రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

ABN , First Publish Date - 2022-06-30T04:05:46+05:30 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడి నాయకత్వంలో కాంగ్రెస్‌ పూర్వవైభవం దిశగా పయనిస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ అన్నారు.

రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం
సమావేశంలో మాట్లాడుతున్న బోడ జనార్దన్‌

-మాజీ మంత్రి బోడ జనార్దన్‌

మంచిర్యాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడి నాయకత్వంలో కాంగ్రెస్‌ పూర్వవైభవం దిశగా పయనిస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం బుధవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నా రు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి సర్వసాధారణం అయిందని, ఇన్‌కం టాక్స్‌ డిపార్టుమెంట్‌ 40 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడమే దీనికి నిదర్శనమని చెప్పారు. అధికార టీఆర్‌ఎస్‌ నేతల అవినీతిని ప్రజా కోర్టులో పెట్టి, వారి ఓటమికి కోసం పని చేస్తామని వివరించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు అవినీతి మయమయ్యాయని, వాటిలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో ఒక గుంట భూమి కూడా పారలేదని, ప్రాజెక్టు ముంపు గ్రామాలకు పరిహారం చెల్లించడంలోనూ జాప్యం చేస్తున్నారని అన్నారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం సొంత జిల్లాతోపాటు ఆయన పొలాల కోసమే నిర్మించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, వ్యవసాయ రంగం పూర్తిగా నిరాధరణకు గురవుతున్నాయని అన్నారు. దళితబంధు కొత్త పథకమేమీ కాదని చెప్పారు. గతంలో ఎస్సీలకు ఉన్న పథకానికే మార్పులు చేశారని అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ కార్పొరేషన్‌ల ద్వారా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసేవారన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ ఓటమి భయంతోనే జాతీయ పార్టీ అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు. తద్వారా ప్రజల ధృష్టిని మరల్చి తిరిగి లాభపడేందుకే ఆరాటపడుతున్నారని విమర్శిం చారు. జిల్లాలో కాంగ్రెస్‌ నేతలతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాన ని స్పష్టం చేశారు.  సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు జూల లక్ష్మణ్‌, పొట్ట మధూకర్‌, మంతెన శ్రీనివాస్‌, బోడ రాజమౌళి, జాడి ప్రభాకర్‌, సమ్మయ్య, అశోక్‌రెడ్డి, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T04:05:46+05:30 IST