ఉక్కు.. ఊపిరి

ABN , First Publish Date - 2021-04-23T09:33:02+05:30 IST

‘‘దేశమంతా ఆక్సిజన్‌ దొరక్క కరోనారోగులు అల్లాడిపోతున్నారు. ఈ రోజు ప్రత్యేక రైలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది.

ఉక్కు.. ఊపిరి

విశాఖ ప్లాంట్‌ నుంచి తొలి ఆక్సిజన్‌ రైలు

ఏడు ట్యాంకర్లలో 105 టన్నులు ఫిల్లింగ్‌

యజ్ఞాన్ని తలపించిన సరఫరా ప్రక్రియ

ఐదు గంటలకుపైగా పట్టిన సమయం

రెండే స్టేషన్లు ఉండటంతో ఎక్కువ టైమ్‌

కదలకుండా ట్యాంకర్లలోని గాలి తీసివేత

కిందకు దించి.. నింపి ఎక్కించడానికి 

ప్లాంట్‌లో ప్రత్యేకంగా ర్యాంప్‌ నిర్మాణం

నింపిన ట్యాంకర్లతో మహారాష్ట్రకు రైలు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): దేశంలో మొట్టమొదటి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు’ విశాఖపట్నం నుంచి గురువారం రాత్రి మహారాష్ట్ర బయలుదేరింది. మహారాష్ట్రలో కరోనా ఉధృతంగా ఉండి, ఆక్సిజన్‌ కొరత అధికంగా వున్న నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నుంచి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం సోమవారం రాత్రి మహారాష్ట్ర కలంబోలి నుంచి ఏడు ఆక్సిజన్‌ ట్యాంకర్లతో ఓ రైలును విశాఖపట్నం పంపించింది. అది రెండు రోజులు ప్రయాణించి, గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్టీల్‌ప్లాంటుకు చేరింది. స్టీల్‌ప్లాంటుకు చేరిన రైలు నుంచి ట్యాంకర్లను కిందికి దించి, వాటిలో ఆక్సిజన్‌ నింపి, తిరిగి వాటిని రైలుపైకి ఎక్కించడం ఓ యజ్ఞంలా సాగింది. ప్రతి పనికి గంటల సమయం పట్టింది. రైలుపై ట్యాంకర్లను తీసుకువచ్చినప్పుడు...అవి కదిలిపోకూడదని, టైర్లలో గాలిని తీసేశారు. విశాఖపట్నం చేరిన తరువాత వాటిని కిందకు దించడానికి మళ్లీ ఆ టైర్లలో నైట్రోజన్‌ వాయువును నింపాల్సి వచ్చింది.


ఉదయం 4 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమమే నడిచింది. ట్యాంకర్లను రైలు పైనుంచి జాగ్రత్తగా దింపడానికి స్టీల్‌ప్లాంటు అధికారులు ‘రోల్‌ ఆన్‌...రోల్‌ ఆఫ్‌’ అనే ర్యాంప్‌ నిర్మించారు. దాని మీదుగా ట్యాంకర్లను భూమి మీదకు తీసుకొచ్చి...ఆక్సిజన్‌ ప్లాంటుకు తరలించారు. స్టీల్‌ప్లాంటులో ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక స్టేషన్‌ ట్యాంకర్‌ను గంటన్నరలో నింపగా, మరొకటి 4 నుంచి 5 గంటల సమయం తీసుకుంది. దాంతో ఫిల్లింగ్‌కే అధిక సమయం పట్టింది. ఒక స్టేషన్‌లో 5 ట్యాంకర్లు, మరో స్టేషన్‌లో రెండు ట్యాంకర్లను ఆక్సిజన్‌తో నింపారు. ఒక్కో ట్యాంకర్‌లోకి 15 టన్నుల చొప్పున మొత్తం ఏడు ట్యాంకర్లలోకి 105 టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ఎక్కించారు. ఆ తరువాత వాటిని ర్యాంప్‌ మీదుగా రైలు పైకి ఎక్కించి, మళ్లీ టైర్లలో కొంత గాలి తీసేశారు.


ట్యాంకర్‌ ఎత్తు తగ్గించడానికి, కదలకుండా వుండేందుకు ముందు జాగ్రత్తగా అలా చేశారని అధికారులు తెలిపారు. ఈ ఏడు ట్యాంకర్లలో నాలుగు నాసిక్‌, మరో మూడు కలంబోలికి పంపుతున్నట్టు వాల్తేరు డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌ తెలిపారు. ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు 40-50 కి.మీ. వేగంతోనే ప్రయాణిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియను స్టీల్‌ప్లాంటు సీఎండీ పీకే రథ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.


వద్దనుకున్న ప్లాంటే ప్రాణాలు కాపాడుతోంది

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందని, అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని వ్యతిరేకిస్తూ గత రెండున్నర నెలలుగా కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. కేంద్రం వీసమెత్తు కూడా చలించలేదు. మనసు మార్చుకోలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా వల్ల పరిస్థితులు బాగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంటు నుంచి ఆక్సిజన్‌ తరలిస్తోంది. సొంత ప్రయోజనాలకు స్టీల్‌ప్లాంటును వినియోగించుకుంటున్న కేంద్రం, ఆంధ్రులు ప్రాణాలొడ్డి సాధించుకున్న ప్లాంటును ఎలా అమ్మేస్తుందని ఇక్కడి రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


‘‘దేశమంతా ఆక్సిజన్‌ దొరక్క కరోనారోగులు అల్లాడిపోతున్నారు. ఈ రోజు ప్రత్యేక రైలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి ఆక్సిజన్‌ని మహారాష్ట్రకు తీసుకెళుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెడుతోంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని, ప్రైవేటుపరం చేయడం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి?’’ 

- నటుడు చిరంజీవి ట్వీట్‌ 

Updated Date - 2021-04-23T09:33:02+05:30 IST