వం గొప్ప మనసుతో ప్రజల మనోభావాలను గమనించి, స్పందించి విద్యాబోధనలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడమనేది ఒక గొప్ప నిర్ణయం. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్‌లో విద్యాబోధనకు అవసరమైన శిక్షణ ఇస్తోంది. దీనిని విస్తృతపరచాలి. పటిష్ఠం చేయాలి. 


ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్ 26 ప్రకారం విద్య ప్రతి ఒక్కరి హక్కు. తమ పిల్లలు ఎలాంటి విద్య నేర్చుకోవాలి అనే విషయమై నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. అంటే పిల్లల ప్రాధాన్యతలు గుర్తించి, వారు కోరుకున్న విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు మంచి భవిష్యత్తు నిర్మించేందుకు వారిని ఆంగ్ల మాధ్యమంలో చదివించాలనేది ఈ కాలం తల్లిదండ్రులు ప్రగాఢంగా అభిలషిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అట్టడుగువర్గాల పిల్లల ఆశ్రమాలుగా నేడు చలామణి అవుతున్నాయి. కాబట్టి వారి చెంతకు ఇంగ్లీష్ మీడియంతో కూడిన విద్యను తీసుకువెళ్లడం ఆనందించదగ్గ విషయం. ఈ నిర్ణయం అట్టడుగువర్గాల పిల్లల జీవన ప్రమాణాల మెరుగుదలకు దారిని సుగమం చేస్తుంది. పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదువుకుని ఉన్నతోద్యోగాలు సంపాదించి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి దోహదం చేసే నిర్ణయమిది. 


మనదేశంలో ప్రపంచీకరణ 1991లో ప్రారంభమైంది. ప్రపంచీకరణ ప్రభావంతో అన్ని రంగాలు మార్పునకు గురైనట్టుగానే విద్యారంగం కూడా మార్పుకు గురైనది. ఈ మార్పును గుర్తించిన ప్రైవేటు విద్యాసంస్థలు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నాయి. ఈ మార్పును ముందుగా గుర్తించిన కొన్ని శిష్ట వర్గాలు (ఉన్నత వర్గాలు) ఇంగ్లీష్ విద్యను అందుకుని అమెరికా, లండన్, జర్మనీ మొదలైన పాశ్చాత్య దేశాలలో విద్య, ఉపాధి అవకాశాలు పొంది అభివృద్ధి చెందాయి. అయితే గతంలో మన ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురాలేకపోయాయి. నేటి ప్రపంచం పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ విద్య లేకుంటే ఉద్యోగ అవకాశాలు పొందడం కష్టం. ఇది అక్షరాల వాస్తవం. ఇంగ్లీష్ విద్యను ఉద్దేశించి ఒక సామాజిక తత్వవేత్త ‘ఇంగ్లీష్ విద్య భవిష్యత్ తరాల జీవన పోరాటంలో ఆయుధం’ వంటిదని అన్నాడు. ఇంగ్లీష్ విద్య ఆవశ్యకత రోజురోజుకు పెరిగిపోతోంది. ఎందుకంటే, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలు ఎక్కువగా ఏ భాషలో అభివృద్ధి చెందుతుంటాయో, ఆ భాషలోనే మన నిత్య పురోగమన శీల ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ఉపాధి కల్పన అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంగ్లీష్ కారణంగానే మన దేశ యువత నేడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో బ్రిటన్, అమెరికా దేశాలు అనుపమాన ప్రగతి సాధించిన రంగాలలో ఉద్యోగాలు పొంది అభివృద్ధి చెందుతున్నారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. భవిష్యత్తులో ఉపాధి కల్పించే రంగాలలో ఇంగ్లీష్ కీలకం కానుంది. ఇప్పటికే ప్రైవేట్ రంగాల్లో ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం లేకుంటే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు.


గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన దళిత, పేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా గురుకులాలు ఏర్పడ్డాయి. సాంప్రదాయ పాఠశాలలకు భిన్నంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించడం భారతదేశ విద్యా చరిత్రలో సరికొత్త మార్పుగా భావించవచ్చు. అవి నేడు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ధ చూపి వెనుకబడిన తరగతుల వారికి గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. గురుకులాలు మెరుగైన ఫలితాలు సాధించడంతో వాటిలో విద్యను అభ్యసించడానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 910 గురుకుల విద్యాసంస్థలు మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తూ, ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన అందిస్తున్నాయి. అలాగే 53 డిగ్రీ కాలేజీలు ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన అందిస్తున్నాయి. ఇందులో 46 మహిళా డిగ్రీ కాలేజీలు ఉండడం ఒక ప్రత్యేకత. గురుకుల విద్యావ్యవస్థలో చదువుకున్న విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో తమ ప్రతిభాపాటవాలను అద్వితీయంగా చూపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీసుకున్న ‘మన ఊరు – మన బడి’ గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థుల విద్యా వికాసానికి ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ‘మన ఊరు –- మన బడి’ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాల పేద విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం ఆహ్వానించాలి. మద్దతు తెలపాలి. అన్ని విధాల సహకరించి దాన్ని సమున్నతంగా ముందుకు తీసుకెళ్లాలి.


ప్రొ. ఆర్.లింబాద్రి

(వ్యాసకర్త తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్)

Updated Date - 2022-01-26T06:47:14+05:30 IST