నైజాంలో తొలి పౌర గ్రంథాలయం

ABN , First Publish Date - 2022-06-22T10:31:18+05:30 IST

అంబేడ్కర్‌ భావజాలం బలపడి, విస్తృతమవుతున్న ప్రస్తుత తరుణంలో చదువు అనేది చైతన్యానికి పునాది అనే విషయం దాదాపు అందరికీ అవగాహనలోకి వచ్చింది...

నైజాంలో తొలి పౌర గ్రంథాలయం

అంబేడ్కర్‌ భావజాలం బలపడి, విస్తృతమవుతున్న ప్రస్తుత తరుణంలో చదువు అనేది చైతన్యానికి పునాది అనే విషయం దాదాపు అందరికీ అవగాహనలోకి వచ్చింది. అయితే అక్షరాస్యత శాతం మూడ్నాలుగుకు కూడా మించని కాలంలో తెలంగాణలో పాఠశాలలు, ప్రజా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి సమాజాభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందువరుసలో నిలబెట్టాల్సిన వ్యక్తి, నిత్య స్మరణీయుడు పి. సోమసుందరం మొదలియార్‌. ఈయన పేరిటే 1872లో సికింద్రాబాద్‌లో సోమసుందరం మొదలియార్‌ ప్రజా గ్రంథాలయం ఏర్పాటయింది. ఈ గ్రంథాలయం అటు తర్వాత హైదరాబాద్‌ రాజ్యంలో నడిచిన చాలా ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. మొత్తం హైదరాబాద్‌ రాజ్యంలో ఇది తొలి పౌర గ్రంథాలయం. ఈ లైబ్రరీ ఏర్పాటై 150 సంవత్సరాలైన సందర్భంగా దాని గురించి తెలుసుకుందాం.


1808లో సికింద్రాబాద్‌ నగరం కొత్తగా నిర్మితమయింది. ఈ నగరంలో బ్రిటీష్‌ మిలిటరీ వారి ఆజమాయిషీ ఎక్కువగా ఉండేది. వ్యాపారం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యాపారస్థులు తమ సంస్థలను ఇక్కడ స్థాపించుకున్నారు. మిలిటరీతో పాటు రైల్వేల్లో కూడా ఉద్యోగాలు చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యక్తులు సికింద్రాబాద్‌ని తమ ఆవాసంగా చేసుకున్నారు. ఇక్కడి కోర్టుల్లో వాదనలు ఇంగ్లీషులో (మొత్తం హైదరాబాద్‌ రాజ్యంలో కోర్టు వాదనలు ఉర్దూ భాషలో జరిగేవి) ఉండేవి. దీంతో మహారాష్ట్రతో పాటు తమిళనాడుకు చెందిన పేరుమోసిన అడ్వకేట్లు ఇక్కడ ప్రాక్టీసు చేసేవారు. రైల్వే ఉద్యోగాల్లో కూడా ఎక్కువగా తమిళులు ఉండేవారు. దీంతో సికింద్రాబాద్‌ ప్రాంతంలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వితరణా అలాగే ఉండేది.


ఇట్లా సికింద్రాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి చెందిన పి.సోమసుందరం మొదలియార్‌ విద్యారంగంలో దేశీయుల అభ్యున్నతి కోసం 1862లో ఆంగ్లో–వెర్నాక్యులర్‌ పాఠశాలను ఏర్పాటు చేసిండు. ఈ పాఠశాలలో ఇంగ్లీషు, ఉర్దూ, తమిళం, తెలుగు అధ్యాపకులు కూడా ఉండేవారు. తన సొంత ఆదాయ వనరులతో ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థ సికింద్రాబాద్‌లో దేశీయులు స్థాపించిన తొలి ప్రభుత్వ రికగ్నయిజ్‌డ్‌ పాఠశాల.


ఆరో నిజామ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ తన 18వ యేట 1884లో పూర్తిస్థాయిలో సంస్థాన బాధ్యతలు స్వీకరించాడు. మహబూబ్‌ అలీఖాన్‌ రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భానికి గుర్తుగా పాఠశాల పేరును ‘మహబూబ్‌ కాలేజ్‌ హై స్కూల్‌’గా మార్చిండ్రు. ఇదే పాఠశాల ఆవరణలో 1893 ఫిబ్రవరి 13నాడు స్వామి వివేకానంద షికాగోలోని అంతర్జాతీయ మతాల సమ్మేళనానికి వెళ్ళేముందు పాల్గొని ఉపన్యసించాడు.


1872లో సోమసుందరం మొదలియార్‌ స్మారకార్థం ఒక సభను నిర్వహించి ‘సోమసుందరం మొదలియార్‌ ప్రజా గ్రంథాలయం’ని ఏర్పాటు చేసిండ్రు. ఈ సభకు పి.రామచంద్ర పిళ్ళై అధ్యక్షత వహించారు. బహుశా 1872లోనే మొదలియార్‌ చనిపోవడంతో ఆయన జ్ఞాపకంగా వెంటనే ఈ సభ జరిగి ఉంటుంది. సోమసుందరం మొదలియార్‌ సికింద్రాబాద్‌ కేంద్రంగా నిజాం ప్రభుత్వానికి పోస్టల్‌ సేవలు అందించే ‘డాక్‌ కాంట్రాక్టర్‌’గా ఉండేవాడు. ఉత్తరాల బట్వాడాకు ఆయన కాంట్రాక్టర్‌. ఈయన దగ్గర తొలి దళిత హోటల్‌ నిర్మాత నాగులు కొన్ని రోజులు పనిచేసిండు. ఈ విషయాన్ని ‘లైఫ్‌ ఆఫ్‌ ఎం. నాగ్లు’ అనే జీవిత చరిత్రలో తన తండ్రి గురించి ఎం.ఎన్‌. వెంకటస్వామి 1908లోనే రాసిండు.


ఈ గ్రంథాలయానికి ప్రతి యేటా పుస్తకాలు కొనుగోలు చేయడమే గాకుండా, విదేశీ పత్రికలు సబ్‌స్క్రయిబ్‌ చేసేవారు. అంతేగాదు నిజాం కాలేజి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అఘోరనాథ్‌ చటోపాధ్యాయ తనకు వచ్చే పత్రికలను లైబ్రరీకి విరాళంగా ఇచ్చేవాడు. అఘోరనాథ్‌ చటోపాధ్యాయ విదేశాల్లో డాక్టరేట్‌ చేసిన తొలి ఇండియన్‌. సరోజినీ నాయుడు తండ్రి. ఆయన ఈ లైబ్రరీ నిర్వహణలో చురుగ్గా పాల్గొనేవాడు. 1883లో చాందా రైల్వే స్కీమ్‌కు వ్యతిరేకంగా, నిజాం ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్టు ముల్లా అబ్దుల్‌ ఖయూమ్‌తో కలిసి ఉద్యమాలు నిర్వహించాడు. ఇందుకు గాను ఆయన ‘నగర బహిష్కరణ’ శిక్ష కూడా అనుభవించాల్సివచ్చింది. ఈ గ్రంథాలయానికి తొలి అధ్యక్షుడిగా పనిచేసిన న్యాయవాది రామచంద్ర పిళ్ళై సికింద్రాబాద్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావ సభలను 1885 డిసెంబర్‌లోనూ, ఆ తర్వాత కూడా నిర్వహించాడు. ఈయన ఆ కాలంలో సికింద్రాబాద్‌ కేంద్రంగా జరిగిన ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడంటే అతిశయోక్తి కాదు.


సోమసుందరం స్థాపించి, భవనాన్ని సమకూర్చిన ఆంగ్లో వర్నాక్యులర్‌ పాఠశాల ఆవరణలోనే ఈ లైబ్రరీని ఏర్పాటు చేసిండ్రు. గ్రంథాలయ భవనంలోకి రావడానికి అందరికీ అనుమతి ఉండేది. అయితే దాని నిర్వహణకు అయ్యే ఖర్చు భరించేందుకు మూడు రకాల చందదారులు ఉండేవారు. మొదటి రకం వారు ప్రతి నెలా రెండు రూపాయలు, రెండో తరగతి వారు ప్రతి నెలా ఒక రూపాయి, చివరి వారు నెలకు ఎనిమిది అణాలు చందా రుసుము చెల్లించేవారు. పాఠశాల వారు కూడా ఈ గ్రంథాలయం సేవలు వినియోగించుకున్నందుకు నెలకు 15 రూపాయలు అద్దె రూపంలో చెల్లించేవారు. ఇట్లా వసూలైన సొమ్ముతో గ్రంథలాయానికి ఫర్నిచర్‌, పుస్తకాలు, పత్రికలు కొనేవారు. ఈ గ్రంథాలయ నిర్వహణలో పి.రామచంద్ర పిళ్లై, ఎం. నాగరత్నం పిళ్ళై, కుప్పుసామయ్య, వరదరాజ మొదలియార్‌, పి.ఎస్‌. షణ్ముగం మొదలియార్‌, సి.వి.పాండురంగం మొదలియార్‌ తదితరులు ఉండేవారు.


పాండురంగం మొదలియార్‌ తనయుడు దివాన్‌ బహదూర్‌ పద్మారావు మొదలియార్‌ 1881లో మిత్రులు వేణుగోపాల్‌ పిళ్ళై తదితరులతో కలిసి సికింద్రాబాద్‌లో వివిధ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసిండు. వీటికి అప్పటి బ్రిటీష్‌ అధికారి బ్రిగేడియర్‌ టెరెన్స్‌ హంఫ్రీ కీస్‌ భారీగా నిధులు కేటాయించడంతో పాఠశాల పేరును ‘కీస్‌’ హైస్కూల్‌గా మార్చిండ్రు. అంటే సికింద్రబాద్‌లో తమిళులు విద్యా, గ్రంథాలయ రంగాల్లో చేసిన కృషికి ఇప్పటికీ నిలిచి ఉన్న నిదర్శనాలివి. తమిళులకే కాదు తెలుగువారికీ మహబూబ్‌ కాలేజితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కళాశాలకు 1899–1904 మధ్య కాలంలో బ్రహ్మసమాజ ప్రచారకులు, సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. సికింద్రాబాద్‌లో 1930వ దశకంలో గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొనడమే గాకుండా ‘దక్కన్‌ కేసరి’ పత్రిక సంపాదకులు అడుసుమిల్లి వెంకట దత్తాత్రేయ శర్మ అధ్యాపకులుగా పనిచేశారు. నావికా దళ చీఫ్‌గా పనిచేసిన అడ్మిరల్‌ కటారి రాందాస్‌, పద్మారావు మొదలియార్‌, క్రికెటర్‌ జైసింహా తదితరులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు.


ఇంత ఘనమైన చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయాన్ని పునరుద్ధరించి 150 ఏండ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లయితే మరోసారి ఆనాటి స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఈ పనిని విద్యాశాఖ, గ్రంథాలయ శాఖ సంయుక్తగా చేయాల్సిన అవసరమున్నది.

సంగిశెట్టి శ్రీనివాస్‌

Updated Date - 2022-06-22T10:31:18+05:30 IST