‘చంద్రుణ్ణి’ చూపించే వేలు

ABN , First Publish Date - 2021-04-08T05:52:06+05:30 IST

ఇటీవల ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చొప్పదండి మాజీ శాసన సభ్యురాలు...

‘చంద్రుణ్ణి’ చూపించే వేలు

ఇటీవల ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చొప్పదండి మాజీ శాసన సభ్యురాలు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సహచర నాయకులను తీవ్రంగా విమర్శించారు. ఆమె విమర్శించిన తీరు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం, దాన్ని వేలమంది చూడడం లేక వినడం జరిగింది. వారిలో చాలామందికి సదరు మాజీ శాసనసభ్యురాలి తీరు ఆవేదనతో పాటు ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు పయనిస్తోందో అనే ఆందోళన కలిగించిందనడం నిస్సందేహం.


రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ భావప్రకటనా స్వాతంత్ర్యాన్ని అందజేసింది. పౌరులందరూ ఆ స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. అయితే అత్యంత జుగుప్సాకరంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు మాత్రం ఏ ఒక్క వ్యక్తికీ ఉండదు. ఈ విషయమై ఏ రాజకీయ పార్టీ నాయకులైనా, సామాన్య కార్యకర్తలయినా తప్పనిసరిగా ఆలోచించి, హద్దుమీరకుండా వ్యవహరించాలి. ఆ మాజీ శాసన సభ్యురాలు వాడిన పదజాలం, ఆ విమర్శా ధోరణి ఎవరికైనా మింగుడుపడే విషయంకాదు.


రాజ్యాంగం ఎంత వాక్ స్వాతంత్ర్యం కల్పించినా ఇతరుల వ్యక్తిత్వాలకు, ప్రతిష్ఠలకు భంగం కలగకుండా ఉపయోగించినప్పుడే ఆ హక్కుకు నిజమైన అర్థం ఉంటుంది. అది గుర్తించకుండా వాక్ స్వాతంత్ర్యం ఉందికదా అని తమకు అయిష్టులైన వారిపై ఇష్టారీతిగా, నోటికి ఎంత వస్తే అంతగా ఉచితానుచితాలను మరచి మాట్లాడడం సబబుకాదు. అది, చొప్పదండి నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి పనిచేసిన నాయకురాలికి ఎంత మాత్రం సబబు అనిపించుకోదు. ఆమె ప్రసంగంలో అక్కసు తప్ప ఏమాత్రం సద్విమర్శ కనిపించదు. అటువంటి అవాకులు చెవాకులు పేలడం వల్ల ఆయా వ్యక్తులు రాజకీయంగా అపఖ్యాతిని మూటగట్టుకోవడం తప్ప అంతగా బావుకునేదేమీ ఉండదు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నాయకుడు ఉద్యమ అవసరాల రీత్యా అక్కడక్కడ, అప్పుడప్పుడు తెలంగాణ ప్రజలను ఉత్తేజితుల్ని చేయడానికి కొన్ని పదునైన సానపట్టిన మాటల తూటాలను వాడిన మాట నిజమే. అయితే నాటి రాష్ట్ర పాలకులను గానీ, అధికార పార్టీ నాయకులను గానీ ఇంత దారుణంగా అగౌరవపరిచే పనికి మాత్రం పూనుకోలేదు. ప్రజాస్వామిక భావనలలో ఒప్పని భాషను కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాడలేదు. ప్రతి పదాన్ని ప్రతి ఉపన్యాసాన్ని ఆచితూచి జనం మూడ్‌ను గమనించి, గుర్తెరిగి సమయానుకూలంగా సమరశీలంగా ప్రయోగించే వారు, మాట్లాడేవారు. ఇలా అడ్డగోలుగా నోరు పారేసుకోవడం ఏనాడూ చేయలేదు.


పార్లమెంటరీ విధానంలో ఏ పాలక పార్టీపైన అయినా ప్రతిపక్ష నాయకులు తమ అసంతృప్తిని వెళ్లగక్కడానికి, పాలకవర్గపు విపరీత పోకడలపై ఉపన్యాసాల ద్వారా, ఇతరేతర మాధ్యమాల ద్వారా నిర్దిష్టంగా విమర్శించడానికి హక్కు కలిగి ఉంటారు. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఖండన మండనలన్నీ రాజ్యాంగ పరిధిలోని లక్ష్మణ రేఖకు లోబడే చేయాలి. లేకుంటే ప్రజలు ఏవగించుకునే పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. 75ఏళ్ల స్వతంత్ర భారతదేశపు పార్లమెంటరీ విధానాలలో, గతంలో, ఆయా రాజకీయ పార్టీలు, వాటి నాయకులు అనుసరించిన ఒరవడిని, విలక్షణతను, వినమ్రతను శిరోధార్యంగా స్వీకరించాలి తప్ప ప్రజాక్షేత్రంలో ఎంత మాత్రం సంయమనాన్ని, సహనాన్ని కోల్పోకూడదు. దానివల్ల ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలంలో తీరని హాని జరిగి తీరుతుంది. ‘ఉరికురికి పశువులను కాస్తే పొద్దూకది’ అనేది జనసామాన్యంలో బాగా ప్రాచుర్యం కలిగిన సామెత. రాజకీయ పార్టీలు, నేతలు ఎన్ని మాట్లాడినా, పాలకుల కాలపరిమితి తీరే వరకు, లేదా తదుపరి ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అంతవరకు తమ తమ శ్రేణులను, అనుయాయులను ఎంతో సమర్థంగా ఉన్మీలురను చేయాలి. అంతేగానీ అసహనానికి గురై వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఆయా రాజకీయ పార్టీలకే తీరని నష్టం కష్టం కలుగుతుంది. ఒకవేళ నాయకులు ఆవేశకావేషాలు ప్రదర్శిస్తే ప్రజలలో అవహేళనకు గురై మరింత దిగజారి పోతారు. సదరు మాజీ శాసన సభ్యురాలు ఇటీవల చేసిన ప్రసంగం పాఠం సామాజిక మాధ్యమాల్లో షికారు చేసినప్పుడు నాకు ఎందుకో ఒక సామెత గుర్తుకు వచ్చింది. ‘సుతిమెత్తని వెన్నెలను కురిపిస్తున్న చంద్రుని వంక వేలెత్తి విజ్ఞులు చూపిస్తే అజ్ఞానులు మూర్ఖంగా చంద్రున్ని చూడక వేలు వంక చూస్తారు’ అనేది ప్రపంచ ప్రసిద్ధ సామెత. రాజకీయాలలో ఉద్రేక ఉపన్యాస క్రీడలు కొన్నిసార్లు మాత్రమే ఉత్ప్రేరకంగా పని చేస్తాయి, ఎక్కువసార్లు బెడిసి కొడతాయి. ఇది ప్రజాస్వామ్య చరిత్ర చెప్పిన పాఠం, గుణపాఠం కూడా. దీని నుంచే ప్రతినాయకుడు స్ఫూర్తి పొంది తనను తాను మలుచుకుని తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే ప్రజలు వారి మాటల సుగంధాల సౌరభాలను ఆఘ్రాణిస్తారు. ఎంతో కొంత వివేచిస్తారు, వివేకాన్ని ప్రదర్శిస్తారు.


కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోరికలు సహజంగా ఎక్కువగా ఉంటాయి కానీ, ఎన్నికైన ప్రతి ప్రభుత్వానికి వనరులు, పరిధులు, పరిమితులు ఉంటాయి. విధి విధానాలలో, వాటి ఆచరణలో ఆలోచనలు తనవైనవి ఉంటాయి. ఆ మేరకు తమదైన ముద్రతో ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తాయి. ఇకపోతే ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సందర్భానుసారంగా కార్యక్రమాలను రూపొందిస్తూ పౌరులను కర్తవ్యోన్ముఖుల్ని, కార్యశూరులను చేయాలి. వేగిర పడకుండా వేచి చూడాలి. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను రచించుకోవాలి అంతేగాని అనాలోచిత వ్యాఖ్యానాలు, వ్యాఖ్యలు చేస్తే అవి అనర్థాలకు దారితీసి ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలలో పౌర సమాజంలో వైముఖ్యతను కలుగజేస్తాయి. ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఇలా ‘తూ కిత్తా అంటే మై కిత్తా’ అనుకుంటూ పోతే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య పునాదులు మరింత బలహీనపడతాయి. అందువల్ల రాజకీయ పార్టీలు, వాటి అధినాయకులు, వారి తైనాతీలు ఈ విషయంలో లోతుగా, విశ్లేషణాత్మకంగా యోచన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. ఇప్పుడు ఆ అవసరం మరింత పెరిగింది.

జూకంటి జగన్నాథం

కవి, రచయిత

Updated Date - 2021-04-08T05:52:06+05:30 IST