పోరాటయోధురాలు పొణకా కనకమ్మ

ABN , First Publish Date - 2022-09-15T10:23:05+05:30 IST

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వం ధారబోశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ...

పోరాటయోధురాలు పొణకా కనకమ్మ

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వం ధారబోశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ. 1882 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, రావమ్మలకు జన్మించిన కనకమ్మకు తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. సంఘ సేవ కోసం ఇల్లు విడిచి కనకమ్మ ఉద్యమబాటన నడిచారు.. పోట్లపూడి గ్రామానికి ప్రముఖులు ఎవరు వచ్చినా అప్పట్లో కనకమ్మ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళేవారు. 1907లో వందేమాతరం ఉద్యమ సందర్భంగా ఆంధ్రదేశానికి వచ్చిన మహావక‍్త బిపిన్ చంద్రపాల్ ఒక దినమంతా పోట్లపూడిలోనే గడిపారు.


1913లో పోట్లపూడిలో సుజన రంజనీ సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం జాతీయ పాఠశాల ఏర్పాటునకు పొణకా కనకమ్మే కారణం. అప్పుడే గ్రామాలలో ఆరోగ్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 1917లో ఐదవ ఆంధ్రసభ జూన్ మొదటి వారంలో నెల్లూరులో జరిగింది. అదే రోజు మహిళల సభ కూడా జరిగింది. మహిళలను రాజకీయాల్లోకి ఆకర్షించాలని తీర్మానం చేశారు. ఈ సభలో కనకమ్మ మాట్లాడారు. అదే సమయంలో ప్రారంభమైన అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమానికి జిల్లాలో పోట్లపూడి గ్రామమే కేంద్రమైంది. కనకమ్మ స్వయంగా చరఖా చేపట్టారు. స్వదేశీ చేనేత కేంద్రం ఏర్పాటైంది. తను స్వయంగా నేసిన ఖద్దరు పంచెను మహాత్మాగాంధీకి కనకమ్మ కానుకగా పంపారు.


పల్లెపాడులో సత్యాగ్రహ ఆశ్రమాన్ని 1921 ఫిబ్రవరి 7న మహాత్మాగాంధీతో ప్రారంభింప జేశారు. ఈ ఆశ్రమం కోసం కనకమ్మ తన ఒంటిపైనున్న బంగారు నగలు అమ్మి విరాళంగా ఇచ్చారు. ఆనాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆమె బంగారు నగలు ధరించలేదు. పల్లెపాడు పెన్నానది ఒడ్డున గాంధీ ఆశ్రమం కోసం 18 ఎకరాలు కొని స్వరాజ్యం సంపాదించాలనే ధ్యేయంతో చతుర్వేదుల కృష్ణయ్యకు ఉచితంగా ఇచ్చింది కనకమ్మ. 1922 ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్‌లో తొలి సత్యాగ్రహి దేశబంధు దువ్వూరి సుబ్బమ్మ మొదటిసారి అరెస్టయ్యారు. ఈ సంఘటన కనకమ్మను కదిలించింది. 1930లో పల్లెపాడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో కనకమ్మ ప్రముఖ పాత్ర వహించారు. ఆమె నాయకత్వంలో మైపాడుకు భారీ స్థాయిలో మహిళలు తరలి వెళ్ళారు.


1930 జూలై 1న కనకమ్మ అరెస్టయి నెల్లూరు, వేలూరులలో జైలుశిక్ష అనుభవించారు. జైలు జీవితంలో భారతం, పురాణాలను సహచర ఖైదీలకు చదివి వినిపించేవారామె. ఈ కేసులో ఆమెకు 18 నెలల జైలుశిక్ష పడింది. అనారోగ్యం కారణంగా 1933 జూన్ 30న ఆమెను జైలునుంచి విడుదల చేశారు. 1917 నుంచే పొణకా కనకమ్మ ఎన్నో సాహిత్య రచనలు చేశారు. వ్యాసాలు, కవితలు రచించారు. ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన గృహలక్ష్మి స్వర్ణకంకణం లభించింది.


1923లో బాలికా విద్య కోసం కస్తూరిబా బాలికా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు కనకమ్మ. ఆ పాఠశాలలో వృత్తి విద్య కూడా ఏర్పాటు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వీరవనిత పొణకా కనకమ్మ 1963 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. మహిళా జాతికి వెలుగుచుక్కయిన కనకమ్మ స్మృతికి నెల్లూరు నగరంలో కనీసం శిలావిగ్రహం ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. కనకమ్మ జీవితకథను పాఠ్యాంశంగా చేర్చి మహిళా స్ఫూర్తికి ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడే ఆమెకు సరైన నివాళి అవుతుంది.

ఈతకోట సుబ్బారావు

(నేడు కనకమ్మ వర్ధంతి)

Updated Date - 2022-09-15T10:23:05+05:30 IST