కేంద్ర మంత్రి తీరుపై మాజీ పీఎం మన్మోహన్‌ కుటుంబం ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-16T01:02:54+05:30 IST

కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాన మంత్రి

కేంద్ర మంత్రి తీరుపై మాజీ పీఎం మన్మోహన్‌ కుటుంబం ఆగ్రహం

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న డాక్టర్ సింగ్‌తో మాండవీయ ఫొటోలు తీయించుకోవడాన్ని తప్పుబట్టారు. ఫొటోగ్రాఫర్‌ను అనుమతించవద్దని చెప్పినా పట్టించుకోలేదన్నారు. 


డాక్టర్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, తన తండ్రి, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని, ఆయనను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం వచ్చారని తెలిపారు. ఆయనతోపాటు ఫొటోగ్రాఫర్ ఉండటాన్ని గమనించిన తన తల్లి ఆ ఫొటోగ్రాఫర్‌ను అనుమతించవద్దని చెప్పారన్నారు. కానీ ఆమె మాటలను పట్టించుకోకుండా తన తండ్రితో కలిసి మాండవీయకు ఫొటోలు తీశారన్నారు. 


తన తండ్రి డెంగ్యూతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో తాము సందర్శకులను కట్టడి చేశామన్నారు. తన తండ్రిని పరామర్శించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రావడం మంచిదేనన్నారు. కానీ ఆ సమయంలో ఫొటోలు దిగే పరిస్థితిలో తన తల్లిదండ్రులు లేరన్నారు. ఫొటోగ్రాఫర్‌ను గది నుంచి పంపించేయాలని తన తల్లి పట్టుబట్టినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. ఆమె చాలా బాధపడ్డారన్నారు. సంక్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తన తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారన్నారు. 


ఇదిలావుండగా, మన్మోహన్ సింగ్‌తో తాను తీయించుకున్న ఫొటోలను మన్‌సుఖ్ మాండవీయ గురువారం ట్వీట్ చేశారు. అయితే నెటిజన్లు విమర్శించడంతో వాటిని ఆయన తన ట్విటర్ ఖాతా నుంచి తొలగించారు. 


Updated Date - 2021-10-16T01:02:54+05:30 IST