తోట ఎండింది...

ABN , First Publish Date - 2022-09-26T04:50:39+05:30 IST

చెండుమల్లి పూలకు ధరాఘాతం ఏర్పడింది. ధరలు పతనం కావడంతో చేసేది లేక పూలు కోయకుండా పొలంలోనే వదిలేస్తున్నారు.

తోట ఎండింది...
ములకలచెరువు సమీపంలో పొలంలో ఎండుతున్న చెండుమల్లి పూలు

చెండుమల్లి పూలకు ధరాఘాతం

పొలంలో వదిలేసిన వైనం...

ఎండుతున్న పూలు, చెట్లు


ములకలచెరువు, సెప్టెంబరు 25: చెండుమల్లి పూలకు ధరాఘాతం ఏర్పడింది. ధరలు పతనం కావడంతో చేసేది లేక పూలు కోయకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరతో పూలు కోస్తే కనీసం కూలీలకు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలోని కదిరినాధునికోట పంచాయతీ గాలేటివారిపల్లెకు చెందిన రైతు మల్లెం శ్రీనివాసులు రెండు ఎకరాల్లో చెండుమల్లి సాగు చేశాడు. మల్చింగ్‌ షీటు పరిచి మొక్కలు కొనుగోలు చేసి నాటించాడు. రెండు ఎకరాల్లో సాగుకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం పూలు కోత కొచ్చే సమయంలో ధరలు పతనమయ్యాయి. మూడు నెలల క్రితం కేజీ రూ.60 నుంచి రూ.100 వరకు పలికిన ధర పాతాళానికి చేరింది. ప్రస్తుతం కేజీ కేవలం రూ.10 నుంచి రూ.15 వరకు మాత్రమే పలుకుతోంది. రైతులు పండించిన పూలను హైదరాబాదు, విజయవాడ, మదనపల్లెలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ప్రస్తుతం ధరలు పతనం కావడంతో చేసేది లేక పూలు కోయకుండా అలాగే వదిలేశాడు. దీంతో చెట్లతో పాటు పూలు ఎండిపోతున్నాయి. చేతి కొచ్చిన పంట నోటి దగ్గరకు రాకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 

Updated Date - 2022-09-26T04:50:39+05:30 IST