తొలి దీర్ఘకవితా కావ్యం ‘తెలంగాణ’ కాదు

ABN , First Publish Date - 2022-05-23T05:52:42+05:30 IST

దీర్ఘ కవితల మీద పరిశోధన చేసిన డా.పెళ్ళూరి సునీల్‌ దీర్ఘ కవితల ఆవిర్భావ వికాసాలను తెలియజేస్తూ ‘‘1956లో కుందుర్తి రచించిన ‘తెలంగాణ’ మొట్టమొదటి దీర్ఘ కవిత’’ అని తన ‘దీర్ఘకవితా వికాసం’ సిద్ధాంతగ్రంథంలో పేర్కొన్నారు..

తొలి దీర్ఘకవితా కావ్యం ‘తెలంగాణ’ కాదు

దీర్ఘ కవితల మీద పరిశోధన చేసిన డా.పెళ్ళూరి సునీల్‌ దీర్ఘ కవితల ఆవిర్భావ వికాసాలను తెలియజేస్తూ ‘‘1956లో కుందుర్తి రచించిన ‘తెలంగాణ’ మొట్టమొదటి దీర్ఘ కవిత’’ అని తన ‘దీర్ఘకవితా వికాసం’ సిద్ధాంతగ్రంథంలో పేర్కొన్నారు. ఆ గ్రంథానికి ముందుమాటలు రాసినవారు కూడా కుందుర్తి వచనకవితా కావ్యమే తొలి దీర్ఘ కవితా కావ్యం అంటూ తీర్మానిం చారు. అయితే తెలుగులో వచ్చిన తొలి వచన దీర్ఘకవితా కావ్యం ఖమ్మంజిల్లాకు చెందిన ‘కవిరాజ మూర్తి’ అని పిలవబడే సర్వదేవ భట్ల నరసింహమూర్తి రచించిన ‘మహైక’ అని గుర్తెరగపోవడం ముమ్మాటికి సాహిత్య చరిత్రకారుల తప్పిదమే! మహైక 1951-52 ప్రాంతాలలో రాయబడి సెప్టెంబరు 1953లో నయాగరా కవులైన బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణగార్ల ముందుమాటతో ప్రచురణ చేయబడింది. కుందుర్తి ఆంజనేయులుగారి ‘తెలంగాణ’ 1956లో వచ్చింది. మహైకను సంగిసెట్టి శ్రీనివాస్‌ సంపాదక త్వంలో తెలంగాణ ప్రచురణల వారు డిసెంబరు 2017లో పున ర్ముద్రించి వెలుగులోకి తెచ్చారు.


ఈ సందర్భంగా దీర్ఘ కవితా కావ్యాల గురించి, ఆవిర్భావ వికాసాల గురించి కూడా కొంత చెప్పాలి. తెలుగు సాహిత్యంలో వచనకవిత్వం వరదలా దూసుకురావడం ఆరంభమైన కొంత కాలానికి, కవితల నిడివి పొడుగుల గురించి చర్చ మొదలైంది. దీనికి కారణం వచన కవిత్వం రాసే వారందరూ 25 లేక 30 పంక్తుల్లో ముగించడంవల్ల వాటినే వచన కవితలని పిలుస్తూ వచ్చాం. ‘‘ఆరు ఆశ్వాసాల గ్రంథంలోనే రసాధిదేవత సాక్షాత్క రిస్తుందికానీ ఆరుచరణాల గీతంలో ఉండదనుకోవడం, పొర పాటు. మహా కావ్యానికి క్రైటెరియా సైజు బరువూ కావయా, నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతే, నేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలే!’’ అని ఆరుద్ర ‘సినీవాలి’ పుస్తకం ముందు మాటలో శ్రీశ్రీ అభిప్రాయ పడ్డారు. వాస్తవానికి వచనకవితకు ఇన్ని పేజీలు ఉండాలన్న నియమ నిబంధనలేమీ లేవు. తర్వాతి కాలంలో విషయం విస్తృతంగా చెప్పాలన్న బలమైనకాంక్ష ఈ దీర్ఘకవితా ప్రక్రియకు బాటలు వేసింది. కుందుర్తిగారి కాలం లోను, ఆ తర్వాత వచ్చిన కవులు వచన కవిత అని రాస్తూనే ఆదిప్రాస కాని, అంత్యప్రాస కాని, పాదంలో యతి అక్షరాన్ని కానీ వేస్తూ ఒక లయను అంటే ధ్వనిపరమైన ఒక సమాన లక్షణాన్ని తేవడానికి ప్రయత్నించారు. వివిధరకాల సంభోధనలను కూడా మధ్యలో తేవడంవంటి పనులు చేసి, వచన కవిత నిర్మాణంలో ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనివల్ల వచన కవిత్వంకూడా ఒక లయ, తూగు శబ్దాడంబరాలతో పద్యంలాగా సులభంగా గుర్తుపెట్టుకునేందుకు తోడ్పడిందని చెప్పుకోవచ్చు.


వచన కవిత్వం పేరుతో ఆనాడు, ఈనాడు రాస్తున్న చాలమంది కవితల విషయంలో అవి కవితలు అని గట్టిగా చెప్పగలిగే అంశం కొంతే కనిపిస్తుందని విమర్శకులు అనడంలో కొన్ని కారణాలు ఉన్నాయనిపిస్తుంది. పాదాల విభజనతో రాసి ఇది వచన కవిత అని చెప్పే చాలా కవిత్వాలలో అసలు కవిత్వం ఉండదన్న అపప్రథ ఎలాగూ ఉండనే ఉంది. కేవలం వచన ప్రాయమైన వీటిని కవిత అని పిలవడానికి ప్రాథమిక స్థాయిలో ఉపయోగపడేది పాద విభజనే! పాద విభజన లేకుండా పేరాలు పేరాలుగా రాస్తే ఈ వచన కవిత్వం వచనంలాగే కనిపిస్తుంది. అందుకే వచన కవితను పాదవిభజన లేకుండా రాయడం అంటే సాహసోపేతమైన చర్య అని అనాలి. తెలుగులో పాద విభజన లేకుండా వచ్చిన మొదటి కవిత శేషేంద్రగారి ‘నా దేశం నా ప్రజలు’. ఇందులోని కవి ప్రతిభ ఏమిటంటే ఇక్కడ కవిత్వాన్ని కథలో లాగా నవలల్లో లాగా పేరాలు పేరాలుగా రాశారు. కానీ దీన్ని చదువుతుంటే ఏ పాఠకుడు కూడా దీన్ని వచనం అని అనుకోలేరు. ఇలా రాయడానికి సాహసం, సృజనాత్మక ప్రతిభ నిండుగా కావలసి ఉంటుంది. అందుకే శేషేంద్రను సాహసోపేతమైన కవి అన్నారు. 


ప్రముఖ కవి, విమర్శకుడు డా.అద్దేపల్లి రామమోహనరావు మాటల్లో చెప్పాలంటే ‘‘దీర్ఘ కావ్యాల గురించి, కుందుర్తి ఊహ అనంతకాలంలో మరోవిధంగా సఫలమైంది. కథ, పాత్ర, నాటకీయత మొదలైన వాటికోసం కథలూ, నాటకాలూ, నవలలూ మొద లైనవి అసంఖ్యాకంగా వచ్చాయి కాబట్టి, వచన కవితలో కథ లేకపోయినా భావాల్ని విస్తృత రూపంలో చిత్రించే ‘దీర్ఘ కవిత’ అనే రూపం వచన కవితా పరిణామంలో విశిష్ట రూపంగా బయటికి వచ్చింది. అన్ని రంగాల గురించి వివరంగా విస్తృతంగా చెప్పాలన్న తపన కవిలో పెరగడం ఇందుకు కారణం. మొదట్లో కవి కవిత్వాన్నే చెప్పాడు కానీ, ఆధునిక కాలంలో రాజకీయం, చరిత్ర, శాస్త్రజ్ఞానం మొదలైన అనేక అంశాలు కవి ప్రధాన చైతన్యంలో మిళితమైపోయాయి. ఈ సమగ్ర చైతన్యమే దీర్ఘకవిత రావడానికి ముఖ్య కారణం. అంతేకాక కవిలో వక్త, ప్రవక్త కూడా తమకు తగిన స్థానంలో కలిసిపోయారు. ఈ నేపథ్యమంతా ప్రభా వితం చేయడం వల్ల, వచనకవితా ఖండికలేకాక, దీర్ఘ కవిత కూడా వచన కవితా పరిణామంలో ఒక ముఖ్యభాగమైంది’’ అంటారు.


దీర్ఘ కవిత, దీర్ఘ కావ్యం అనే పేర్లతో వస్తున్న దీర్ఘ కవితలకు ఇప్పుడొక ప్రామాణిక రూపం వ్యవహారంలో ఉంది కానీ, దీని పుట్టుక వెనుక గమనించాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. పూర్వపు కావ్యాల్లో చెప్పుకునే కొన్ని లక్షణాలు ఇప్పటి దీర్ఘ కావ్యాల్లో కనిపిస్తాయి. ప్రాచీన కావ్యాల్లో స్కంధం, తరంగం, పర్వం, ఆశ్వాసం, ప్రకరణం అనే పేర్లతో విభాగాలుగా ఉండేవి. ఆవిధంగానే సినారె తన ‘నాగార్జున సాగరం’లో తరంగం అనే పేరుతో సూచించారు. శివారెడ్డిగారు ‘అల’ పేరుతో ఆసుపత్రి గీతంలో సూచించారు. సుమారు రెండు దశాబ్దులుగా సంఖ్యలను సూచికలుగా విభాగా లుగా వాడడం మొదలైంది. ప్రస్తుతం కవులు అధికంగా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు.  


ముగింపుగా పై మూలాల నుండి దీర్ఘ కావ్యాలకు కొన్ని రూప తాత్విక లక్షణాలను ప్రతిపాదించవచ్చు. వాస్తవానికి ఈ ప్రతిపాదన దీర్ఘ, లఘు వచన కవితలన్నింటికి సంబంధించిందే అయినా, నిర్వహణలో కవితా శక్తికి ప్రాధాన్యం. మొదట్లో దీర్ఘ కవిత అనే పదంమీద కొంత తిరస్కార భావం ఉన్నప్పటికి, ఆంగ్లంలో ఉన్న ‘లాంగ్‌ పోయిం’ అనే పదానికి సమానార్థకంగా వాడుతున్నాం. ఈ దీర్ఘ కవిత్వానికి కొన్ని లక్షణాలను ప్రతిపాదించాల్సి వస్తే అవి: 1. కవితను అందులోని అంశాన్ని విస్తృతంగా వ్యక్తం చేయడం. ఈ విస్తృతం అనే మాటకు మనం ఆ అంశాన్ని అన్ని కోణాల్లో, దృక్ప థాల్లో సంబంధిత అంశాలను వ్యక్తం చేయడం. 2. అంశానికి సంబంధించిన వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆర్థిక కోణాలను స్పర్శించడం. 3. కథనాత్మకంగా ఉండడం. 4. అనేక విలువల సమాహారంగా ఉండడం అనే అంశాలు ఇందులో ఇమిడి ఉంటా యని చెప్పవచ్చు. ఇదే సూక్ష్మంగా చెప్పాలంటే వచనత్వం, ఏక వస్తురూపం, సుదీర్ఘత, ప్రవాహగుణం, భాషా సారళ్యం ఈ దీర్ఘ కవితా లక్షణాలుగా భావించవచ్చు.


టేకుమళ్ళ వెంకటప్పయ్య

94904 00858

Updated Date - 2022-05-23T05:52:42+05:30 IST