ఆదివాసీల అరణ్య రోదన

ABN , First Publish Date - 2022-08-09T10:27:59+05:30 IST

ఆదివాసీ ప్రాంతాల్లో ఇతరులు తిష్టవేసి వారి హక్కులను కొల్లగొడుతున్నారు. దీనిపై అడవిబిడ్డలు మొత్తుకున్నా పట్టించుకునే దిక్కులేదు.

ఆదివాసీల అరణ్య రోదన

  • వైసీపీ పాలనలో అధోగతి
  • 18 గిరిజన పథకాలు రద్దు
  • భర్తీ కాని బ్యాక్‌లాగ్‌ పోస్టులు
  • విద్యకు దూరమవుతున్న అడవిబిడ్డలు


రాష్ట్రంలో ఆదివాసీల కష్టాలు అరణ్య రోదనగా మారాయి. కొండ కోనల్లో జీవిస్తున్న ఈ అడవి బిడ్డలకు దక్కాల్సిన నిధులు, హక్కులు దక్కడం లేదు. ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నా.. ఆ పోరాటాల్లో సమిధలుగా మిగిలిపోతున్నారే తప్ప, వారి గోడును ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం(ఆగస్టు 9) సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆదివాసీ ప్రాంతాల్లో ఇతరులు తిష్టవేసి వారి హక్కులను కొల్లగొడుతున్నారు. దీనిపై అడవిబిడ్డలు మొత్తుకున్నా పట్టించుకునే దిక్కులేదు. ఏజెన్సీ ఏరియాలో కూడా ఒకటిన్నర సెంట్లు బయటి వారికి పట్టాలిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేయడంపై గిరిజనులు మండిపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల తాత్సారంతో గిరిజన హక్కుల ఉల్లంఘన జరిగిందని, వారికి ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఉత్తర్వులకే పరిమితమైందని జాతీ య ఎస్టీ కమిషన్‌ తీవ్రంగా తప్పుబట్టినా, ఉపశమనం కల్పించిన పరిస్థితులు లేవు. అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టుల పేరిట ఆదివాసుల గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఆదివాసీ గ్రామాల ఓటర్ల జాబితాలో ఇతరులు ఉన్నందున స్వయంపాలన బదులుగా ఆదివాసేతరల పాలన సాగే ప్రమాదమేర్పడింది. గనుల తవ్వకం కాంట్రాక్టులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా ఆదివాసులను అక్కడి నుంచి తరిమేస్తున్నారు. బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టే జీవో 91ని రద్దు చేస్తున్నట్లు చెప్పి దొడ్డిదారిన జీవో 87ను తీసుకొచ్చి లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ను కూడా తవ్వేస్తున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీలో 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులకు ఎలాంటి హక్కులూ ఉండవు. గిరిజనేతరులు అక్కడ ఎలాంటి కట్టడాలూ నిర్మించకూడదని నిషేధం ఉంది. కానీ షాపులు, హోటళ్లు, రిసార్ట్స్‌, లాడ్జీలు కడుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. భూములను గిరిజనేతరులు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు.


విద్యకు దూరం..

ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు జగన్‌ మాటిచ్చారు. దానికి విరుద్ధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ జీవో 117 తీసుకొచ్చారు. దీంతో చదువు కోసం కొన్ని చోట్ల 30 కి.మీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి విద్యకు స్వస్తి పలుకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ నియామకాల్లో నూరుశాతం స్థానిక గిరిజనులకే ఉండేది. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు వల్ల గిరిజనులు నష్టపోయారు. సమీక్ష పిటీషన్‌ వేయాల్సిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీ స్టడీ సర్కిల్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా, నేటికి ఇక్కడ నెలకొల్పలేదు. ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయలేదు. 2014లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే నిర్మాణానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురుకులాల్లో టీచర్లు లేరు, వసతులు లేవు, బడ్జెట్‌ అరకొరగానే ఉంది. నాన్‌ టీచింగ్‌ పోస్టుల్లో గిరిజనులకు ప్రాధాన్యం లేకుండా చేశారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను రద్దు చేసి గిరిజనులకు కార్పొరేట్‌ విద్యను దూరం చేశారు. గిరిజన విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాన్నీ మూడేళ్లపాటు నిలిపేశారు. పాఠశాలల విలీనంలో గిరిజన వికాస కేంద్రాలనూ చేర్చుతున్నారని, దీంతో తమ పిల్లలు విద్య దూరమవుతున్నారని గిరిజనులు వాపోతున్నారు.


పథకాలు రద్దుపై మండిపాటు..

రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు అమలవుతున్న 18రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు రద్దు చేశారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల విజయవాడలో 52 గిరిజన సంఘాలు సమావేశమై ప్రభుత్వంపై నిరసన  వ్యక్తం చేశాయి. దేవస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన ప్రభుత్వం అన్నవరం, శ్రీశైలం, టీటీడీ లాంటి దేవస్థానాల్లో గిరిజనులకు స్థానం కల్పించిందా? అని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లుగా ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కరికీ ఒక్క రుణం అందలేదు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం ఉన్నప్పటికీ గిరిజనులకు కేటాయించిన నిధులను యథేచ్ఛగా దారి మళ్లించారు. కేంద్రం నిధులతో ఎస్టీ నిరుద్యోగుల అభివృద్ధి కోసం ఇచ్చే రవాణా వాహనాలు, ఆటోలు, కార్లు, వారి కోసం భూమి కొనుగోలు పథకం కూడా మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ఎన్‌టీఎ్‌ఫడీసీ నిధులు కూడా మళ్లిస్తున్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ, బంజరు భూములకు పట్టాల్లేవు. గతంలో హౌసింగ్‌స్కీం ద్వారా ఇళ్లు నిర్మించుకున్న గిరిజన లబ్ధిదారులకు నేటికీ బిల్లులు చెల్లించలేదు. యానాదులు, ఎరుకల తెగ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్‌, ఎక్కడా ఆ మాటే ఎత్తడం లేదు. అధికారంలోకి వచ్చీ రాగానే గిరిజనులకు నాణ్యమైన విద్యను దూరం చేసే ఉద్దేశ్యంతో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను ఎత్తేశారు. గిరిజనులకు ఇస్తున్న చంద్రన్న కల్యాణ కానుకను ఆపేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో అమలైన 18రకాల పథకాలను జగన్‌ రద్దు చేశారని చెబుతున్నారు. 


ఎస్టీ కమిషన్‌ ఆదేశించి ఏడాదైనా..

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. గిరిజనులను ముంచేశారని, ప్రభుత్వ నాన్చుడు ధోరణితో వారి హక్కులకు తీవ్ర భంగం ఏర్పడిందని గతేడాది పోలవరంలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్‌ మండిపడింది. గిరిజనుల రాజ్యాంగపరమైన హక్కులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొంది. నిర్వాసితులకు భూమికి బదులు భూమి కేటాయించినా, అవి వ్యవసాయం చేసేందుకు అనుకూలంగా లేవని పేర్కొంది. ఏపీ ప్రభుత్వ హామీ ప్రకారం ఇవ్వాల్సిన అదనపు రూ.10 లక్షలు ఇంకా ఇవ్వలేదంది. వీటిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ డైరెక్టర్‌లను ఎస్టీ కమిషన్‌ ఆదేశించి ఏడాదైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.


చట్టసభల్లో తగ్గిపోయిన ప్రాతినిధ్యం

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం తగ్గింది. గిరిజన ఎమ్మెల్యే సీట్లన్నింటిలో వైసీపీ అభ్యర్థులను గెలిపించిన ఏజెన్సీ ప్రజలు ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా గిరిజనులకు దక్కించుకోలేకపోయారు. 48 మంది ప్రభుత్వ సలహాదారులను నియమిస్తే, అందులోనూ ఒక్క ఎస్టీకి కూడా అవకాశమివ్వలేదని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనుముల వంశీకృష్ణ తెలిపారు. గిరిజన హక్కులు, అభివృద్ధి, గిరిజన నిధులు ఖర్చు కోసం గిరిజనులందరూ ప్రభుత్వంపై పోరాటా చేయాల్సిన అవసరముందని గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. 


ఆదివాసీల ఆందోళన

సమస్యల పరిష్కారం కోరుతూ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పిత్రిగెడ్డ గ్రామ గిరిజనులు సోమవారం ఆందోళన చేశారు. నడుముకు అడ్డాకులు చుట్టుకుని, నెత్తిన అడ్డాకుల టోపీలు ధరించి డోలీలతో నాలుగు కిలోమీటర్ల మేర ప్రదర్శన చేశారు. గ్రామానికి అంగన్‌వాడీ కేంద్రం, రేషన్‌ డిపో, ప్రాథమిక పాఠశాల, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

  1. - రోలుగుంట

Updated Date - 2022-08-09T10:27:59+05:30 IST