కొత్త స్ర్టెయిన్‌ కలకలం

ABN , First Publish Date - 2021-03-06T06:44:20+05:30 IST

కరోనా కొత్త స్ర్టెయిన్‌ ప్రజలను బెంబేలెత్తిస్తున్నది.

కొత్త స్ర్టెయిన్‌ కలకలం

- జగిత్యాల జిల్లాలో ఇద్దరు అనుమానితులు 

- ఇద్దరూ దుబాయ్‌ నుంచి వచ్చిన వారే

- మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు 

- ఉమ్మడి జిల్లాలో 50 మందికి వ్యాధి నిర్ధారణ 

- కరీంనగర్‌ పట్టణంలోనే 21 మందికి పాజిటివ్‌ 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా కొత్త స్ర్టెయిన్‌ ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. గత నెల 25న యూకే విమానంలో దుబాయ్‌ నుంచి వచ్చిన జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యాధిబారిన పడడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వారిద్దరికీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే హైదరాబాద్‌కు తరలించి కొత్త స్ర్టెయిన్‌ పరీక్షలు నిర్వహించారు. శనివారం ఆ ఫలితాలు రానున్నాయని తెలుస్తున్నవి. ఈలోగా వ్యాధిబారినపడ్డ ఒకరి కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌ రావడంతో వారిని హోంక్వారంటైన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త స్ర్టెయిన్‌ సోకిందా లేదా అని తేలిన తర్వాత వారిని తరలించే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. యూకే నుంచి  వచ్చిన విమానం దుబాయ్‌ మీదుగా ఇక్కడకు రావడంతో జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఆ విమానంలో ప్రయాణించారు. ఇప్పుడు వారు కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ కావడంతో వారికి యూకే స్ర్టెయిన్‌ కరోనా వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఈ స్ర్టెయిన్‌కు శీఘ్రంగా వ్యాప్తిచెందే లక్షణాలు ఉండడంతో ఎక్కువ మంది తక్కువ కాలంలో వ్యాధిబారినపడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో కూడా ఇలాగే విదేశాల నుంచి వచ్చిన వారు పాజిటివ్‌గా తేలిన సందర్భంలో కొత్త స్ట్రెయిన్‌ ఆందోళన వ్యక్తమైనా ఆ తర్వాత కాదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

ఉమ్మడి జిల్లాలో భయం భయం

కొత్త స్ట్రెయిన్‌ భయం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రజలను మరోసారి వణికిస్తున్నది. కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్‌ పట్టణంలో అత్యధిక కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహించిన పరీక్షల్లో 50 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్న వారిలోనే 50 మందికి వ్యాధి నిర్ధారణ కాగా ప్రైవేట్‌లో చికిత్స చేయించుకున్న వారిలో ఈ మేరకు మరో 50 మందికి వ్యాధి సోకే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం 24 మందికి వ్యాధి నిర్ధారణ కాగా అందులో 21 మంది కరీంనగర్‌ పట్టణానికి చెందిన వారే కావడం గమనార్హం. కరీంనగర్‌ పట్టణానికి ఆనుకొని ఉన్న చొప్పదండి, కొత్తపల్లి మండలాల్లో కూడా పాజిటివ్‌ కేసులు వచ్చా,యి. చొప్పదండిలో 31 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. జగిత్యాల జిల్లాలో 686 పరీక్షలు నిర్వహించగా 8 మందికి, పెద్దపల్లిజిల్లాలో 1,070 మందికి పరీక్షలు చేయగా 9 మందికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 693 మందికి పరీక్షలు చేయగా 9 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వారంరోజుల క్రితం కరీంనగర్‌ పట్టణంలో మినహా నాలుగు జిల్లాలో ఒకటి, రెండు కేసులు మాత్రమే నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య పది మేరకు పెరిగాయి. కరీంనగర్‌ పట్టణంలో గత 15 రోజులుగా ప్రతి రోజు 15 నుంచి 20 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే హెల్త్‌ బులిటెన్‌లో ఈ సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలల నుంచి అందిన పరీక్షలు, పాజిటివ్‌ కేసుల వివరాలకు బులిటెన్‌ వివరాలకు పొంతన ఉండడం లేదు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కరోనా కేసులు పరీక్షల వివరాలను వెల్లడించే విషయంలో జిల్లా అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తుండగా కరీంనగర్‌ జిల్లాలో మాత్రం పూర్తి గోప్యత పాటిస్తున్నారు. ఆది నుంచి ఈ జిల్లా యంత్రాంగం కరోనా వివరాల వెల్లడి విషయంలో ఇదే వైఖరి అవలంభిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి రోజురోజు వస్తున్న పాజిటివ్‌ కేసుల వాస్తవ వివరాలను అధికారికంగా వెల్లడిస్తే ప్రజలు అప్రమత్తమై జాగ్రత్తగా ఉండే అవకాశముంటుంది. ఆ వివరాలు ప్రజలకు తెలియక పోవడంతో కరోనా తగ్గిందన్న భావనతో కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ కారణంగానే కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని అనుకుంటున్నారు. కొవిడ్‌ టీకా తీసుకున్న వారి విషయాలను ఎప్పడికప్పుడు వెల్లడిస్తున్న మాదిరిగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా నిర్వహిస్తున్న కొవిడ్‌ పరీక్షల వివరాలను ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేయాలని, వారు ముందు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రచారం నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-03-06T06:44:20+05:30 IST