జగన్‌ పతనం ఖాయం

ABN , First Publish Date - 2022-06-28T04:38:25+05:30 IST

రాష్ట్రంలోని ముస్లిం సమాజాన్ని జగన్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని, మైనార్టీల ఉసురుతో వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

జగన్‌ పతనం ఖాయం
దీక్షలో మాట్లాడుతున్న ఎన్‌ఎండీ ఫరూక్‌

మైనార్టీలను నట్టేట ముంచిన ప్రభుత్వం  

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ 

ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష 


నంద్యాల టౌన్‌, జూన్‌ 27 : రాష్ట్రంలోని ముస్లిం సమాజాన్ని జగన్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని, మైనార్టీల ఉసురుతో వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. సోమవారం నంద్యాలలోని ఖలీల్‌ థియేటర్‌ ఆవరణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధన కమిటీ కన్వీనర్‌ ఎన్‌ఎండీ ఫిరోజ్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్ష  నిర్వహించారు. దీక్ష శిబిరాన్ని ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీ ల నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఆదర్శ ప్రాయంగా నిలిచాయని అన్నారు. దుల్హాన్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. విదేశీ విద్య, మౌజన్ల, ఇమామ్‌లకు గౌరవ వేతనం, మసీదులకు మరమ్మతులు ఇలా ఎన్నో హామీలను జగన్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. 


 దీక్షకు మద్దతు తెలిపిన పలువురు నాయకులు 


టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్‌ అహమ్మద్‌, ఆవాజ్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ మస్తాన్‌వలి, జమాతే ఇస్లామి హింద్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ సమద్‌, టీడీపీ తెలుగు మహిళా విభాగం సహాయ కార్యదర్శి జైనాబీతో పాటు పలువురు ముస్లిం ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.  సాయంత్రం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 

Updated Date - 2022-06-28T04:38:25+05:30 IST