తొలిరోజు ప్రశాంతంగా..

ABN , First Publish Date - 2022-05-24T07:00:23+05:30 IST

జిల్లావ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు తొలిరోజైన సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 153 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షలు సజావుగా సాగాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించిన ఫస్ట్‌ లాంగ్వేజీ పరీక్షకు మొత్తం 22424 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 22151 మంది పరీక్షకు హాజరయ్యారు. 273మంది విద్యార్థులు పరిక్షకు గైర్హాజరయ్యారు.

తొలిరోజు ప్రశాంతంగా..
మానిక్‌భవన్‌ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు 

నిజామాబాద్‌ అర్బన్‌ మే 23: జిల్లావ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు తొలిరోజైన సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 153 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షలు సజావుగా సాగాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించిన ఫస్ట్‌ లాంగ్వేజీ పరీక్షకు మొత్తం 22424 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 22151 మంది పరీక్షకు హాజరయ్యారు. 273మంది విద్యార్థులు పరిక్షకు గైర్హాజరయ్యారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా ఎలాంటి మాస్‌కాపీయింగ్‌ కేసు నమోదు కాలేదు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు గంటముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో.. ఆయా సెంటర్ల వద్ద ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది.    అలాగే, నగరానికి చెందిన స్టాలిన్‌ అనే విద్యార్థి యాక్సిడెంట్‌ అయినప్పటికీ.. తలకు కట్లుకట్టుకుని బంధువుల సహాయంతో సెంటర్‌కు వచ్చి పరీక్ష రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయం కాగా.. చికిత్స పొందుతున్నప్పటికీ పరిక్షలు కీలకం కావడంతో సంరక్షకుల సహాయంతో నగరంలోని హరిచరణ్‌ మార్వాడి స్కూల్‌కి వచ్చి పరీక్ష రాశాడు.

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకేంద్రంలోని మానిక్‌భవన్‌ పాఠశాలతో పాటు కాకతీయ హైస్కూల్‌ని సందర్శించి.. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలు తెరిచారా!? లేదా!? అన్నది సీసీ కెమెరా ఫుటేజీల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. అలాగే, జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో దుర్గాప్రసాద్‌ తనిఖీ చేశారు. 

Updated Date - 2022-05-24T07:00:23+05:30 IST