‘గిరిదర్శిని’కి తుదిరూపు

ABN , First Publish Date - 2021-07-22T04:34:29+05:30 IST

కరోనా వైరస్‌ ఉదృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో విద్యా సంస్థలు మూసివేయడంతో చదువులకు దూరమైన భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంచేందుకు గిరిజన సంక్షేమశాఖ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది

‘గిరిదర్శిని’కి తుదిరూపు

  20బీసీఎం5ః గిరి దర్శిని అభ్యసన పుస్తకం

ముద్రణ దశలో కనీస సామర్థ్యాల అభ్యసన పుస్తకం

గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ చొరవతో అందుబాటులోకి

ఆగస్టులో 21,400 మంది విద్యార్థులకు అందజేసేలా చర్యలు

భద్రాచలం, జూలై 21: కరోనా వైరస్‌ ఉదృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో విద్యా సంస్థలు మూసివేయడంతో చదువులకు దూరమైన భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంచేందుకు గిరిజన సంక్షేమశాఖ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు రాష్ట్రంలో మూడు నుంచి ఏడో తరగతి వరకు కనీస సామర్థ్యాల అభ్యసన పుస్తకం రూపొందించారు. 8వ తరగతికి ఖమ్మం, 9వ తరగతికి ఉట్నూరు, 10వ తరగతికి భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 14మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి గిరిదర్శిని కనీస సామర్థ్యాల అభ్యసన పుస్తకం రూపుదిద్దుకుంది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని నిష్ణాతులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రూపొందిన ఈ పుస్తకాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టియానా జెడ్‌ చాంగ్త్తోకు పంపారు. దాన్ని కమిషనర్‌ ఆమోదించడంతో పుస్తక ముద్రణ చేపడుతున్నారు. కాగా పలు తరగతులకు చెందిన సాఫ్ట్‌ కాపీల్లో మరికొన్ని మార్పులు చేసి కమిషనర్‌ తాజాగా భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు పంపారు. ఈ పుస్తకాన్ని ఆగస్టులో విద్యార్థులకు అందజేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. 

ప్రత్యేక కిట్‌ అందజేతకు నిర్ణయం

కనీస సామర్థ్యాల అభ్యసన పుస్తక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంచడమే. అందులో భాగంగా వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు వారి సబ్జెక్టుల్లో కనీస అవగాహన పెంచేందుకు ప్రాథమికంగా బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు గిరిదర్శిని అభ్యాసికతో పాటు వర్కుషీట్లను కూడా అందించనున్నారు. నాలుగు పెన్నులు, మూడు పెన్సిళ్లు, రెండు రబ్బర్లు, ఎరేజర్‌, షార్ప్‌నర్‌, స్కేలు, కలర్‌ పెన్సిల్స్‌, క్రేయన్స ప్యాకెట్లు, జిగురు బాటిల్‌లను అందించనున్నారు. ఈ కిట్‌ను సంబంధిత విద్యార్థికి పోస్టల్‌ శాఖ సహకారంతో పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థి తాను చదివిన అనంతరం వర్క్‌షీట్లను నింపి వాటిని తాను చదువుతున్న ఆశ్రమ పాఠశాలకు పంపేలా ముందుగానే ఒక పోస్టల్‌ కవర్‌ను అడ్రస్‌తో ముద్రించి(విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా)వారికి అందజేయనున్నారు.   

20మంది విద్యార్థులకు ఒక దత్తత ఉపాధ్యాయుడు 

గరిష్టంగా 16నుంచి 20మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు దత్తత తీసుకోనున్నారు. ‘గిరిదర్శిని’ అభ్యసించే సమయంలో విద్యార్థికి ఏమైనా సందేహాలు వస్తే ఆ దత్తత ఉపాధ్యాయుడు నివృత్తి చేయనున్నాడు. ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థుల పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో మూడు నుంచి ఏడో తరగతి వరకు చదువుతున్న పదివేల మంది విద్యార్థులు, 8వ తరగతి చదువుతున్న 3,400మంది, 9, 10తరగతి చదువుతున్న నాలుగువేల మంది విద్యార్థుల సామర్థ్యాలను దత్తత ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరైనా నిర్దేశించిన సామర్థ్యం కంటే తక్కువగా ఉంటే వారిపై మరింత దృష్టిసారించేందుకు దత్తత ఉపాధ్యాయులు విద్యార్థుల గ్రామాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. దత్తత ఉపాధ్యాయుల పనితీరును గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు రమాదేవితో పాటు ఇతర అధికారులు పర్యవేక్షించనున్నారు. 

ఆగస్టు నుంచి ప్రక్రియ ప్రారంభం

రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు

మారిన షెడ్యుల్‌ ప్రకారం ఆగస్టులో గిరిదర్శిని అభ్యాసిక ప్రారంభమవుతుంది. ఆగస్టు ఆరంభం నుంచి పుస్తకాలు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 15రోజులకోసారి దత్తత ఉపాధ్యాయులు తమకు కేటాయించిన విద్యార్థుల గ్రామాలకు వెళ్లి వారు ఏ విధంగా ‘గిరిదర్శిని’ని అభ్యసిస్తున్నారో పరిశీలించాలి. వర్క్‌షీటును పూర్తిస్థాయిలో రాయగలిగే స్థాయికి వచ్చారా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులకు పాఠశాలలకు రాలేకపోయామనే భావన తప్ప చదువు యథావిధిగా సాగుతుంది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఎంతో ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 

Updated Date - 2021-07-22T04:34:29+05:30 IST