పూలబాట కాదు ముళ్ల కిరీటం

ABN , First Publish Date - 2021-10-15T05:33:57+05:30 IST

రెండేళ్లపైబడి సుదీర్ఘ విరామం తర్వాత జిల్లా పరిషత్‌కు నూతన పాలకవర్గం ఇటీవలే కొలువుదీరింది. కొత్త పాలకవర్గానికి పరిషత్‌లో ఎన్నో సవాళ్లు ఆహ్వానం పలకబోతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ సంక్షోభ వేళ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇన్నాళ్లు పాలకవర్గం లేకపోవడంతో కేవలం ఆర్థిక సంఘం నిధులతోనే పరిషత్‌లు నెట్టుకొస్తున్నాయి. వాటి ఖర్చు విషయంలో కూడా కొన్నింటికి పాలకవర్గం ఆమోదం తప్పనిసరి కావడంతో నిబంధనలు అడ్డు వస్తూ అభివృద్ధి పనులు పడకేశాయి.

పూలబాట కాదు ముళ్ల కిరీటం
చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

కొలువుదీరిన పరిషత్‌ నూతన పాలకవర్గం

కొత్త చైర్‌పర్సన్‌కు పలు సవాళ్లు

పల్లెల్లో మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం

నిధుల లేమితో అసంపూర్తిగా ఆగిపోయిన పనులు

రూ.200కోట్లపైన సీనరేజి బకాయిలు రాబట్టాల్సిన అవసరం 

పరిషత్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఆడిటింగ్‌ అవశ్యం

పాలనలో కీలకంగా స్థాయిసంఘాలు

నేడు జడ్పీచైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 14: రెండేళ్లపైబడి సుదీర్ఘ విరామం తర్వాత జిల్లా పరిషత్‌కు నూతన పాలకవర్గం ఇటీవలే కొలువుదీరింది. కొత్త పాలకవర్గానికి పరిషత్‌లో ఎన్నో సవాళ్లు ఆహ్వానం పలకబోతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ సంక్షోభ వేళ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇన్నాళ్లు పాలకవర్గం లేకపోవడంతో కేవలం ఆర్థిక సంఘం నిధులతోనే పరిషత్‌లు నెట్టుకొస్తున్నాయి. వాటి ఖర్చు విషయంలో కూడా కొన్నింటికి పాలకవర్గం ఆమోదం తప్పనిసరి కావడంతో నిబంధనలు అడ్డు వస్తూ అభివృద్ధి పనులు పడకేశాయి. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు కనుక నిధుల ఖర్చులో కూడా వేగం పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది. పారిశుధ్యం, చేతిపంపుల ఏర్పాటుకు తోడు అంతర్గత రోడ్ల నిర్మాణం ఇలాంటి పనులన్నీ పరిషత్‌ భాగస్వామ్యంతో జరగాల్సి ఉంది. నిధులు సమృద్ధిగా లేకపోవడంతో ఈ పనులన్నీ మరుగునపడ్డాయి. గ్రామాల్లో దాహార్తి తీర్చడానికి ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాల్సిన బాధ్యతలో కూడా పరిషత్‌ పాలుపంచుకోవాల్సి ఉంటుంది. నిధుల లేమితో పరిషత్‌ కునారిల్లుతోంది. ప్రభుత్వం నుంచి సీనరేజి బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. అవి దాదాపు రూ.200 కోట్లపైనే పరిషత్‌కు జమ కావాల్సి ఉంది. పాలకవర్గం కొలువుదీరినందున  ఏటా ప్రభుత్వం విధిగా పరిషత్‌కు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. వాటిలో జిల్లాకు సింహభాగం దక్కే విధంగా పాలకవర్గం కృషిచేయాల్సి ఉంది. పరిషత్‌ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా సమగ్ర ఆడిటింగ్‌ జరిపించాల్సిన అవసరముంది. అన్నింటికీ మించి అధికారులతో పాలకవర్గానికి సమన్వయం కీలకం కాబోతోంది. ఈ సవాళ్లనన్నింటినీ అధిగమించి పాలనను గాడిన పెట్టడంతో పాటు జిల్లాలోని గ్రామాలను అభివృద్ధి పథం వైపు నడిపించాల్సిన బృహత్తర బాధ్యత కొత్త చైర్‌పర్సన్‌పై ఉంది.

రూ. 200కోట్లపైన సీనరేజి బకాయిలు

పరిషత్‌కు ఏళ్ల తరబడి నుంచి పెండింగ్‌ ఉన్న సీనరేజి నిధులకు మోక్షం కలగడం లేదు. 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2018--19 వరకూ ఉన్న సీనరేజి బకాయిలు రూ.200కోట్లపైనే ఉన్నాయి. పరిషత్‌కు ప్రత్యేకంగా వేరే ఆదాయ మార్గాలు లేకపోవడంతో గ్రాంట్లు, కేంద్రం ఇచ్చే నిధులతోనే అవి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది

నూతన భవనం కోసం ప్రతిపాదనలు

జిల్లా పరిషత్‌ భవనం కూడా శిథిలావస్థకు  చేరుకుంది. నూతన భవన నిర్మాణం కోసం యంత్రాంగం ఇప్పటికే ప్రతిపాదనలు తయారుచేసింది. తాజాగా కలెక్టర్‌ జడ్పీ ఆఫీస్‌ను సందర్శించినప్పుడు భవనం స్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి కొత్త భవన నిర్మాణానికి ప్రయత్నిస్తానన్నారు. స్థలం కూడా అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే పనులు వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

పాలనను గాడిలో పెట్టాలి

సుదీర్ఘకాలం పాలకవర్గం లేకపోవడంతో పరిషత్‌ పాలన కేవలం కార్యాలయాలకే పరిమితమైంది. చాలాచోట్ల అధికారులకు కిందిస్థాయి సిబ్బందికి సమన్వయం లేకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటిని చక్కదిద్ది మళ్లీ పాలనను గాడిలో పెట్టాలి.

సమర్థులకే స్థాయి సంఘాల్లో అవకాశం

పరిషత్‌ పాలనలో కీలకంగా ఉండే ఏడు స్థాయీ సంఘాల్లో సమర్థులైన జడ్పీటీసీ సభ్యులకు అవకాశం కల్పిస్తే పాలన సులభమవుతుంది. వ్యవసాయం, సంక్షేమం, ఆర్థికం, పనుల పురోగతి, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం ఇలా పలు విభాగాల్లో స్థాయీ సంఘాలను ఏర్పాటుచేయాల్సిన బాధ్యత చైర్‌పర్సన్‌పై ఉంటుంది

పరిషత్‌ ఆస్తుల ఆడిటింగ్‌...

పరిషత్‌ ఆస్తులు జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఉన్నాయి. వాటన్నింటిని గతంలో గుర్తించి వెబ్‌ల్యాండ్‌లో చేర్చారు. కానీ వివరాలు అసమగ్రంగానే ఉంటున్నాయి. పూర్వీకులు ఎంతోమంది ఉదార స్వభావంతో ప్రజాప్రయోజనాల కోసం పరిషత్‌కు ఆస్తులను రాసిచ్చారు. అనూహ్యంగా వాటి ధరలు ఆకాశాన్ని తాకడంతో వారి వారసులు వాటి విషయంలో పేచీకి దిగుతున్న సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే పరిషత్‌ ఆస్తులపై సమగ్రంగా ఆడిటింగ్‌ జరిపి పూర్తి రక్షణ కల్పిస్తేనే అవి అన్యాక్రాంతం కాకుండా ఉండే అవకాశం ఉంది. ఆస్తులపై కొత్త చైర్‌పర్సన్‌ ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది.


నేడు జడ్పీ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10గంటలకు చార్జ్‌ తీసుకోనుండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్‌పర్సన్‌ హోదాలో మొదటి సంతకం 14 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల ఫైల్‌పై పెట్టనున్నారు. మరో ఏడుగురికి ఉద్యోగోన్నతి కల్పించే పైల్‌పై కూడా వెంకాయమ్మ సంతకం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. 

Updated Date - 2021-10-15T05:33:57+05:30 IST