బీ.వెల్లెంల అంచనా వ్యయం రూ.678కోట్లు

ABN , First Publish Date - 2021-08-03T06:47:04+05:30 IST

మండలంలోని బీ.వెల్లెంల వద్ద నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ (డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు)పెంపును మంత్రి మండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చిన ఈ అంశంపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం సవరించిన డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

బీ.వెల్లెంల అంచనా వ్యయం రూ.678కోట్లు
ఉదయ సముద్రం రిజర్వాయర్‌ సిస్టర్న్‌ (ఫైల్‌ )

ప్రాజెక్టు సవరణ డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం

రూ.160కోట్ల మేర పెంపు 


నార్కట్‌పల్లి, ఆగస్టు 2: మండలంలోని బీ.వెల్లెంల వద్ద నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ (డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు)పెంపును మంత్రి మండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చిన ఈ అంశంపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం సవరించిన డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో బీ.వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.678 కోట్లకు పెరిగింది. అంటే అదనంగా రూ.160కోట్లను పెంచుతూ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నకిరేకల్‌, నల్లగొండ, రామన్నపేట, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు తొలుత రూ.699కోట్లుగా అంచనా వేసి పరిపాలనా అనుమతి ఇచ్చారు. రూ.547కోట్లకు సాంకేతిక అనుమతి ఇచ్చారు. ఐతే ప్రాజెక్టు డీపీఆర్‌లో భాగమైన గుడిపల్లి, శేషిలేరు, కనగల్‌ ఆఫ్‌లైన్‌ రిజర్వాయర్‌లను కొన్ని సర్వేల అనంతరం సాంకేతిక ఆర్థిక కారణాలతో తొలగించడంతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.518కోట్లకు కుదించారు. అప్పుడు జీఎస్టీ లేకపోవడం, ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం, ధరల పెరుగుదల తదితర కారణాలతో ప్రాజెక్టు డీపీఆర్‌ను సవరిస్తూ అధికారులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం రూ.160కోట్లు అదనంగా కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.678కోట్లకు చేరుకుంది.


ఎమ్మెల్యే చిరుమర్తి హర్షం

బీ.వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సవరించిన డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు నిధులను పెంచడంతో పాటు పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారన్నారు. అదేవిధంగా రూ.100కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపడంతో తన కృషి ఫలించిందన్నారు. డీపీఆర్‌ పెంపు, అయిటిపాముల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు కేబినెట్‌లో ఆమోదముద్ర వేసిన సీఎం కేసీఆర్‌కు, అందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-08-03T06:47:04+05:30 IST