భారతావని నుదుట ‘అరుణ’ తిలకం

Published: Sun, 03 Jul 2022 12:36:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారతావని నుదుట అరుణ తిలకం

ఈశాన్య రాష్ట్రాల్లోని ఏడుగురు అక్కాచెల్లెళ్లలో పెద్దక్క. మన దేశంలో మొట్టమొదట ఉదయించే రాష్ట్రం. టిబెట్‌తో కలిసి 1129 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. ఈ తూర్పు హిమాలయ భూభాగంలో బౌద్ధ సంస్కృతి అడుగడుగున కనిపిస్తుంది. అరుణారుణ వర్ణాలతో ఆద్యంతం కట్టిపడేసేదే అరుణాచల్‌ ప్రదేశ్‌...


ప్రయాణసమయంలో కూడా కనురెప్ప వాల్చనివ్వని అందాల అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఈ వేసవిలో నాలుగు రోజులు పర్యటించాం. చైనా, భారత సరిహద్దు ప్రాంతమైన తవాంగ్‌ చేరాలంటే మధ్యలో రూప, దైరంగ్‌, బొమ్డిలా, భోలుక్‌పాంగ్‌, డీమాచంగ్‌లలో ఏదో ఒక గ్రామంలో ఆగాల్సిందే. ఈ గ్రామాలన్నీ ప్రకృతి సౌందర్యానికి, పల్లె జీవనానికి ప్రతిబింబాలు. ఈ ప్రాంతంలో నివసించే ప్రధాన తెగలు మొంపాలు, మిజీలు, అకాలు, కావాలు, షెర్డుకెపెన్‌లు. వారంతా అమాయకత్వానికి, సాంప్రదాయానికి మారుపేర్లుగా చెప్పుకోవాలి. మేము రూప గ్రామంలో సేదదీరాం. దారి పొడవునా చిన్న చిన్న మందిరాలు, వాటిల్లో రంగురంగుల చిత్రలేఖనాలతో బుద్ధ బెల్స్‌, బోంషో బెల్స్‌... వాటి మీద అనేక మంత్రాలుంటాయి. ఈ ప్రార్థనా చక్రాలను మనం ఒక్కసారి తిప్పితే వాటి మీద రాసిన వన్నీ ఒకసారి పఠించినట్లుగా పేర్కొంటారు. సామాన్యులకు ఏకాగ్రత కుదరదని, వీటిని తిప్పితే ఇహలోకంలో తరించి, పరలోకంలో అవలోకితేశ్వరుడిని చేరతారని 14వ దలైలామా పేర్కొన్నారని చెబుతారు. తెంగా గ్రామంలో ఉండే ఈ గ్రామం సముద్ర మట్టానికి 6500 అడుగుల ఎత్తులో ఉంటుంది.


అతి పెద్ద బౌద్ధమఠం...

అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి అడుగు పెట్టాలంటే ‘ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ పాస్‌’ (ఐఎల్‌పీ) ఉండాలి. అసోమ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉండే అనేక గ్రామాల్లోకి మేము బాలెము ద్వారా అడుగుపెట్టాం. బాలెము పంచాయితీలో 13 ఇళ్లు ఉంటాయి. ఊరి వెనకే భూటాన్‌ సరిహద్దు కనిపిస్తుంది. రూప గ్రామంలో ఉదయం నాలుగున్నరకే తెల్లవారుతుంది. పది గంటలకు మేము 11,500 అడుగుల ఎత్తుకు చేరుకున్నాం. ఇంత ఎత్తులో కూడా ఎస్‌బీఐ బ్యాంక్‌ ఏటీఎమ్‌ను చూసి ఆశ్చర్యపోయాం. 2017లో దీనిని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఉంది. మరో రెండు వేల అడుగుల ఎత్తుకు వెళితే ‘సేలాపాస్‌’ వస్తుంది. చుట్టూ మంచుకొండలు, జేలా సరస్సు, దేశానికి పహారా కాస్తున్న యోధులను చూస్తే రొమాంచితంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో 101 పవిత్రమైన సరస్సులున్నాయి. వాటిలో జేలా కూడా ఒకటి.  ఇక్కడే తవాంగ్‌ స్వాగతద్వారం ఉంటుంది. దేవదారు వృక్షాలు, కొండల కిందికి దిగిన మేఘాలను చూస్తూ జస్వంత్‌ రాక్‌ మెమోరియల్‌ లోపలికి ప్రవేశించాం. చైనీయులతో 72 గంటలపాటు ఏకబికిన పోరాడి అమరుడైన జస్వంత్‌సింగ్‌ రావత్‌ సమాధి అది. అక్కడ ఆయన టోపీ, తుపాకీ చూడగానే ‘జైహింద్‌’ అనే నినాదం అందరి నోటి నుంచి వచ్చేసింది. మనదేశంలో అతి పెద్ద మోనాస్ట్రీ తవాంగ్‌. ప్రపంచంలో రెండోది (మొదటిది టిబెట్‌లోని లాసా ఉంది) ఇది. ఇక్కడ సుమారుగా 500 మంది లామాలు (బౌద్ధ సన్యాసులు) ఉన్నారు. గుండ్రంగా తిరిగే అతి పెద్ద ప్రార్థనా చక్రాలు, నిరంతరం వెలిగే దీపాలు మోనాస్ట్రీ పరిసరాల్లో కనువిందు చేస్తాయి. లోపలికి వెళితే బంగారు వర్ణంతో మెరిసిపోయే 8 మీటర్ల ఎత్తున్న భారీ గౌతమబుద్ధుడిని చూడటానికి రెండు కళ్లు చాలవు. 400 ఏళ్ల క్రితం దీనిని 5వ దలైలామా ఆధ్వర్యంలో నిర్మించారట.

దారిపొడవునా సరస్సులు...

రెండోరోజు తవాంగ్‌ సమీపంలోని బుమ్‌ లా పాస్‌ అనే ప్రాంతానికి వెళ్లాము. దారిపొడవునా పెద్ద పెద్ద సరస్సులు, పర్వతాలను చూస్తూ 15,200 అడుగుల ఎత్తులో ఉన్న క్లామెటా చెక్‌పోస్ట్‌ చేరాం. ఇది భారత్‌, చైనా సరిహద్దు ప్రాంతం. అటువైపు చైనా సైనికులున్నారు. అవతలి పర్వతాలు ఇంకా ఎత్తుగా ఉండటం వల్ల (20 వేల అడుగుల పైన) యుద్ధంలో చైనీయులకు సానుకూల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అక్కడి మన సైనికులు చెప్పారు. వారి కోసం కట్టిన ఇగ్లూలు ఆకర్షి స్తాయి. తిరిగి వస్తుంటే ‘సొలగ్‌ స్టార్‌’ సరస్సు కనిపిస్తుంది. ఇక్కడ బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ సినిమా ఒకటి షూటింగ్‌ జరగడంతో అప్పటినుంచి ఈ సరస్సును మాధురీ లేక్‌ అంటున్నారు. మొత్తానికి సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ను ఎందుకు ‘భరతమాత నుదుట సిందూరం’ అంటారో అక్కడికి వెళ్లిన తర్వాత అర్థమయ్యింది.

            - సి.మనోరమ, 98480 87544

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఓపెన్ హార్ట్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.