Advertisement

డ్రాగన్‌ దుశ్చర్య

Dec 3 2020 @ 00:38AM

బ్రహ్మపుత్ర నదిమీద భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సంకల్పించడం ఆందోళనకరమైన పరిణామం. అరుణాచల్‌ ప్రదేశ్‌కు కూతవేటు దూరంలో, టిబెట్‌ అటానమస్‌ ప్రాంతంలో చైనా నిర్మించతలపెట్టిన ఈ ‘జాంగ్‌ మూ’ డ్యామ్‌ ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద జలవిద్యుత్‌ డ్యామ్‌గా ప్రఖ్యాతిగాంచిన ‘త్రీ గోర్జెస్‌’ కంటే మూడు రెట్లు పెద్దదని అంటున్నారు. ‘యార్లుంగ్‌ త్సాంగ్‌పో’ నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అక్టోబర్‌లోనే పనులు ఆరంభమైతే, మరికొద్దినెలల్లో పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేయబోతున్నదట. చైనా నిర్ణయం భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.


ఇకపై భారత్‌ బియ్యాన్ని కూడా దిగుమతి చేసుకోవాలని దాదాపు ముప్పయ్యేళ్ళ తరువాత చైనా నిర్ణయించడంతో ఇరుదేశాల మధ్యా కాస్తంత సయోధ్యకు దారులు తెరుచుకుంటున్నాయని ఇటీవల కొందరు సంతోషించారు. థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌, పాకిస్థాన్‌లనుంచి మాత్రమే బియ్యాన్ని కొనుగోలు చేస్తూ, మన బియ్యం నాణ్యతను మాత్రం ఆక్షేపిస్తూవచ్చిన చైనా ఎందుకో మనసు మార్చుకుంది. ఈ ఏడాది లక్ష


టన్నులు మాత్రమే ఎగుమతి చేసినా వచ్చే ఏడాదినుంచి మరింత పెరుగుతుందని భారత బియ్యం వ్యాపారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమితో భారత్‌ చైనా మధ్య ఉద్రిక్తతలు ఎంతోకొంతమేరకు సడలిపోతాయన్న ఆశలు సరేసరి. ఈ నేపథ్యంలో, బ్రహ్మపుత్రపై చైనా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. జలవిద్యుదుత్పత్తికి ఈ ప్రాంతంలో కనీసం మరో మూడు నదులు అనువుగా ఉన్నప్పటికీ, ఈశాన్య రాష్ట్రాల వరప్రదాయిని బ్రహ్మపుత్రనే ఎంచుకోవడం భారత్‌ను దెబ్బతీయడానికే. 60 గిగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుకు చైనా సంకల్పించినందుకు ప్రతిగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 10 గిగావాట్ల  నిర్మాణానికి తాను సిద్ధంగా ఉన్నట్టు భారత్‌ ప్రకటించింది. ఆచరణ మాట అటుంచితే, ఉన్న ఉద్రిక్తతలకు ఈ నదీవివాదాలు మరింత ఆజ్యం పోయడం ఖాయం.


చైనా ఇప్పటికే ఈ నదిమీద అనేక చిన్నాచితకా డ్యామ్‌లు కట్టింది. టిబెట్‌మీద ఆధిపత్యంతో చైనాకు దక్షిణాసియాలోని ఏడు ప్రధాన నదులను నియంత్రించేందుకు మరింత అవకాశం దక్కింది. భారత్‌–చైనా మధ్య నదీజలాల డేటాను పంచుకొనే ఒప్పందం ఉన్నప్పటికీ, మూడేళ్ళక్రితం డోక్లామ్‌ ఘటనతో అది నిలిచిపోయింది. ఎగువున ఉన్న కారణంగా నదీజలాలను ఇలా ఆయుధంగా వాడి భారత్‌ను బాధించేందుకు చైనాకు అవకాశం దక్కుతున్నది. చైనా నిర్ణయం కోట్లాదిమంది భారత పౌరుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నది. మరో ఐదేళ్ళలో ప్రపంచజనాభాలో సగంమంది నీరు కరువై సతమతమవుతారని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించింది. వీరిలో అత్యధికులు ఉన్నది చైనా, భారత్‌లోనే. ప్రపంచజనాభాలో 20శాతం ఉన్న చైనాకు ఏడుశాతం నీరు మాత్రమే అందుబాటులో ఉండగా, 17శాతం జనాభా ఉన్న భారత్‌కు నీటివనరులు నాలుగుశాతమే ఉన్నాయి. ఉభయదేశాలూ ఆర్థికంగా ఎదుగుతున్నకొద్దీ నీరు మరింత అవసరపడుతుంది. నీటివనరులపై ఒత్తిడి హెచ్చి, కత్తులు దూసుకొనే ఘట్టాలు మరింత పెరుగుతాయి. 


ఈ డ్యామ్‌ నిర్మాణం ప్రతిపాదన వెనుక నీరు, విద్యుదవసరాల కంటే రాజకీయ, సైనికపరమైన వ్యూహాలే పనిచేశాయన్నది నిర్వివాదాంశం. భారత్‌ను ఇరుకునపెట్టేందుకు, వీలైనంత నష్టపరచేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. భూటాన్‌, నేపాల్‌లోకి చైనా ఎంతగా చొచ్చుకుపోయిందో చూస్తూనే ఉన్నాం. భూటాన్‌లో అది ఏకంగా ఒక కొత్త గ్రామాన్నే సృష్టించింది. భారత్‌కు దూరంగా జరగని పక్షంలో భవిష్యత్తులో ఇటువంటి చొరబాట్లు అనేకం ఎదుర్కోవలసి వస్తుందన్న హెచ్చరిక ఈ చర్యలో ఉంది. నేపాల్‌ పాలకులతో ఏకంగా మ్యాపులే తిరగరాయిస్తున్నది. గతకాలపు వైఖరికి భిన్నంగా దూకుడు పెంచి భారత్‌నూ దాని ఇరుగుపొరుగుదేశాలనూ ఇరుకునపెట్టడం ఇప్పుడు చైనా లక్ష్యం. సాధ్యమైనంత వేగంగా దౌత్యపరంగానో, ఇతరత్రా మార్గాలలోనో చైనామీద ఒత్తిడి తెచ్చి ఈ భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టును ఉపసంహరించుకొనేట్టు చేయాలి. నీటిని అడ్డుకోవడం మాట అటుంచితే, క్లౌండ్‌ బరస్ట్‌, ఫ్లాష్‌ ఫ్లడ్స్‌, కొండచరియలు విరిగిపడటం వంటి పలు దుర్ఘటనలకు ఆలవాలమైన ఈ ప్రాంతంలో ఇంతటి భారీ డ్యామ్‌ నిర్మాణం అరుణాచల్‌కు ప్రమాదకరం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.