నిండా ముంచిన కాళేశ్వరం ప్రాజెక్టు

ABN , First Publish Date - 2021-07-25T05:57:11+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు మంథని ప్రాంతం రైతాంగాన్ని నిండా ముంచింది.

నిండా ముంచిన కాళేశ్వరం ప్రాజెక్టు
ఓండ్రు మట్టి నిండిన వరి పొలం

- వరదనీరు, ఇసుక మేటలతో వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం

- నీటిపాలైన విద్యుత్‌మోటర్లు, ఎరువుల బస్తాలు

- ఆందోళనలో బాధిత రైతులు

మంథని/మంథనిరూరల్‌, జూలై 24: కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు మంథని ప్రాంతం రైతాంగాన్ని నిండా ముంచింది. నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తివేయడంతో నదితీరంలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదనీరు నది తీరంలోని, శివారులోని లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చి చేరడంతో మండలంలో 1822 ఎకరాల్లో వరి, 507 ఎకరాల్లో పత్తి, 58 ఎకరాల్లో మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో ఒండ్రు మట్టి, ఇసుకమేటలు వేశాయి. రెండు రోజుల వరద తాకిడికి పంటలు పూర్తి దెబ్బతిన్నాయి. మంథని మండలంలో గోదావరి నదితీరంలో కాసిపేటలో 95 ఎకరాల్లో, సిరిపురంలో 102  ఎకరాల్లో, మంథనిలో 250 ఎకరాల్లో, పోతారంలో 155 ఎకరాల్లో, విలోచవరంలో 300 ఎకరాల్లో, ఖాన్‌సాయిపేటలో 50 ఎకరాల్లో, ఖానాపూర్‌లో 600 ఎకరాల్లో, ఎక్లాస్‌పూర్‌ 250 ఎకరాల్లో, బిట్టుపల్లిలో 20 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగాయి. మండలంలోని పోతారంలో 150 ఎకరాల్లో, సిరిపురంలో 38 ఎకరాల్లో, కాసిపేలో 29 ఎకరాల్లో, ఉప్పట్ల 150 ఎకరాల్లో, విలోచవరంలో 110 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని ఉప్పట్లలో ఎర్ర మిర్చి 28, పోతారంలో 30 ఎకరాల్లో దెబ్బతింది. దెబ్బతిన్న పంట పొలాలను డీఏవో తిరుమలప్రసాద్‌, ఏడీఏ మురళి, ఏవో అనూషలు దెబ్బతిన్న పంటలను సర్వే చేసి నివేదికలు పంపారు. 

పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

గోదావరినది వరద నీరు, వర్షం కారణంగా వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. మండంలోని పోతారం, ఖానాపూర్‌, ఖాన్‌సాయిపేట గ్రామాల్లో శనివారం శ్రీధర్‌బాబు గోదావరినది వరదతో ముంపునకు గురైన వరిపొలాలు, పత్తి చేన్లను ట్రాక్టర్‌పై రైతులు, నాయకులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట నష్టం జరిగినా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలు ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఇంజనీరింగ్‌ తప్పిదం వలన ప్రాజెక్టు కంటే ముందు బ్యాక్‌వాటర్‌ ఎంత వస్తుందనే, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎంత మేరకు నీరు వస్తుందనే ఆలోచన చేయలేదన్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు. వర్షాలు కురిసిన 24 గంటల్లో ప్రాజెక్టుల కింద రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండ నీటి విడుదల చేయడం వలన రైతులు అనేక రకాలుగా నష్టపోయారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలో అనేకసార్లు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు వదిలినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయమై విన్నవించినా అధికారులు ఆ దిశగా ఆలోచన చేయలన్నారు. ప్రాజెక్టు పరిధిలో మూడు బ్యారేజీలు నిర్మించినా కూడా ఇక్కడ ఒక రైతు భూమికి కూడా నీళ్ళు ఇవ్వడం లేదన్నారు. దాదాపు 2వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు, ఎరువుల బస్తాలు, విద్యుత్‌మోటార్లు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కో-అర్డినేటర్‌ శశిభూషణ్‌కాచే, మండల పార్టీ అధ్యక్షుడు సెగ్గెం రాజేష్‌, నేతుల పెండ్రు రమాదేవి, జంజర్ల శేఖర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:57:11+05:30 IST