24 గంటల్లోపు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం: ట్రంప్

ABN , First Publish Date - 2020-12-12T15:04:21+05:30 IST

ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగానికి శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

24 గంటల్లోపు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం: ట్రంప్

వాషింగ్టన్: ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగానికి శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో 24 గంటల్లోపు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. "ఫైజర్ తొలి వ్యాక్సిన్‌ను 24 గంటల్లోపు అందిస్తాం. టీకాను వివిధ రాష్ట్రాలకు తరలించడానికి ఫెడెక్స్, యూపీఎస్‌తో ఒప్పందం జరిగింది. ఇప్పటికే ప్రతి రాష్ట్రానికి వ్యాక్సిన్ తరలింపు కూడా ప్రారంభమైంది." అని ట్రంప్ అన్నారు. కాగా, వ్యాక్సిన్ మొదట ఎవరికి అందించాలనే నిర్ణయం ఆయా రాష్ట్రాల గవర్నర్లదేనని స్పష్టం చేశారు.  


"మా అభిప్రాయం ప్రకారమైతే వయో వృద్ధులు, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు మొదట టీకా అందిస్తే బాగుంటుంది. దీనివల్ల మరణాలు, ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది." అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఒప్పందం ప్రకారం మార్చి నాటికి యూఎస్‌కు ఫైజర్ 100 మిలియన్ డోసుల్ని అందించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ట్రంప్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వ్యాక్సిన్ మొదట అమెరికన్లకే ఇస్తామని ట్రంప్ ప్రకటించడం జరిగింది. 

Updated Date - 2020-12-12T15:04:21+05:30 IST